SBI Manager: కంచే చేను మేస్తే..
ABN, Publish Date - Aug 29 , 2024 | 04:12 AM
సైబర్ నేరగాళ్లకు సహకరించిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) మేనేజర్‌ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు.
సైబర్ నేరగాళ్లకు.. బ్యాంకు మేనేజర్ సాయం
2 నెలల్లో 6 ఖాతాల నుంచి.. రూ.175 కోట్ల మేర లావాదేవీలు
ఎస్‌బీఐ మేనేజర్, మరో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లకు సహకరించిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) మేనేజర్‌ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు మేనేజర్ స్థాయి అధికారి సైబర్ నేరాల్లో అరెస్టవ్వడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. సైబర్ కేటుగాళ్లు దేశ వ్యాప్తంగా నమోదైన 600 కేసుల్లో.. రూ. 175 కోట్లను లూటీ చేయగా.. ఆరు బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు ఇది వరకే గుర్తించారు. గత శనివారం ఇద్దరిని అరెస్టు చేశారు.
తదుపరి దర్యాప్తులో.. తీగ లాగితే హైదరాబాద్ షంషీర్‌గంజ్ ఎస్‌బీఐ మేనేజర్ గాలి మధుబాబు డొంక కదిలింది. అతనితోపాటు.. మరో నిందితుడు సందీ్‌పశర్మను సైబర్ సెక్యూరిటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరిద్దరూ సైబర్ నేరగాళ్ల కోసం కరెంట్ అకౌంట్లను తెరవడం.. నేరాలకు సంబంధించిన రూ.కోట్లను విత్‌డ్రా చేసే అవకాశం కల్పించడం, ఇతర ఖాతాలకు నగదు బదిలీ చేయడంలో కీలకంగా సహకరించినట్లు ఆధారాలను సేకరించినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికాగోయల్ తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా సైబర్ కేటుగాళ్ల నుంచి వీరికి పెద్దమొత్తంలో కమీషన్ అందినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
ఎన్‌సీఆర్‌బీకి అందిన ఫిర్యాదుతో..
హైదరాబాద్ షంషీర్‌గంజ్‌లోని ఎస్‌బీఐ బ్యాంకు బ్రాంచ్‌లో అనుమానాస్పద ఖాతాలున్నాయంటూ జాతీయ నేరాల నమోదు విభాగం(ఎన్‌సీఆర్‌బీ) పోర్టల్‌కు తొలుత ఫిర్యాదులు వచ్చాయి. ప్రధానంగా 6 కరెంట్ అకౌంట్ల ద్వారా దేశవిదేశాలకు నగదు మార్పిడీ జరుగుతోందన్నది అందులోని సారాంశం. ఎన్‌సీఆర్‌బీ నుంచి సమాచారం అందుకున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగి.. ఆ ఆరు ఖాతాల దుమ్ము దులిపింది. దాంతో.. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆ ఖాతాల ద్వారా రూ.175 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఈ మొత్తంతో.. దుబాయ్ కేంద్రంగా జరిగిన 600 సైబర్ నేరాలకు లింకు ఉన్నట్లు గుర్తించారు.
Updated Date - Aug 29 , 2024 | 04:12 AM