Share News

Ponguleti: మీరే టేప్‌ తెచ్చుకుని కొలుచుకోండి!

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:16 AM

మీరే టేప్‌ తెచ్చుకుని కొలుచుకోండి. నా ఇల్లు చెరువు బఫర్‌ జోన్లో ఉంటే కూల్చండి.. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్‌

Ponguleti: మీరే టేప్‌ తెచ్చుకుని కొలుచుకోండి!

  • నా ఇల్లు చెరువు బఫర్‌ జోన్లో ఉంటే కూల్చండి.. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్‌

  • 8 రూ.2 లక్షలు దాటిన

  • రుణ మాఫీ తేదీ త్వరలో ప్రకటిస్తాం

  • 8 18 వేల కోట్లు ఇచ్చాం...

  • మరో 13 వేల కోట్లు ఇవ్వనున్నాం

  • 8 విలేకరుల సమావేశంలో

  • మంత్రి శ్రీనివాసరెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ‘‘రెవెన్యూ మంత్రి ఇల్లు హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌లో, బఫర్‌ జోన్‌లో ఉందంటూ కేటీఆర్‌, ఆయన తొత్తులు కొందరు ఆరోపణలు చేస్తున్నరు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను ఆదేశిస్తా. గతంలో ఐదేళ్లు ఇరిగేషన్‌, మన్సిపల్‌ మంత్రులుగా పనిచేసిన హరీ్‌షరావు, కేటీఆర్‌లు.. కొత్త టేప్‌ను ఒక దాన్ని కొనుక్కుని రండి. వెంట వారి తొత్తులనూ తీసుకుని రండి. మా అధికారులు పక్కనే ఉంటరు. మీరే టేప్‌తో కొలుచుకోండి. నా ఇల్లు హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో గానీ, బఫర్‌ జోన్‌లో గానీ ఉంటే వెంటనే కూల్చేయండి’’ అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి సవాల్‌ విసిరారు. కొలిచిన తర్వాత వారి తలలు ఎక్కడ పెట్టుకుంటారో వారే నిర్ణయించుకోవాలన్నారు. కేటీఆర్‌తోనో, ఆయన బావ హరీ్‌షరావుతోనో, వారి నాయన కేసీఆర్‌తోనే చెప్పించుకునే అవకాశం పొంగులేటి ఇవ్వబోడని చెప్పారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడారు. తన ఇల్లు హిమాయత్‌సాగర్‌ బఫర్‌ జోన్‌లో ఉందో లేదో కొలిచేందుకు ఎప్పుడు వస్తారో చెబితే తానూ అక్కడే ఉంటానని చెప్పారు. కేటీఆర్‌ లాగా ఇల్లు తనది కాదని, లీజుకు తీసుకున్నానని చెప్పబోనని, ఆ ఇల్లు తనదేనని, తన కొడుకు పేరున ఉందని ప్రకటించారు. తన ఇల్లు తనదని చెప్పుకునే ధైర్యం కూడా కేటీఆర్‌కు లేదన్నారు. ఆయన ఫాంహౌ్‌సను నిజంగా లీజుకు తీసుకుంటే.. ఎంతకు తీసుకున్నాడో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ స్థలాలు, రిజర్వాయర్ల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో నిర్మాణాలపై ప్రభుత్వం నియమించిన హైడ్రాకు కోర్టు నుంచి ప్రశంసలు లభించాయని, సామాన్యుల నుంచీ అభినందనలు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లోను, నిబంధనలకు విరుద్దంగానూ ఉన్న నిర్మాణాలను కూల్చేస్తుంటే.. బీఆర్‌ఎస్‌ వాళ్లకు కడుపు నొప్పేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు కుమారుడి నివాసాన్నీ హైడ్రా కూల్చేసిందని, ఇది బీఆర్‌ఎస్‌ నేతలకు కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


అప్పు రూ.3 లక్షల కోట్లే ఉందనుకున్నం

ఎన్నికలకు ముందు రాష్ట్రం అప్పు రూ.3 లక్షల కోట్లు మాత్రమే ఉందనుకున్నామని, అధికారంలోకి వచ్చాక సీఎం, మంత్రులం కూర్చుని సమీక్ష చేస్తే అప్పు రూ.7.19 లక్షల కోట్లుగా తేలేసరికి షాకై పోయామని పొంగులేటి తెలిపారు. ఆర్థికంగా రాష్ట్ర ఖజానా సహకరించదని తెలిసినా.. దుబారా ఖర్చులు దూరంగా పెట్టి 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల మేరకు రుణాన్ని మాఫీ చేశామన్నారు. ఇంకా రూ.13 వేల కోట్ల మేరకు మాఫీ చేయాల్సి ఉందని, దాన్నీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. త్వరలోనే రూ.2 లక్షల పైన రుణం తీసుకున్న రైతులు.. పై మొత్తాన్ని బ్యాంకులకు కట్టేందుకు కటాఫ్‌ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. తాము అంచనా వేసుకున్న రూ.31 వేల కోట్లకు అదనంగా మరో రూ.1500 కోట్లు ఖర్చయినా అర్హుడైన ప్రతి రైతుకూ రుణాన్ని మాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.

దేశానికి రోల్‌మోడల్‌గా రెవెన్యూ చట్టం

తెలంగాణ రెవెన్యూ చట్టం దేశానికే రోల్‌ మోడల్‌గా మారనుందని మంత్రి పొంగులేటి చెప్పారు. చట్టం ముసాయిదాను ఇప్పటికే పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టామన్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో అన్ని కలెక్టరేట్ల పరిధిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ఈ చట్టంపైన క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సూచనలూ క్రోడీకరిస్తామని చెప్పారు. అందరి సూచనల్లో మంచి వాటిని స్వీకరిస్తామని చెప్పారు.


మా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే!

‘‘పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు రేవంత్‌రెడ్డిని సీఎం సీటు నుంచి దించేస్తారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నరు. కానీ.. ఈప్రభుత్వానికి.. మాకు, మా నాయకులకు ఒక స్పష్టత ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే. బీఆర్‌ఎస్‌ నేతల కలలు కలలలాగే ఉంటయి. మా మధ్య పెట్టడానికి వారికి ఆవగింజ అంత సందు కూడా దొరకదు’’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు.

సీఎం చేతుల మీదుగా జేఎన్‌జే సొసైటీకి 70 ఎకరాలు అప్పగిస్తాం

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రానున్న కొద్ది రోజుల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ సొసైటీకి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆ సొసైటీకి కేటాయించిన 70 ఎకరాలను ఇస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. సొసైటీకి 70 ఎకరాల మేరకు భూ కేటాయింపును సుప్రీంకోర్టు క్లియర్‌ చేసిందని గుర్తు చేశారు. కొద్ది రోజుల్లోనే ఒక మంచి ఫంక్షన్‌ను ఏర్పాటు చేసి, తొలి విడతగా ఈ మేరకు ఇళ్ల స్థలాలను ఇస్తున్నామని, దీని ద్వారా వెయ్యిమందికి పైగా సీనియర్‌ జర్నలిస్టులకు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు. తాము ఎక్కువ చేసి, తక్కువ మాట్లాడతామని, ఇదే తమ ప్రభుత్వం కట్టుబాటు నిబద్ధతని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు.

Updated Date - Aug 24 , 2024 | 03:16 AM