Takkalapalli : ఆశన్న క్షేమమేనా?
ABN, Publish Date - Oct 06 , 2024 | 04:29 AM
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఛత్తీ్‌సగఢ్‌లోని నారాయణపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వెంకటాపూర్ (రామప్ప), అక్టోబరు 5: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఛత్తీ్‌సగఢ్‌లోని నారాయణపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ ప్రకంపనలు ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలంలోని నర్సింగాపూర్ గ్రామాన్ని తాకాయి. ఈ గ్రామం నుంచి నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్‌వార్ ఉద్యమం వైపు ఆకర్షితుడైన తక్కళ్లపల్లి వాసుదేవరావు అజ్ఞాతంలోకి వెళ్లారు. తొలుత కాకతీయ వర్సిటీ సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్‌కు నాయకత్వం వహించారు. వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం అప్పటి హనుమకొండ మండలం కాజీపేటలోని ఫాతిమా స్కూల్‌లో సెకండరీ విద్యనభ్యసించారు.
కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ రాడికల్ స్టూడెంట్ యూనియన్‌కు(ఆర్‌ఎ్‌సయూ) నాయకత్వం వహిస్తూ ఆతర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం వాసుదేవరావు వయసు 60 ఏళ్లు పైబడి ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. వెంకటాపూర్ పోలీ్‌సస్టేషన్‌లో 38ఏళ్ల క్రితమే తక్కళ్లపల్లి వాసుదేవరావుపై క్రైమ్ రిపోర్టు నమోదైంది. తండ్రి భిక్షపతిరావు అనారోగ్య సమస్యలతో కొన్నేళ్ల క్రితం మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. హనుమకొండ గోపాల్‌పూర్‌లో నివాసం ఉంటున్న సోదరుడు సహదేవరావు దగ్గర తల్లి సరోజన ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. వాసుదేవరావు అలియాస్ ఆశన్నను తామెప్పుడూ చూడలేదని గ్రామస్థులు తెలిపారు. కాగా, కేంద్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు మృతిపై ఛత్తీ్‌సగఢ్ రాష్ట్ర పోలీస్ విభాగం నుంచి అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని ములుగు డీఎస్పీ రవీందర్ తెలిపారు.
ఎన్‌కౌంటర్‌లో పోరంకి వాసి..
విజయవాడ/పెనమలూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకికి చెందిన జోరిగ నాగరాజు అలియాస్ కమలేష్ అలియాస్ రామకృష్ణ, అలియాస్ ఆర్కే అలియాస్ విష్ణు మరణించారు. 1971లో జన్మించిన నాగరాజు 1991-92లోనే పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు, రాడికల్ భావాలకు ఆకర్షితుడై మావోయిస్టు దళంలో చేరారు. నాగరాజు బాల్యమంతా పోరంకిలోనే గడిచింది. 20 ఏళ్ల క్రితం నాగరాజు తల్లిదండ్రులు చనిపోయారు. నాగరాజు దళంలో కీలకంగా వ్యవహరించడం వల్ల పోలీసులు పలుమార్లు ఇంటికి వచ్చి ఆరా తీస్తుండడంతో ఆయన కుటుంబం తలోదిక్కుకు వెళ్లిపోయింది. నాగరాజు కొన్నాళ్లు ఏపీ క్యాడర్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బస్తర్ జోనల్ కమిటీ ఇన్‌చార్జిగా ఉన్న ఆయనకు పార్టీ పదోన్నతి ఇచ్చి దండకారణ్యం ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడిగా నియమించింది. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండడంతో ఆయనపై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.
ఛత్తీ్‌సగఢ్‌లో ఎన్‌కౌంటర్ బూటకం
ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే.. న్యాయ విచారణ జరిపించాలి
పౌర హక్కుల సంఘం తెలంగాణ నేతల డిమాండ్
నల్లకుంట/రాంనగర్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్ అబూజ్‌మడ్ ప్రాంతంలోని తుల్‌తుల నెందూర్ ఎన్‌కౌంటర్ బూటకం అని, ఈ నెల 4 నాటి ఎన్‌కౌంటర్ మృతుల వివరాలను ప్రకటించాలని, అన్ని ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని వారు ఆరోపించారు. హైదర్‌గూడలో మీడియాతో పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ గడ్డం, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు తదితరులు మాట్లాడారు. నక్సలైట్లను కూడా తుద ముట్టిస్తామనే పరిభాష ప్రజా జీవితాల్లో ముడి వేసుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వాడుకోవడం చట్ట వ్యతిరేకం అని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో సుమారు 200 మంది చనిపోయారని వారన్నారు. ప్రభుత్వాలు పటిష్టమైన ఇన్‌ఫార్మర్ వ్యవస్థ, కోవర్టులను తయారు చేసుకుని హత్యాకాండ కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. ఈ కూంబింగ్ ఆపరేషన్లను వెంటనే నిలిపివేయాలని, పోలీసు క్యాంపులను ఎత్తి వేయాలని, ఆదివాసీల రక్షణకు వెంటనే పూనుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 40 మంది చనిపోయినట్లు సమాచారం ఉందని, ఎన్‌కౌంటర్ల మృతుల పేర్లు, వివరాలు, ఫొటోలతోపాటు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ఎన్‌కౌంటర్ పేరిట 36 మందిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల్చి చంపడం అన్యాయం అని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
Updated Date - Oct 06 , 2024 | 04:29 AM