Singareni CMD Balram: బొగ్గు రంగంలో సవాళ్లను అధిగమిస్తాం
ABN, Publish Date - Dec 24 , 2024 | 05:08 AM
దేశవ్యాప్తంగా బొగ్గు రంగంలో వస్తున్న సవాళ్లను అధిగమించి సింగరేణి సంస్థను ప్రగతిపథంలో నడిపిస్తామని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం విశ్వాసం వ్యక్తం చేశారు.
సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో సీఎండీ బలరాం
మరో వందేళ్లు ఉజ్వలంగా నిలబడాలి: సీఎం
కొత్తగూడెం, హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : దేశవ్యాప్తంగా బొగ్గు రంగంలో వస్తున్న సవాళ్లను అధిగమించి సింగరేణి సంస్థను ప్రగతిపథంలో నడిపిస్తామని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం విశ్వాసం వ్యక్తం చేశారు. సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సోమవారం కొత్తగూడెంలోని ప్రకాశం గ్రౌండ్‌లో సింగరేణి జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం సంస్థ ఏర్పా టు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. కొత్తగూడెం ఏరియాలోని వీకే-7 ఓపెన్‌క్యా్‌స్ట, ఇల్లెందు ఏరియాలోని రొంపేడు ఓపెన్‌క్యా్‌స్ట, రామగుండంలోని కోల్‌మైన్, గోలేటి ఓపెన్ క్యాస్ట్‌లకు సంబంధించిన అనుమతులు సాధించి త్వరలోనే బొగ్గు ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ప్రకటించారు.
540 మెగావాట్ల సౌర విద్యుత్‌ను తయారుచేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలో సైతం సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. మణుగూరు ప్రాంతంలోని పగిడేరులో 300 మెగావాట్ల జియోథర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వెంకటేశ్వరరెడ్డి, సత్యనారాయణరావు, జనరల్ మేనేజర్లు, గుర్తింపు కార్మికసంఘం కార్యదర్శి రాజ్‌కుమార్, ప్రాతినిధ్య సంఘం కార్యదర్శి జనక్ ప్రసాద్‌తో పాటు డీజీఏంలు, ఏజీఏంలు, తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ సంస్థ కార్మికులు, వారి కుటుంబసభ్యులు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి ప్రగతి పథాన సాగుతూ దేశానికి వెలుగులు పంచుతుండటం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. మరో శత వసంతాలు ఉజ్వలంగా దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలవాలని ఆకాంక్షించారు.
Updated Date - Dec 24 , 2024 | 05:08 AM