ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

త్వరలో అణుబాంబు పేలనుంది: మంత్రి పొంగులేటి

ABN, Publish Date - Nov 08 , 2024 | 02:47 AM

‘‘తప్పు చేసిన వారికి నాటు బాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. ఆటం బాంబు పేలబోతోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పుల మీద తప్పులు చేసిన వారిని ఉపేక్షించేది లేదు.

  • తప్పు చేసిన బీఆర్‌ఎస్‌ నేతలను వదిలిపెట్టం.. దోచుకున్న వారంతా దోషులుగా నిలబడాల్సిందే

  • కేటీఆర్‌.. పాదయాత్రేనా? మోకాళ్ల యాత్ర చేస్తావా?

  • మీకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

  • తల తాకట్టు పెట్టయినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం

  • ఎన్ని ఇబ్బందులున్నా రైతు బంధును కొనసాగిస్తాం

  • నెలలోగా స్మార్ట్‌ కార్డులు.. వాటితోనే ప్రజలకు పథకాలు

  • కొత్త రెవెన్యూ చట్టం దేశానికే రోల్‌ మోడల్‌

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

తొర్రూరు/రాయపర్తి/వర్ధన్నపేట, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): ‘‘తప్పు చేసిన వారికి నాటు బాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. ఆటం బాంబు పేలబోతోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పుల మీద తప్పులు చేసిన వారిని ఉపేక్షించేది లేదు. పేదోడి సొమ్మును సోకుల కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం విదేశాలకు బదిలీ చేస్తే ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. కోట్లాది రూపాయలు ఎవరు ఎవరికి ఇచ్చారో ప్రజలకు తెలుపుతాం. కేటీఆర్‌.. పాదయాత్ర చేస్తావో.. మోకాళ్ల యాత్ర చేస్తావో.. త్వరగా నిర్ణయించుకో. తెలంగాణ ప్రజలు మరోసారి నీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. దీపావళి తర్వాత పేలుతున్న బాంబులకు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? బాంబులేవి అంటున్న వారికి టపాసుల శబ్దం వినపడడం లేదా? ప్రశ్నించారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో బుధవారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. అనంతరం రాయపర్తి మండలంలోని పెర్కవేడుతోపాటు వర్ధన్నపేటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు శ్రీరామ రాజ్యం కావాలని కాంగ్రె్‌సను గెలిపించుకున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు ప్రజా సంక్షేమం కోసమే కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ.. అభివృద్ధి చేస్తుంటే తమను కొందరు బదనాం చేస్తూ.. గుడ్డకాల్చి మీద వేస్తున్నారని విమర్శించారు. తల తాకట్టు పెట్టయినా హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు బంధును ఆపబోమని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిపారు. నెల రోజుల్లోగా ఒక్కో కుటుంబానికి ఒక స్మార్ట్‌ కార్డును అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వాటి ద్వారానే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు.

గ్రామం నడిబొడ్డున గ్రామసభ ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున పక్కా గృహాలను మంజూరు చేస్తున్నామని, ఐదేళ్లలో అర్హులైన వారందరికీఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దొరల కోసం తీసుకొచ్చిన ధరణిని నెలలోగా ప్రక్షాళన చేసి.. పేదలకు అండగా నిలుస్తామన్నారు. తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం దేశానికే రోల్‌ మోడల్‌ కానుందని చెప్పారు. నల్లగొండ జిల్లాలో 6వేల ఎకరాల మేర సర్వే చేస్తే 2వేల ఎకరాల్లో బీఆర్‌ఎస్‌ పింకీలు వారి బినామీలకు రిజిస్ర్టేషన్‌ చేసి, వేల కోట్ల రూపాయల రైతుబంధును కాజేశారని వెల్లడించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వాళ్లు సరెండర్‌ కావాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండో రాజధానిగా వరంగల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 02:47 AM