Hyderabad: రేవంత్ సర్కార్‌కు ఊరట..
ABN, Publish Date - Jun 05 , 2024 | 04:30 AM
అంచనా వేసుకున్న దాని కంటే ఒక సీటు తగ్గినా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని అధికార కాంగ్రె్‌సకు భారీ ఊరటనే ఇచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో మెజారిటీ స్థానాలు దక్కక పోయినా, బీజేపీకి సమాన స్థాయిలో సీట్లు దక్కించుకుని గౌరవప్రద స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మ్యాచ్ టై.. చెరో 8 లోక్‌సభ సీట్లు పంచుకున్న పార్టీలు
కంటోన్మెంట్‌లో విజయం.. కాంగ్రెస్‌కు బోనస్
మైనారిటీలు, మహిళల మద్దతుతోనే గెలుపు
ఆరు నియోజకవర్గాల్లో లక్షకు పైగా మెజారిటీ
బీఆర్‌ఎస్ ఓట్లన్నీ బీజేపీకి బదిలీ.. లేదంటే మరిన్ని సీట్లు వచ్చేవంటున్న పార్టీ వర్గాలు
హైదరాబాద్, జూన్ 4(ఆంధ్రజ్యోతి): అంచనా వేసుకున్న దాని కంటే ఒక సీటు తగ్గినా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని అధికార కాంగ్రె్‌సకు భారీ ఊరటనే ఇచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో మెజారిటీ స్థానాలు దక్కక పోయినా, బీజేపీకి సమాన స్థాయిలో సీట్లు దక్కించుకుని గౌరవప్రద స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో 9 నుంచి 12 సీట్లు గెలుచుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు. అయితే ఆ అంచనాలకు ఒకటి తక్కువగా 8 సీట్లను కాంగ్రెస్ దక్కించుకుంది. వీటిలో నల్లగొండ, ఖమ్మం, భువనగిరి, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్ సీట్లలో అభ్యర్థులు లక్షకుపైగా మెజారిటీ సాధించారు. నాగర్‌కర్నూల్‌లో 90వేల పైచిలుకు, జహీరాబాద్‌లో 50వేల పైచిలుకు మెజారిటీ లభించింది. మహబూబ్‌నగర్ సీటును స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయింది. మెదక్, సికింద్రాబాద్‌లోనూ 50వేల లోపు ఓట్ల తేడాతోనే ఓటమిపాలైంది. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికలు రేవంత్ ప్రభుత్వానికి పరీక్షగా మారాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి అంతా తానై రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేశారు. మంత్రులూ తమకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓట్లు తాము అంచనా వేసిన దానికంటే ఎక్కువగా బీజేపీకి బదిలీ అయ్యాయని, దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకు పరిమితమైన బీజేపీ.. లోక్‌సభకు వచ్చే సరికి ఏకంగా 8 సీట్లు దక్కించుకోగలిగిందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు చీలకుండా ఉండి ఉంటే మహబూబ్‌నగర్, మెదక్, చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లూ కాంగ్రెస్ ఖాతాలోనే చేరి ఉండేవని చెబుతున్నాయి. ఏదే మైనా ఎన్నికల్లో బీజేపీ పైచేయి సాధించకుండా నిలువరించిన అధికార పార్టీ.. బోన్‌సగా కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్నీ తన ఖాతాలో వేసుకుంది. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమికి మద్దతు ఇచ్చిన మైనారిటీలు.. తెలంగాణలోనూ కాంగ్రెస్ అభ్యర్థులకే జై కొట్టారు. రాష్ట్రంలో అమలవుతున్న ఐదు గ్యారెంటీలు, రాహుల్‌గాంధీ ప్రకటించిన రూ.లక్ష సాయం వంటి పథకాలతో మహిళలు తమకు అండగా నిలిచారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఎన్నికల్లో పోల్ మేనేజ్‌మెంట్ కాంగ్రె్‌సకు కలిసి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు పలువురు ఇన్‌చార్జి మంత్రులు శక్తి వంచన లే కుండా కృషి చేశారు. ఈ విషయంలో మంత్రులు ఉత్తమ్(నల్లగొండ), పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి(ఖమ్మం), తుమ్మల నాగేశ్వర్‌రావు (మహబూబాబాద్), శ్రీధర్‌బాబు(పెద్దపల్లి), జూపల్లి కృష్ణారావు(నాగర్‌కర్నూలు), దామోదర రాజనర్సింహ(జహీరాబాద్) విజయం సాధించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(సికింద్రాబాద్), పొన్నం ప్రభాకర్(కరీంనగర్), సీతక్క(ఆదిలాబాద్), కొండా సురేఖ(మెదక్) ఇన్‌చార్జిలుగా ఉన్న సీట్లలో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతానికి సేఫ్ పొజిషన్‌లోనే ఉన్నా..
లోక్‌సభ ఎన్నికలనే పరీక్షల్లో సెకండ్ క్లాస్ మార్కులతో పాసైన రేవంత్ సర్కారు ప్రస్తుతానికి సేఫ్ పొజిషన్‌లోనే ఉందని, కానీ సొంతంగా బీజేపీ 8 సీట్లు దక్కించుకున్న నే పథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఎప్పటినుంచో ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరతకు గురిచేసే అవకాశమూ లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, కంటోన్మెంట్ విజయంతో సభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 65కు పెరగ్గా, సీపీఐ ఎమ్మెల్యే, బీఆర్‌ఎ్‌సను వీడిన ముగ్గురు ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 69మంది సభ్యుల మద్దతు సర్కార్‌కు ఉంది. విపత్కర పరిస్థితుల్లో మజ్లిస్ తమకే మద్దతిస్తుందని, 76మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ప్రభుత్వాన్ని టచ్ చేసే ధైర్యం బీజేపీ చేయదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Updated Date - Jun 05 , 2024 | 04:30 AM