President Murmu: న్యాయవాదులు పారదర్శకంగా ఉండాలి
ABN, Publish Date - Sep 29 , 2024 | 03:18 AM
న్యాయవాదులు సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం అందించేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. న్యాయవాద వృత్తిలో నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే ఎంతో ఎత్తుకు ఎదగవచ్చన్నారు.
అట్టడుగు వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలి
సంపన్నులతో పోలిస్తే నేటికీ న్యాయం పొందలేని పేదలు
నల్సార్ న్యాయ వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి నిలయంలో కళా మహోత్సవ్
మేడ్చల్/అల్వాల్/శామీర్‌పేట, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): న్యాయవాదులు సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం అందించేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. న్యాయవాద వృత్తిలో నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే ఎంతో ఎత్తుకు ఎదగవచ్చన్నారు. సంపన్నులకు లభించే న్యాయం.. నిరుపేదలకు నేటికీ అందకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ తరం న్యాయనిపుణులు మార్గదర్శకులుగా నిలిచి ఈ విధానంలో మార్పు తీసుకురావాలని అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పరిధిలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన 21వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. నేడు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని, న్యాయవ్యవస్థలో కూడా సాంకేతికతను ఉపయోగించుకుని బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంతోపాటు కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో నెట్‌వర్క్ ఉండాలని అభిప్రాయపడ్డారు. పూర్వ విద్యార్థులతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న మహిళా న్యాయవాదులు, న్యాయ విద్యార్థులతోనూ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలన్నారు. నల్సార్‌లో జంతు న్యాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని, జంతు సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి అవసరమని పేర్కొన్నారు.
నల్సార్‌లో ఏఐను ఒక అధ్యయనంగా గుర్తించడం సంతోషకరమని రాష్ట్రపతి ముర్ము అన్నారు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల్లో న్యాయస్థానాలు, ప్రతీ పది గ్రామాలకు ముగ్గురు న్యాయాధికారులతో ధర్మాసనం అవసరమని చాణక్యుడు ఆనాడే తన అర్థశాస్త్రంలో పొందుపరిచారని గుర్తు చేశారు. కేసు విచారణ ముగిసేవరకు న్యాయమూర్తులు, కక్షిదారులు వ్యక్తిగతంగా కలిసేందుకు అనుమతించవద్దని, అప్పుడే నిష్పక్షపాత న్యాయ ప్రధానానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. నల్సార్‌లో ప్రతిభావంతులైన వారిలో విద్యార్థినులే ఎక్కువ మంది ఉండటం గర్వకారణమన్నారు. ఇక మన దేశంలో న్యాయ సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవని, న్యాయం కోసం మహాత్మాగాంధీ కూడా పోరాటం చేశారని రాష్ట్రపతి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్సార్‌లో న్యాయ విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదగాలని, విశ్వవిద్యాలయానికి, కుటుంబసభ్యులకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున విశ్వవిద్యాలయానికి ఆర్థిక సహకారం అందజేస్తామని ప్రకటించారు. స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ చాన్సలర్ జస్టిస్ అలోక్ అరాధే, వైస్ చాన్సలర్ శ్రీకృష్ణదేవరావు, మంత్రి సీతక్క పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రాయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం అనంతరం సికాంద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈశాన్య ప్రాంతా అభివృద్ధి మంత్రిత్వశాఖ, సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహిస్తున్న కళామహోత్సవ్‌ను రాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు బేగంపేటకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.
Updated Date - Sep 29 , 2024 | 03:18 AM