Dilawarpur: ఇథనాల్ ఫ్యాక్టరీని తరలిస్తాం
ABN, Publish Date - Nov 28 , 2024 | 04:58 AM
నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్-గుండంపల్లి గ్రామాల ప్రజలకు పెద్ద ఊరట లభించింది. ఆ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని పూర్తిగా రద్దు చేయడమో, తరలించడమో చేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
లేదంటే దాన్ని పూర్తిగా రద్దు చేస్తాం
దిలావర్‌పూర్ ప్రజలకు సీతక్క హామీ
రైతులకు ఫోన్ చేసి మాట్లాడిన మంత్రి
ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా రెండోరోజూ కొనసాగిన ఆందోళనలు
నిర్మాణ పనుల నిలిపివేతపై కలెక్టర్ హామీ ఇచ్చినా సంతృప్తి చెందని అన్నదాతలు
లిఖితపూర్వక హామీకి పట్టు
రైతులతో కలెక్టర్ భేటీ.. నిర్ణయం వెల్లడి
అంతకుముందే లోతుగా సర్కారు చర్చ
ఆపై పనులను ఆపాలని ఆదేశం
సంబరాలు చేసుకున్న దిలావర్‌పూర్, గుండంపల్లి రైతులు
నిర్మల్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్-గుండంపల్లి గ్రామాల ప్రజలకు పెద్ద ఊరట లభించింది. ఆ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని పూర్తిగా రద్దు చేయడమో, తరలించడమో చేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ మేరకు అక్కడి ప్రజలకు ఆమె ఫోన్ చేసి హామీ ఇచ్చారు. ఇథనాల్ ఫ్యాక్టరీని దిలావర్‌పూర్ నుంచి తరలించాలంటూ మంగళవారం రోడ్డెక్కి ఆందోళన చేసిన స్థానిక రైతులు బుధవారం తమ నిరసనను ఉధృతం చేశారు. రోడ్డుపై భారీ సంఖ్యలో చేరి.. రాస్తారోకో నిర్వహించారు. వంటావార్పు చేసి అక్కడే భోజనాలు చేశారు. చుట్టూ పక్కల గల మరో పది గ్రామాల రైతులు సైతం సంఘీభావం ప్రకటించి రాస్తారోకోలో పాల్గొన్నారు. మంగళవారం రాస్తారోకో చేసిన రైతుల్లో కొందరిని పోలీసులు అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న ఆందోళనకారులు.. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కొంత మంది రైతులు తమ పిల్లలను వెంట తీసుకెళ్లి దిలావర్‌పూర్ పోలీసుస్టేషన్ వద్ద పురుగుల మందు డబ్బాలతో బైఠాయించారు. రైతుల ఆందోళనతో ఒకదశలో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను నిలిపివేస్తున్నామని జల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటించారు. రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతోనే పనులు నిలిపివేతపై నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. రైతుల అభిప్రాయాలను, వారి నిరసనలను.. ఇక్కడి పరిస్థితులపై నివేదిక తయారు చేసి సీఎంకు పంపినట్లు వెల్లడించారు. అయితే దిలావర్‌పూర్ నుంచి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిగా తొలగిస్తామంటూ ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా హామీ లభిస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు.
కలెక్టర్ అభిలాష అభినవ్ నోటి మాటగా ఇచ్చిన హమీపై తమకు విశ్వాసం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు ఇచ్చే ఇలాంటి హమీలు తమకు అవసరం లేదన్నారు. దిలావర్‌పూర్, గుండంపల్లి గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించారు. తర్వాత కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని రైతులతో సాయంత్రం కలెక్టరేట్‌లో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. ఆందోళనలో భాగంగా రైతులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని రైతులు కోరగా ఎస్పీ సానుకూలంగా స్పందించారు. వెంటనే కలెక్టర్‌తో జరిగిన చర్చల వివరాలను సమావేశంలో పాల్గొన్న రైతులు దిలావర్‌పూర్ వద్ద ఆందోళన చేస్తున్న మహిళలకు, ఆయా గ్రామాల రైతులకు వివరించారు. ఆ వెంటనే ఎస్పీ కూడా దిలావర్‌పూర్‌కు చేరుకున్నారు. తప్పకుండా ఇథనాల్ పరిశ్రమ రద్దవుతుందని, ఇకపై వదంతులను నమ్మవద్దని కోరారు. మంత్రి సీతక్కతో ఫోన్‌లో మహిళలతో మాట్లాడించారు. ఆందోళన విరమించాలని దిలావర్‌పూర్, గుండంపల్లి గ్రామాల ప్రజలను మంత్రి కోరారు. ఇథనాల్ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించడమా, లేకుంటే రద్దు చేయడమో.. అన్న విషయమై ఏదో ఒకటి తప్పకుండా చేస్తామని మహిళలకు మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఇథనాల్ ఫ్యాక్టరీ, రైతుల ఆందోళనలపై ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఫ్యాక్టరీ రద్దు చేసే అవకాశాలపైనా చర్చించారు. అనంతరం.. ఫ్యాక్టరీపై తదుపరి నిర్ణయం వెలువడే వరకు నిర్మాణ పనులను ఆపాలని సీఎస్ శాంతి కుమారిని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయంతో దిలావర్‌పూర్, గుండంపల్లి గ్రామస్థుల సంబరాలు మిన్నంటాయి. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చడంతో పాటు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.
అ కంపెనీతో మాకు సంబంధంలేదు: తలసాని
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) నిర్మల్ జిల్లాలో నిర్మించనున్న ఇథనాల్ కంపెనీ విషయంలో తమపై చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని.. ఆ కంపెనీతో తమకు సం బంధం లేదని. మాజీమంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ బుఽధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇథనాల్ కంపెనీలో తమకు భాగస్వామ్యం ఉన్నట్లు రుజువు చేస్తే ఆరోపణలు చేస్తున్న పార్టీకి, ఆ వ్యక్తులకే అప్పగిస్తానని చెప్పారు.
ఆర్డీవో నిర్బంధం గర్హనీయం
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ వెళ్లిన ఆర్డీవో రత్న కల్యాణిని ఆందోళనకారులు కారు నుంచి దిగకుండా సాయంత్రం వరకు నిర్బంధించడం గర్హనీయం అని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు కె. చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. ఇథనాల్ పరిశ్రమ పనులపై స్థానిక ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో ఇరువర్గాలతో చర్చించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు వెళ్లిన ఆర్డీవో పట్ల వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదని, ప్రజాసేవకులైన అధికారులను చట్ట వ్యతిరేకంగా నిర్బంధించి వేధింపులకు పాల్పడటం తగదని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో పనిచేసే అధికారులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్డీవో అధికారిక వాహనాన్ని ధ్వంసం చేశారని, అప్రజాస్వామికంగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లగచర్ల ఘటన మరువక ముందే దిలావర్‌పూర్ ఘటన బాధాకరం అని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతం పేర్కొన్నారు. ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ 61వ జాతీయ రహదారిపై ఆందోళన చేపడుతున్న వారితో చర్చించేందుకు వెళ్లిన ఆర్డీవో పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Updated Date - Nov 28 , 2024 | 04:59 AM