Lorry Accident: రైతులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురి దుర్మరణం
ABN, Publish Date - Dec 03 , 2024 | 03:21 AM
అది హైదరాబాద్-బీజాపూర్ రహదారి.. ఆ హైవేలో రంగారెడ్డి జిల్లా ఆలూరు వద్ద రైతులు తాము పండించిన కూరగాయలను రోజూలాగానే రోడ్డు పక్కన పెట్టి అమ్ముకుంటున్నారు..
మరో నలుగురికి తీవ్ర గాయాలు.. ఇద్దరు విషమం
రంగారెడ్డి జిల్లా ఆలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న రైతులపైకి లారీ
అప్రమత్తతతో కొందరికి తప్పిన ముప్పు
లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్.. జేసీబీ సాయంతో బయటకు
ఆలూరు గ్రామస్థుల ఆగ్రహం.. రోడ్డుపై ధర్నా
ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి
వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
బైక్‌పై తిరగబడ్డ బొలేరో.. ఇద్దరి మృతి
రంగారెడ్డి అర్బన్/చేవెళ్ల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): అది హైదరాబాద్-బీజాపూర్ రహదారి.. ఆ హైవేలో రంగారెడ్డి జిల్లా ఆలూరు వద్ద రైతులు తాము పండించిన కూరగాయలను రోజూలాగానే రోడ్డు పక్కన పెట్టి అమ్ముకుంటున్నారు.. సోమవారం సాయంత్రం 4.40 గంటల సమయంలో వారిపైకి హఠాత్తుగా మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది.. అతివేగంగా బస్సును ఓవర్ టేక్ చేయబోయిన ఆ లారీ.. అదపు తప్పి.. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న రైతుల పైకి దూసుకెళ్లింది. ముగ్గురు వ్యక్తులు లారీ చక్రాల కింద నలిగిపోయారు. ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలవగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గేటు వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదం అందరినీ కలచివేసింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళుతున్న లారీ డ్రైవర్ ఆలూరు వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయబోగా.. అతివేగం కారణంగా అదుపు తప్పింది.
రోడ్డు పక్కనే కూరగాయలు అమ్ముకుంటున్న రైతుల పైనుంచి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. లారీ ఢీకొట్టిన వేగానికి భారీ చెట్టు విరిగిపోయింది. లారీ ముందు టైరు ఊడి పంట పొలాల్లో ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఆలూరుకు చెందిన నక్కలపల్లి రాములు(46), దామరిగిద్ద కృష్ణ (22)తో పాటు నాన్‌చెరుకు చెందిన శ్యామల సుజాత(36) అక్కడికక్కడే మృతి చెందారు. గుర్తు తెలియని మరో యవకుడు(27) చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు అతని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. లారీ డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు.. ఆలూరుకుచెందిన మొగులయ్య, ఆకుల పద్మమ్మ, నాన్‌చెరుకు చెందిన బాలమణి, మాల్యాద్రికి గాయాలయ్యాయి. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్‌ను జేసీబీ యంత్రం సాయంతో పోలీసులు బయటకు తీశారు. లారీ డ్రైవర్‌కు కాళ్లు విరిగిపోయాయి. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
అప్రమత్తతో తప్పిన ముప్పు
లారీ అదుపు తప్పి వస్తున్న విషయాన్ని కొందరు గమనించి పరుగులు తీశారు. లేదంటే ప్రాణనష్టం ఇంకా ఎక్కువగా ఉండేది. సంఘటన జరిగిన సమయంలో అక్కడ దాదాపు 40 మంది రైతులు ఉన్నారు. వంద మీటర్ల దూరం నుంచే ప్రమాదాన్ని గమనించిన కొందరు కేకలు వేసుకుంటూ పరుగులు పెట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆలూరు గేటు వద్ద స్థానిక రైతులు కొన్నేళ్లుగా తాము పండించిన కూరగాయలను అమ్ముకుంటూ జీవిస్తున్నారు. కూరగాయలు చౌకగా, తాజాగా ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారితో పాటు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే వారు వీరి దగ్గర కొనుక్కుంటూ ఉంటారు. అతివేగం.. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్-బీజాపూర్ రహదారి ఇరుకుగా ఉండడంతో పాటు గుంతలు, ప్రమాదభరిత మలుపులు ఉన్నాయి. లారీ డ్రైవర్ ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ.. ఎదురుగా వచ్చే వాహనాలను తప్పిస్తున్నాడు. వేగాన్ని తగ్గించకుండానే బస్సును ఆలూరు గేట్ వద్ద ఓవర్‌టేక్ చేయడంతో అదుపుతప్పి లారీ కుడి వైపునకు దూసుకెళ్లింది. ఓవర్ టేక్ చేయకుంటే ప్రమాదం జరిగేది కాదని స్థానికులు చెప్పారు. కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్న రైతులను మృత్యువు కబళించడంతో ఆలూరు, నాన్‌చెరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
నిత్యం ప్రమాదాలే..
ఈ రహదారిలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారా యి. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీడీఎల్‌కు చెందిన ఉద్యోగి, ఆయన భార్య మృతి చెందారు. 24 గంటలు గడవక ముందే లారీ దూసుకొచ్చి నలుగురు చనిపోయారు. ఇటీవలే హైదరాబాద్-బీజాపూర్ హైవే విస్తరణకు నిధులు మంజూరయ్యాయి. కోర్టులో కేసులతో పనులు ఆగాయి. ఇటీవల కేసులన్నీ వీగిపోయినప్పటికీ పనులు మాత్రం మొదలు కాలేదు.
ఆగ్రహంతో గ్రామస్థుల ధర్నా
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందడంతో ఆలూరుతో పాటు చుట్టుపక్కల గ్రా మాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై ధర్నా చేశారు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. పోలీసులు ధర్నా చేస్తున్న వారిని సముదాయించారు.
త్రుటిలో తప్పించుకున్నాం
గత కొన్నేళ్ల నుంచి ఆలూరు గేటు వద్ద కూరగాయలు అమ్ముకుంటున్నాం. సోమవారం సాయంత్రం నా భార్య పద్మమ్మను ఇంటికి తీసుకెళ్లేందుకు గేట్ దగ్గరకు వెళ్లాను. చూస్తుండగానే లారీ మా పైకి దూసుకొచ్చింది. వెంటనే కూరగాయలు వదిలిపెట్టి పక్కకు పరుగులు తీశాం. నా భార్య తలకు గాయం అయింది. దేవుడి దయ వల్ల మాకు పెద్ద ప్రమాదం తప్పింది.
- ఆకుల పాండు, ప్రత్యక్ష సాక్షి
సీఎం రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి
రంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సబిత, ఎమ్మెల్యే కాలె యాదయ్య, తదితరులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పరామర్శించారు.
Updated Date - Dec 03 , 2024 | 03:21 AM