పూచీ ఇస్తేనే సీఎంఆర్
ABN, Publish Date - Oct 30 , 2024 | 03:25 AM
పూచీకత్తు లేకుండా రైస్‌మిల్లర్లకు రూ.కోట్ల విలువైన ధాన్యం అప్పగించే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పింది. ఇకపై బ్యాంకు గ్యారెంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో రైస్‌మిల్లర్లు ఆస్తులు తాకట్టు పెడితేనే ధాన్యం అప్పగించాలని నిర్ణయించింది.
బ్యాంకు గ్యారెంటీ.. లేకపోతే 25% సెక్యూరిటీ డిపాజిట్
పూచీకత్తు ఇచ్చిన మిల్లర్లకే ఇకపై ధాన్యం కేటాయింపులు
డిఫాల్టర్లకు సీఎంఆర్ వడ్లు ఇవ్వొద్దని సర్కారు నిర్ణయం
మిల్లింగ్ చార్జీల పెంపు.. దొడ్డు వడ్లకు 30, సన్నాలకు 40
గడువులోగా బియ్యం ఇచ్చిన మిల్లర్లకే ఈ చార్జీల వర్తింపు
ధాన్యం సేకరణ పాలసీని విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): పూచీకత్తు లేకుండా రైస్‌మిల్లర్లకు రూ.కోట్ల విలువైన ధాన్యం అప్పగించే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పింది. ఇకపై బ్యాంకు గ్యారెంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో రైస్‌మిల్లర్లు ఆస్తులు తాకట్టు పెడితేనే ధాన్యం అప్పగించాలని నిర్ణయించింది. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక, క్యాబినెట్ ఆమోదంతో జీవో-27 ను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. ధాన్యం సేకరణ పాలసీని ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. కొత్త పాలసీ ప్రకారం.. రైస్‌మిల్లర్లు పౌర సరఫరాల శాఖ నియంత్రణలో కస్టమ్ మిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు మిల్లింగ్ చార్జీలు సవరించి రైస్‌మిల్లర్లకు సర్కారు ఉపశమనం కలిగించింది. అయితే సకాలంలో సీఎంఆర్ డెలివరీ ఇచ్చిన మిల్లర్లకే పెంచిన చార్జీలు వర్తిస్తాయని ప్రభుత్వం షరతు పెట్టింది. కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీ ప్రాతిపదికన రైస్ మిల్లర్లను మూడు క్యాటగిరీలుగా ప్రభుత్వం
విభజించింది. గతంలో ఎప్పుడూ డిఫాల్టర్ల జాబితాలో చేరకుండా, సకాలంలో బియ్యం డెలివరీ చేసే మిల్లర్లను మొదటి క్యాటగిరీలో చేర్చింది. ఆమోదించిన మిల్లింగ్ కెపాసిటీపై 10 శాతం బ్యాంకు గ్యారెంటీని ఈ మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.
ఇక రెండో క్యాటగిరీలో.. గతంలో డిఫాల్టర్ అయినప్పటికీ, జరిమానాతో సహా బకాయిలు చెల్లించిన రైస్‌మిల్లర్లను చేర్చింది. వీరు 20 శాతం బ్యాంకు గ్యారెంటీ, లేకపోతే 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. మూడో క్యాటగిరీలో.. గతంలో డిఫాల్టర్ అయి ఉండి, 100 శాతం బకాయిలు తీర్చేసినా.. 25 శాతం జరిమానా చెల్లించని రైస్‌మిల్లర్లను చేర్చింది. వీరు 25 శాతం బ్యాంకు గ్యారెంటీ, లేకపోతే 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఇక బకాయిలు, జరిమానా ఏదీ చెల్లించని రైస్‌మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదని జీవోలో సర్కారు స్పష్టం చేసింది.
మిల్లింగ్ ఛార్జీల పెంపు..
కస్టమ్ మిల్లింగ్ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయగా వచ్చే నూకలు, తౌడు, ఊక, పరం తదితర ఉప ఉత్పత్తులన్నీ రైస్‌మిల్లర్లే తీసుకుంటారు. వీటితోపాటు క్వింటాకు రూ.10 చొప్పున అదనపు మిల్లింగ్ చార్జీలు ఇచ్చేవారు. అయితే ఈ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఇక నుంచి దొడ్డు ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే క్వింటాకు రూ.30, సన్న వడ్లను మిల్లింగ్ చేస్తే క్వింటాకు రూ.40 చొప్పున అదనపు మిల్లింగ్ చార్జీలు చెల్లిస్తారు. ఖరీఫ్- 2024 సీజన్ నుంచి కొత్త చార్జీలు అమలవుతాయి. అయితే గడువులోగా సీఎంఆర్ డెలివరీ చేసిన మిల్లర్లకే అదనపు మిల్లింగ్ చార్జీలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. గడువులోగా సీఎంఆర్ పూర్తిచేయని వారికి, పొడిగించిన గడువులో సీఎంఆర్ డెలివరీ చేసిన మిల్లర్లకు ఈ చార్జీలు వర్తించబోవని షరతు పెట్టింది.
సన్నాలను గుర్తించే బాధ్యత ఏఈవోలకు..
సన్న ధాన్యాన్ని గుర్తించే బాధ్యతను ప్రభు త్వం వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో) కు అప్పగించింది. ఇందుకు ప్రతి రైస్‌మిల్లుకు ఒక ఏఈవోను కేటాయించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు వచ్చిన ధాన్యంపై ఏమైనా అభ్యంతరాలుంటే మిల్లర్లు 48 గంటల్లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేయాలి. ఆ ఫిర్యాదును స్వీకరించిన ఏఈవో 24 గంట ల్లో రైస్‌మిల్లుకు వెళ్లి ధాన్యాన్ని పరిశీలించాలి. సన్న రకమో..? దొడ్డు రకమో..? తేల్చాలి. ఈ అంశంలో కలెక్టర్లు కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇప్పించాలని సర్కారు ఉత్తర్వుల్లో తెలిపింది. సన్నాలు, దొడ్డు రకాల నాణ్యతను ఎలా పరిశీలించాలి? గ్రేన్‌రైస్ క్యాలిపర్‌తో గానీ, నేరుగా తనిఖీ చేయటం ద్వారా గానీ ఎలా గుర్తించాలనే అంశాలను శిక్షణలో వివరించాలని పేర్కొంది.
ఒకవేళ సన్నాలు, దొడ్డు రకాలను గుర్తించే క్రమంలో ఏఈవోల నిర్ణయాలపై అభ్యంతరాలు వస్తే.. వాటిని పరిష్కరించటానికి జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలో రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ల కు ప్రభుత్వం సూచించింది. వ్యవసాయ శాఖ ఏడీఏ, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దారుతో డివిజన్ కమిటీ.. జిల్లా వ్యవసాయాధికారి(డీఏవో), జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి(డీఎ్‌సవో)తో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Updated Date - Oct 30 , 2024 | 03:25 AM