Civil Services: స్మితా సబర్వాల్.. మెంటల్లీ అన్‌ఫిట్
ABN, Publish Date - Jul 23 , 2024 | 04:29 AM
సివిల్స్‌లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలపై దివ్యాంగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని.. 24 గంటల్లో స్మిత బహిరంగ క్షమాపణ చెప్పాలని, ‘ఎక్స్’ వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశాయి.
దివ్యాంగులపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి లేదంటే నిరవధిక నిరశన దీక్ష
ఐఏఎస్ శిక్షకురాలు బాలలత ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలతో ఏకీభవించను: హరీశ్‌రావు
క్షమాపణలు చెప్పాలి: తమ్మినేని
దివ్యాంగుల ఆగ్రహజ్వాలలు..
పోలీసులకు ఫిర్యాదులు 8 సీఎ్‌సబీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
సివిల్స్‌లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలపై దివ్యాంగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని.. 24 గంటల్లో స్మిత బహిరంగ క్షమాపణ చెప్పాలని, ‘ఎక్స్’ వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశాయి. ‘‘స్మితా.. రాజీనామా చేసి రా. మళ్లీ పరీక్ష రాద్దాం. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం’’ అని సీఎ్‌సబీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు మల్లవరపు బాలలత సవాల్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో.. దివ్యాంగ హక్కుల సంఘాలకు చెందిన పలువురు నేతలతో కలిసి ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్ తొలి నియామకపత్రాన్ని దివ్యాంగురాలికి ఇచ్చారని గుర్తుచేసిన బాలలత.. దివ్యాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చట్టరీత్యా నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్, జ్యుడీషియరీ నిర్ణయాలకు వ్యతిరేకంగా స్మిత మాట్లాడుతున్నారని.. ఆమె ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నారేమోగానీ మానసికంగా ఫిట్‌గా లేరని మండిపడ్డారు. ‘‘దివ్యాంగులపై వ్యాఖ్యలు చేసే అర్హత ఆమెకు లేదు. నైతికంగా ఆమె డిజేబుల్.
ఆమెకు కీలక శాఖలు ఇస్తే ఎవరూ బతకరు’’ అని ధ్వజమెత్తారు ‘‘ఐఏఎస్, ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా? మెంటల్ ఫిట్నెస్ కావాలా? ఆమె పరుగెడుతూ పనిచేసిందా? కార్లు, చాపర్లు ఎక్కి పనిచేస్తోందా?’’ అని ప్రశ్నించారు. జైపాల్ రెడ్డి తన గురువు అని చెబుతు న్న సీఎం రేవంత్, తెలంగాణ సీఎస్, డీవోపీటీ వారు ఆమె వ్యాఖ్యలను పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని.. 24 గంటల్లో స్మిత బహిరంగ క్షమాపణ చెప్పాలని, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే బడ్జెట్ సమావేశాల అనంతరం ఎస్.జైపాల్ రెడ్డి స్మృతి వనం వద్ద నిరవధిక నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు. సివిల్ సర్వెంట్‌గా తాను 12 ఏళ్లు పనిచేశానని, ఇలాం టి అధికారులు తోటి వారిలో ఉండబట్టే తాను రాజీనామా చేశానని బాలలత అన్నారు. స్మితాసబర్వాల్‌కు ఏదైనా జరగరానిది జరిగి దివ్యాంగురాలు అయితే తన పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో అఖిల భారత దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, వికలాంగుల నెట్‌వర్క్ అధ్యక్షుడు శ్రీనివాస్, సామాజిక కార్యకర్త వసుంధర, ఉదయ్ సంస్థ ప్రతినిధి సుమన్, స్కాలర్స్ అసోసియేషన్ ప్రతినిధి నాగరాజు, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య తదితరులు పాల్గొన్నారు.
నిరసనలు.. ఫిర్యాదులు..
దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. స్మిత వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. స్మితా సబర్వాల్‌పై కేసు నమోదు చేయాలని జాతీయ వికలాంగుల హక్కు ల వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకట్, ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మంచిర్యాలలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు స్మితపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్మిత బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఉమ్మడి ఏపీ దివ్యాంగుల సంస్థ చైర్మన్ పి.సాయిబాబా, ఆమెను చట్టప్రకారం శిక్షించాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్ డిమాండ్ చేశారు. శాంతి దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు శ్రీగరి రజని ఛత్రినాక పోలీసులకు స్మితపై ఫిర్యాదు చేశారు.
Updated Date - Jul 23 , 2024 | 04:29 AM