ఆర్‌ఆర్‌ఆర్ మార్గంలో మార్పులు!
ABN , Publish Date - Apr 01 , 2024 | 05:22 AM
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోడ్డు నిర్మాణంలో సాగు భూములు కోల్పోకుండా, రైతులకు నష్టం వాటిల్లకుండా రూట్‌మ్యాప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంలోని యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో
ఉత్తర భాగంలో మారనున్న అలైన్‌మెంట్
రైతులు నష్టపోకుండా చూడాలనే యోచన
రాయగిరి రైతుల ఆందోళనతో నిర్ణయం
దక్షిణ భాగంలోనూ ఇదేవిధంగా భూసేకరణ
అలైన్‌మెంట్ మేరకు డీపీఆర్‌లోనూ మార్పులు
ఉత్తర భాగానికి త్వరలో ఎన్‌హెచ్ నంబరు!
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోడ్డు నిర్మాణంలో సాగు భూములు కోల్పోకుండా, రైతులకు నష్టం వాటిల్లకుండా రూట్‌మ్యాప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంలోని యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో అలైన్‌మెంట్‌లో ఈ మార్పులు జరగనున్నట్టు సమాచారం. అధికారులు కూడా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. అయితే.. అలైన్‌మెంట్ మార్పుతో డీపీఆర్‌లోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం నిర్మాణానికీ కేంద్రం ఆమోదం తెలపడంతోపాటు డీపీఆర్ సమర్పించాలని జాతీయ రహదారుల సంస్థ.. తెలంగాణ విభాగం అధికారులను ఆదేశించింది. దాంతో ప్రస్తుతం దక్షిణభాగం రోడ్డు నిర్మాణానికి ప్లాన్ తయారవుతోంది. అయితే ఈ మార్గంలోనూ సాగు భూములు ఉండడంతో.. రైతులకు నష్టం వాటిల్లకుండా భూ సేకరణ చేసి అలైన్‌మెంట్ చేయాలని అధికారులకు సర్కారు సూచించినట్టు సమాచారం. తెలంగాణలో రీజినల్ రింగు రోడ్డును కేంద్ర ప్రభుత్వం రెండు భాగాలుగా (ఉత్తర, దక్షిణ) విభజించి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర భాగాన్ని సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, ప్రజ్ఞాపూర్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు 158.64 కిలోమీటర్లు నిర్మిస్తారు. దక్షిణభాగం.. చౌటుప్పల్ నుంచి ఆమనగల్లు, షాద్‌నగర్, చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల పొడవు నిర్మాణం కానుంది. ఇందులో ముందుగా ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్రం అనుమతినివ్వడం, అలైన్‌మెంట్ ఖరారు కావడంతో పాటు చాలావరకు భూసేకరణ పూర్తయింది. మరికొంత భూమిని సేకరించాల్సి ఉంది.
రాయగిరి ప్రజల ఆందోళనలతో..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి ప్రాంత ప్రజలు ఆర్‌ఆర్‌ఆర్‌కు తమ భూములు ఇవ్వబోమంటూ ఆందోళనలకు దిగుతున్నారు. వారికి అప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ తరఫున భువనగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాయగిరి ప్రాంతంలో ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌లో మార్పులు చేయిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ కూడా ఇచ్చారు. ఈ నెల 29న మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి దృష్టికి విలేకరులు ఈ విషయాన్ని తీసుకెళ్లగా.. అలైన్‌మెంట్‌లో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను మంత్రి అయ్యాక కూడా చెప్పానన్నారు. దీంతో ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగంలో అలైన్‌మెంట్‌లో మార్పులుంటాయని స్పష్టమైంది. వాస్తవానికి రాష్ట్రానికి రీజినల్ రింగు రోడ్డు మంజూరై, దాని పూర్తి దూరం, ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లనుందనే వివరాలు వచ్చినప్పుడే ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు, ఇతర జిల్లాల్లోనూ పలు ప్రాంతాల రైతులు ఆ రహదారికి భూములు ఇవ్వబోమని చెప్పారు. దాంతో అప్పటి పరిస్థితుల మేరకు ప్రస్తుతం ఉన్న అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా.. రాయగిరి మునిసిపాలిటీ ప్రాంతంలోనూ భూసేకరణ చేయాల్సి వచ్చింది.
కేంద్రాన్ని రాష్ట్రం ఒప్పించగలిగితే..
రాయగిరి పరిధిలో ఇప్పటికే ఎన్‌హెచ్-163 (హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి) నిర్మాణం, బస్వాపూర్ రిజర్వాయర్, కాలువల నిర్మాణంతోపాటు హైటెన్షన్ విద్యుత్తు లైన్‌కు రైతులు భూములు ఇవ్వాల్సివచ్చింది. మళ్లీ ఇప్పుడు రీజినల్ రింగు రోడ్డు కూడా రాయగిరి మీదుగానే వెళ్తుండడంతో.. దీని నిర్మాణానికి కూడా భూములు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాము ఇప్పటికే భూములను కోల్పోయామని, ఇక కోల్పోలేమని, ఉన్న భూములు కూడా ఇచ్చి ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. భూములు ఇవ్వబోమంటూ కోర్టుకు వెళ్లారు. అయితే ఉత్తర భాగం మార్గం నిర్మాణానికి అవసరమైన భూసేకరణ దాదాపు పూర్తవగా, భువనగిరి పరిధిలో నిలిచిపోయింది. ఇదే సమయంలో ‘కాలా’ (కాంపిటేటివ్ అధారిటీ ఆప్ ల్యాండ్ ఎక్విజేషన్) పూర్తి కాలేదు. జాతీయ రహదారుల సంస్థ ఒక్కసారి అలైన్‌మెంట్‌ను ఖరారు చేసిన తరువాత అందులో ఎలాంటి మార్పులుండవని అధికారులు చెబుతున్నా.. ఈ విషయంపై మార్చాల్సిన ఆవశ్యకతను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరిస్తే మార్పునకు అవకాశం ఉంటుందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
’
ఉత్తర భాగానికి త్వరలో ఎన్‌హెచ్ నంబరు
కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి ఉత్తర భాగం అలైన్‌మెంట్‌లో మార్పులు చేయిస్తే.. డీపీఆర్‌లోనూ పలు మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే డీపీఆర్ ఖరారైనందున.. ఒకవేళ అలైన్‌మెంట్ మారితే ఆ వివరాలను అందులో పొందుపరచాల్సి ఉంటుంది. మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం డీపీఆర్‌లోనూ మార్పులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నట్టు సమాచారం. కాగా, ఉత్తర భాగానికి సంబంధించి కేంద్రం ఇప్పటివరకు జాతీయ రహదారి నంబర్‌ను కేటాయించలేదు. గతంలో యుటిలిటీస్ చెల్లింపు అంశం, భూ సేకరణ వాటా చెల్లింపుల్లో జాప్యం కారణంగా నంబర్ కేటాయింపు జరగలేదు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై దృిష్టి పెట్టింది. ఇందుకోసం కేంద్రంతోనూ పలుమార్లు చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే యుటిలిటీస్ చార్జీలను కేంద్రమే భరిస్తామని హామీ ఇచ్చింది. భూసేకరణ వాటాను చెల్లించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తామని కేంద్రానికి తెలిపింది. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం.. ఉత్తర భాగం మార్గానికి త్వరలోనే జాతీయ రహదారి నంబర్‌ను కేటాయించనున్నట్టు సమాచారం.