TG Revenue: అక్టోబరులోనూ అదే తీరు..
ABN, Publish Date - Oct 27 , 2024 | 04:28 AM
రాష్ట్ర ఖజానాకు రిజిస్ట్రేషన్లతో వచ్చే ఆదాయం తగ్గుతోంది. ఈ తగ్గుదల రాబడిలో కోతకు దారితీస్తోంది.
24% తగ్గిన రిజిస్ట్రేషన్ రాబడి.. హైడ్రా నేపథ్యంలో ఆచితూచి కొనుగోళ్లు
ఎన్‌ఆర్‌ఐల కొనుగోళ్లు తగ్గడం, గృహ రుణాల వడ్డీల పెరుగుదల ప్రభావం
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఖజానాకు రిజిస్ట్రేషన్లతో వచ్చే ఆదాయం తగ్గుతోంది. ఈ తగ్గుదల రాబడిలో కోతకు దారితీస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వరుసగా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం గతేడాదితో పోల్చితే బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది సెప్టెంబరులో ఆదాయం గత ఏడాది ఇదే నెల (రూ.1,162 కోట్లు)తో పోల్చితే 26.15 శాతం తగ్గి రూ.857.83 కోట్లుగా నమోదైంది. అలాగే అక్టోబరులోనూ (26వ తేదీ వరకు) గతేడాది ఇదే నెల రాబడి రూ.1,221.82 కోట్లతో పోల్చితే 24.4 శాతం తగ్గి రూ.923.30 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మే (18.06 శాతం), సెప్టెంబరు (26.15 శాతం), అక్టోబరు (24.4 శాతం) నెలల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఏడాదితో పోల్చితే తగ్గిపోయింది.
అయితే ఏప్రిల్ ఆదాయంలో 2.5 శాతం, జూన్‌లో 9.58 శాతం, ఆగస్టులో 0.77 శాతం పెరుగుదల నమోదైంది. జూలై నెలలోనే ఆదాయం గత ఏడాదితో పోల్చితే ఏకంగా 38.06 శాతం పెరగడం విశేషం. ఇక దస్తావేజుల రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే.. 2023-24 ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు 11.52 లక్షల దస్తావేజులు రిజిస్టర్ కాగా 2024లో ఇదే కాలంలో 10.16 లక్షల దస్తావేజులు రిజిస్టర్ అయ్యాయి. ఆదాయం విషయానికి వస్తే 2023-24 ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు రూ.8,451.09 కోట్లు రాగా ఈ ఏడాది ఇదే కాలంలో రూ.8,213.81 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోల్చితే రాబడి రూ.237.28 కోట్లు తగ్గింది.
ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలకు రిజిస్ర్టేషన్లతో నిర్దేశించుకున్న రాబడి లక్ష్యం రూ.9,936 కోట్లు కాగా.. వచ్చిన ఆదాయం రూ..8,213.81 కోట్లు మాత్రమే. అంటే లక్ష్యంలో రూ.1,722.19 కోట్ల మేర లోటు ఏర్పడిందన్నమాట. రిజిస్ర్టేషన్లు తగ్గడానికి ఆ శాఖ అధికారులు పలు కారణాలు చెబుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కనున్న జిల్లాల్లో అత్యధిక రిజిస్ర్టేషన్లు జరిగేవని.. హైడ్రా రంగ ప్రవేశం నేపథ్యంలో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ సమస్యలులేకుండా కొనుగోలు చేయాలనే కారణంతో ఆచితూచి వ్యవహరిస్తుండటం, విదేశాల్లో ఉంటున్న తెలుగువారు చేసుకునే రిజిస్ర్టేషన్లతో గతంతో పోల్చితే ఈ ఏడాది కొంత మేర తగ్గడం, బ్యాంకుల గృహరుణాల వడ్డీలు పెరగడం, మూసీ సుందరీకరణ, ప్రభుత్వ పెట్టుబడులు, ప్రాధాన్యతలు వంటి కారణాల వల్ల రిజిస్ర్టేషన్ల సంఖ్య తగ్గిందని అధికారులు భావిస్తున్నారు.
7 నెలల ఆదాయ వివరాలు...
నెల 2023-24 ఆదాయం 2024-25 లక్ష్యం 2024- 25 ఆదాయం వృద్ధి
(రూ.కోట్లలో) (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) (శాతంలో)
ఏప్రిల్ 1,087 1,279 1,115 2.58
మే 1,317 1,544 1,079 -18.06
జూన్ 1,180 1,544 1,293 9.58
జూలై 1,187 1,451 1,639 38.06
ఆగస్టు 1,296.73 1,123 1,306.68 0.77
సెప్టెంబరు 1,161.54 1,451 857.83 -26.15
అక్టోబరు 1,221.82 1,544 923.30 (26 వరకు) -24.4
మొత్తం 8,451.09 9,936 8,213.81
Updated Date - Oct 27 , 2024 | 04:28 AM