Share News

కాంగ్రెస్‌ ప్రాజెక్టుల వల్లే రికార్డులు

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:34 AM

గతంలో కాంగ్రెస్‌ పాలకులు దూర దృష్టితో నిర్మించిన బహుళార్థక ప్రాజెక్టుల వల్లనే ఈనాడు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి

కాంగ్రెస్‌ ప్రాజెక్టుల వల్లే రికార్డులు

అందుకే నేడు ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానం.. ఇందిరమ్మ స్ఫూర్తితోనే కులగణన సర్వే: భట్టివిక్రమార్క

అభివృద్ధిపై చర్చకు సిద్ధం: మహేశ్‌కుమార్‌

గాంధీభవన్‌లో ఇందిరకు నివాళులు

హైదరాబాద్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): గతంలో కాంగ్రెస్‌ పాలకులు దూర దృష్టితో నిర్మించిన బహుళార్థక ప్రాజెక్టుల వల్లనే ఈనాడు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి సాధ్యమైందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. కాళేశ్వరం వల్లనే తెలంగాణలో వరిసాగు పెరిగిందంటూ బీఆర్‌ఎస్‌ చేసిన ప్రచారం అబద్ధమని తేలిపోయిందని పేర్కొన్నారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగిపోయి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకున్నా.. ఎన్డీఎస్‌ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా ధాన్యం ఉత్పత్తి పెరిగిందన్నారు. ఆనాడు కాంగ్రెస్‌ పాలకులు.. కృష్ణానదిపై నాగార్జునసాగర్‌, శ్రీశైలం, జూరాల, గోదావరిపై ఎస్సారెస్పీ, దేవాదుల తదితర ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతులకు సాగునీరు అందించిన ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో మంగళవారం ఇందిరాగాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన భట్టి విక్రమార్క.. ఆదర్శ రైతులు, శాస్త్రవేత్తలకు అవార్డులను ప్రదానం చేశారు. ‘ఇండియా గుండె చప్పుడు ఇందిర’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఆమె చిత్రపటానికి భట్టివిక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌, కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. భూ సంస్కరణల చట్టం తీసుకురావడం ద్వారా కొద్ది మంది చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి.. లక్షలాది మంది రైతులను తయారు చేసిన ఘనత దివంగత ప్రధాని ఇందిరాగాంధీకే దక్కుతుందన్నారు. ఆమె స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం వ్యవసాయరంగానికి బడ్జెట్లో రూ.72 వేల కోట్లు కేటాయించిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పాలకులు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని, పంట బీమా పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రైతులకు అసైన్‌ చేసిన భూములను లాక్కుని లేఅవుట్లు చేసి అమ్ముకున్న దుర్మార్గులు.. బీఆర్‌ఎస్‌ పాలకులని మండిపడ్డారు. ప్రస్తుతం వారు రైతుల గురించి మాట్లాడటం.. దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని విమర్శించారు. భూ సేకరణ బాధితుల గురించి మాట్లాడే అర్హతే వారికి లేదన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కులగణన సర్వేను శాస్త్రీయంగా, నిబద్ధతతో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. దేశ సమైక్యత, సమగ్రతలపై అవగాహన ఉన్నవాళ్లు, ఇందిరాగాందీ జీవిత చరిత్ర తెలిసిన వాళ్లు ఆమెకు చేతులు ఎత్తి నమస్కరిస్తారే తప్ప.. ఆమె చరిత్రను వక్రమార్గంలో చూపే ప్రయత్నం చేయబోరన్నారు.


ఇందిర హయాంలో ఎమర్జెన్సీ మీద సినిమా నిర్మాణంపై భట్టివిక్రమార్క ఈ మేరకు స్పందించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ నెహ్రూ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అన్నారు. అనేక ఒత్తిళ్లను తట్టుకుని భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి నిర్ణయాలను ధైర్యంగా తీసుకున్నారని కొనియాడారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి, పది నెలల ప్రజాప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. కాగా, గాంధీభవన్‌లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో గురువారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే ఈ కార్యక్రమం జరగనుంది.

ఇందిరకు సీఎం రేవంత్‌ నివాళి

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 04:34 AM