Cybercrime: వృద్ధుడికి రూ.5 కోట్లు టోకరా!
ABN, Publish Date - Jul 08 , 2024 | 03:21 AM
వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. బెదిరించి.. అయోమయానికి గురిచేసి నిలువునా దోచుకుంటున్నారు. హైదరాబాద్ నాచారంలో నివసించే ట్రాన్స్‌కో రిటైర్డ్ ఉన్నతాధికారి(75) నుంచి ఇలానే ఏకంగా రూ.5 కోట్ల వరకు కాజేశారు.
సైబర్ నేరగాళ్ల వలలో ట్రాన్స్‌కో రిటైర్డ్ అధికారి
సైబర్ వలలో ట్రాన్స్‌కో రిటైర్డ్ ఉన్నతాధికారి
గత నెల 13న ఓ నంబరు నుంచి కాల్
మనీ ల్యాండరింగ్‌లో పేరుందని బెదిరింపు
ముంబైలో కేసు నమోదైందని హల్‌చల్
నగదు బదలాయించుకుని ఫోన్లు స్విచ్ఛాఫ్
అమెరికాలోని కూతురుకు సమాచారం
పోలీసులు స్పందించట్లేదని ఆరోపణ
హిమాయత్‌నగర్, జూలై 7(ఆంధ్రజ్యోతి): వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. బెదిరించి.. అయోమయానికి గురిచేసి నిలువునా దోచుకుంటున్నారు. హైదరాబాద్ నాచారంలో నివసించే ట్రాన్స్‌కో రిటైర్డ్ ఉన్నతాధికారి(75) నుంచి ఇలానే ఏకంగా రూ.5 కోట్ల వరకు కాజేశారు. రిటైర్డ్ అధికారికి జూన్ 13న గుర్తుతెలియని నంబరు నుంచి కాల్ వచ్చింది. ‘‘ముంబై టెలికాం సంస్థ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఫోన్ నంబరును అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించాం. మీపై ఎఫ్‌ఐఆర్ బుక్ అయింది’’ అని అవతలి వ్యక్తి పరిచం చేసుకున్నాడు. ఓ మెసేజ్‌ను కూడా బాధితుడి ఫోన్‌కు పంపించాడు. అందులో ఎఫ్‌ఐఆర్ నంబర్ ఎంహెచ్1045/0624, రిటైర్డ్ అధికారి ఫోన్ నంబరు, మొబైల్ నంబర్ అప్లికేషన్ పేరుతో షాప్ నం.10, ఖుర్షాల్ టవర్, ఘట్కోపర్, మహూల్ రోడ్, తిలక్‌నగర్, ముంబై అని వివరాలున్నాయి.
వీటితో తనకేమీ సంబంధం లేదని రిటైర్డ్ అధికారి బదులిచ్చారు. అయితే, ‘మీ ఫోన్‌ను ముంబై పోలీసులకు కనెక్ట్ చేస్తున్నా. మాట్లాడండి’ అని ఆగంతకుడు చెప్పాడు. ముంబై పీఎస్ ఎస్‌ఐని అంటూ ఫోన్‌లో వినయ్‌కుమార్ చౌబే అనే వ్యక్తి పరిచయం చేసుకుని ‘మీపై కేసు నమోదుచేశాం. ఫిర్యాదులుంటే స్కైప్ ద్వారా చెప్పొచ్చు’ అని సూచించాడు. స్కైప్ ఆపరేట్ చేయడం రాదని వృద్ధుడు చెప్పడంతో మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌ను పంపి పంపాడు. ఈ కేసుపై ఐపీఎస్ అధికారి కాల్ చేస్తారని, వివరాలు చెప్పాలని సూచించాడు. ఆకాష్ కులకర్ణి పేరుతో మరో ఆగంతకుడు కాల్ చేసి మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారినని, మీ ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతాల ద్వారా రూ.రెండు కోట్ల మనీల్యాండరింగ్ జరిగిందని, మనీ ల్యాండరింగ్ కేసులో వ్యాపారి సురేష్ గోయల్ ఇంట్లో దాడులు చేసిన సమయంలో మీ పేరుతో ఉన్న క్రెడిట్ కార్డులు పెద్ద సంఖ్యలో లభ్యమయ్యాయని తెలిపాడు.
ఆర్‌బీఐ పబ్లిక్ అకౌంట్ ఫండ్స్‌కు వాటిని పంపిస్తున్నామని, మీ ఖాతాలన్నీ సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని బెదరగొట్టాడు. ఖాతాల్లోని నగదు, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డీమ్యాట్ అకౌంట్లు, షేర్లు అన్నీ డబ్బుగా మార్చి, ఆర్‌బీఐ పబ్లిక్ అకౌంట్ ఫండ్స్ ఖాతాలకు బదిలీ చేస్తే ఇబ్బంది ఉండదని సూచించారు. పలు ప్రైవేట్ బ్యాంకు ఖాతాల నంబర్లు పంపించాడు. దీంతో జూన్ 14-27వ తేదీ మధ్య రిటైర్డ్ అధికారి.. రూ.1.30 కోట్లకు పైగా ఎఫ్‌డీలు, రూ.2 కోట్లు, రూ.1.25 కోట్ల నగదును ఆగంతకుడు చెప్పిన ఖాతాల్లో జమ చేశారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన కేసు కాబట్టి కుటుంబసభ్యులకు కూడా చెప్పకూడదని బెదరగొట్టిన కేటుగాళ్లు మొత్తం దండుకున్న తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు.. అమెరికాలో ఉండే కూతురుకు సమాచారం ఇచ్చారు. ఆమె.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఎవరూ సరిగా స్పందించడంలేదని, డబ్బు రికవరీ విషయంలో ఎలాంటి భరోసా ఇవ్వట్లేదని ఆమె వాపోతున్నారు.
Updated Date - Jul 08 , 2024 | 03:21 AM