ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆరు నెలల్లో 1.2 లక్షల నేరాలు..

ABN, Publish Date - Jul 30 , 2024 | 03:53 AM

శాంతి భద్రతల పరిరక్షణలో రేవంత్‌ సర్కారు విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆమె సోమవారం శాసనసభలో మాట్లాడారు.

  • శాంతి భద్రతల పరిరక్షణలో విఫలం: సబిత

  • పదేళ్లలో దిశ లాంటి ఎన్నో నేరాలు జరిగాయి

  • వాటన్నింటినీ గుర్తు చేసుకోండి: మంత్రి సీతక్క

  • ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని మందలించిన సభాపతి

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతల పరిరక్షణలో రేవంత్‌ సర్కారు విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆమె సోమవారం శాసనసభలో మాట్లాడారు. గత ఆరు నెలల్లో 500 హత్యలు, 3200 దోపిడీలు, 10వేల దొంగతనాలు, వెయ్యి కిడ్నాప్‌ కేసులు, 1800 అత్యాచార కేసులు.. మొత్తం 1.2 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌ నడిబొడ్డున గ్యాంగ్‌ రేప్‌ జరిగిందని.. కొల్లాపూర్‌లో గిరిజన మహిళపై.. మలక్‌పేటలో అంధుల పాఠశాలలో వికారాబాద్‌కు చెందిన బాలికపై అత్యాచారం జరిగిందన్నారు.


నేరాలపై స్పందించడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విద్యాహక్కు చట్టాన్ని ప్రైవేటులోనూ అమలుచేయాలని సబిత డిమాండ్‌ చేశారు. ‘‘25వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ ఇస్తామనిచెప్పి.. మేము గుర్తించిన 11 వేల పోస్టులతోనే డీఎస్సీ వేశారు. మిగిలిన 14 వేలు, త్వరలో ఖాళీ కానున్న మరో 10 వేల పోస్టులు కలిపి 24 వేల పోస్టులతో మళ్లీ డీఎస్సీ వేయాలి’’ అని డిమాండ్‌ చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. సబిత ఆరోపణలపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని.. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలపై రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంధుల పాఠశాలలో అత్యాచారం జరగలేదన్నారు. కొల్లాపూర్‌తో పాటు ఇతర అత్యాచార ఘటనలు దురదృష్టకరమన్నారు.


గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ‘దిశ’ వంటి ఘటనలు ఎన్నో జరిగాయని.. వాటిని కూడా ఒకసారి గుర్తుచేసుకోవాలని సీతక్క కోరారు. గత పాలనలో నేరాలే జరగలేదని, అంతా ఈ ఏడు నెలల్లోనే జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపపడ్డారు. ఇదే అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ సైతం స్పందిస్తూ.. కొల్లాపూర్‌ మహేశ్‌ యాదవ్‌ హత్య కేసును రాజకీయం చేస్తున్నారన్నారు. భూసమస్య కారణంగానే హత్య జరిగిందని.. అందులో బీఆర్‌ఎస్‌ కార్యకర్త ప్రమేయం ఉందని చెప్పారు. కాగా.. సభలో హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రవర్తనపై సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎంను ఏకవచనంతో సంభోదించడం.. మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మందలించారు.

Updated Date - Jul 30 , 2024 | 03:53 AM

Advertising
Advertising
<