ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

UPI Fraud: రాజస్థాన్‌ ముఠా.. యూపీఐ దోపిడీ

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:40 AM

యూపీఐ చెల్లింపుల్లో జరిగే పొరపాట్లను సరిదిద్దడానికి బ్యాంకులు అందించే ‘చార్జ్‌బ్యాక్‌’ ఆప్షన్‌ను వాడుకుని రూ.4 కోట్ల మేర మోసానికి పాల్పడ్డరాజస్థాన్‌ ముఠాను సైబరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

  • ‘చార్జ్‌ బ్యాక్‌’ ఆప్షన్‌తో 4 కోట్ల మోసం

  • బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ షోరూములే టార్గెట్‌

  • హైదరాబాద్‌లో 13 మంది అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): యూపీఐ చెల్లింపుల్లో జరిగే పొరపాట్లను సరిదిద్దడానికి బ్యాంకులు అందించే ‘చార్జ్‌బ్యాక్‌’ ఆప్షన్‌ను వాడుకుని రూ.4 కోట్ల మేర మోసానికి పాల్పడ్డరాజస్థాన్‌ ముఠాను సైబరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గచ్చిబౌలి కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ నరసింహ ఈ కేసు వివరాలను వెల్లడించారు. పేమెంట్‌ యాప్స్‌ ద్వారా పొరపాటున ఒకరికి బదులు వేరే వ్యక్తికి డబ్బు పంపిస్తే.. బ్యాంకును సంప్రదించి, పొరపాటు జరిగిందని చెప్తే బ్యాంకు ఆ డబ్బును మళ్లీ మన ఖాతాలో జమ చేస్తుంది. దీన్ని ‘చార్జ్‌ బ్యాక్‌’ ఆప్షన్‌ అంటారు! ఈ లొసుగు ఆధారంగా రాజస్థాన్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి.. బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ సంస్థను లక్ష్యంగా చేసుకుని మోసానికి పాల్పడ్డారని డీసీపీ నరసింహ వివరించారు.


ప్లాన్‌లో భాగంగా ఈ ముఠాలోని కొందరు హైదరాబాద్‌లో, మరికొందరు రాజస్థాన్‌లో ఉంటారు. ఇక్కడున్నవారు బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ దుకాణానికి వెళ్లి ఖరీదైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వాటికి డబ్బు చెల్లించాల్సిన సమయంలో.. అక్కడున్న క్యూఆర్‌ కోడ్‌ను ఫొటో తీసి రాజస్థాన్‌లోని తమ ముఠా సభ్యులకు పంపుతారు. వారు ఆ కోడ్‌ ద్వారా చెల్లింపులు జరుపుతారు. డబ్బు తమ ఖాతాలోకి రాగానే దుకాణదారులు ఆయా వస్తువులను ముఠాసభ్యులకు అప్పగిస్తారు. వారు వెంటనే ఆ వస్తువులను బయట అమ్మేసి డబ్బును పంచేసుకుంటారు. అక్కడ రాజస్థాన్‌లో ఉన్నవారు.. బ్యాంకును సంప్రదించి, ఒకరికి చెల్లించాల్సిన సొమ్మును వేరొకరికి చెల్లించామనో లేదా సైబర్‌ మోసానికి బలయ్యామనో చెప్పి.. తమ డబ్బును తిరిగి తమ ఖాతాలో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తారు.


బ్యాంకులు విచారణ జరిపి.. కొనుగోలు చేసిన వారి వివరాలు, చెల్లింపు చేసిన వారి వివరాలు వేరుగా ఉండడంతో ఆ డబ్బును తిరిగి జమ చేసేస్తున్నాయి. ఇలా ఇప్పటిదాకా ఈ ముఠా.. కేపీహెచ్‌బీ, మాదాపూర్‌, నార్సింగ్‌, ఆర్‌జీఐఏ, మధురానగర్‌, జడ్చర్ల తదితర ప్రాంతాల్లోని బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ షోరూమ్‌లలో మోసాలకు పాల్పడింది. దీనిపై వరుసగా ఫిర్యాదులు రావడంతో సీపీ అవినాశ్‌ మహంతి ఆదేశాల మేరకు శంషాబాద్‌ సీసీఎస్‌, మాదాపూర్‌, కేపీహెచ్‌బీ, నార్సింగ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజ్‌ ఆధారంగా.. రాజస్థాన్‌కు చెందిన సోమరాజ్‌, సునీల్‌, లక్‌రామ్‌, షర్వాన్‌, సోమరాజ్‌, శివలాల్‌, రమేష్‌, శర్వాన్‌, పప్పురామ్‌, శ్రావణ్‌, రాకేష్‌, రమేష్‌, అశోక్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేశారు.


వారి నుంచి రూ. 50 లక్షల విలువైన ఎలకా్ట్రనిక్‌ సామాగ్రి, రూ.1.72 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 13 మందీ కేవలం పాత్రధారులని.. ఈ ముఠాలో ఇంకా చాలామంది సభ్యులు ఉన్నారని, వారిని కూడా అరెస్ట్‌ చేస్తామని డీసీపీ తెలిపారు. మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా ఒక పథకం ప్రకారం శుక్రవారం కొనుగోళ్లు చేసి, శనివారం చార్జ్‌బ్యాక్‌ రిక్వెస్ట్‌ పెడుతోందని.. విచారణ చేసిన బ్యాంకు అధికారులు కొనుగోలుదారుడి వివరాలు వేరు, చెల్లింపు చేసిన వారు వేరు కావడంతో పొరపాటు జరిగినట్టుగా భావించి సోమ, మంగళ వారాల్లో డబ్బులు తిరిగి ఖాతాలోకి జమచేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Sep 10 , 2024 | 03:40 AM

Advertising
Advertising