T. Jaggareddy: రాహుల్ ఇంటి ముందు నువ్వు దీక్షకు వెళితే.. అదే రోజు కేసీఆర్ ఇంటి ముందు నేను దీక్ష చేస్తా
ABN, Publish Date - Oct 06 , 2024 | 03:10 AM
రాహుల్‌గాంధీ ఇంటి ముందు.. హరీశ్ రావు ధర్నాకు దిగితే.. అదే రోజున కేసీఆర్ ఇంటి ముందు తాను దీక్షకు దిగుతానంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రకటించారు.
నీది.. నీ మామది రాజకీయ మోసాల కుటుంబం.. పదేళ్ల పాటు మీరు రైతుల్ని మోసం చేసినందుకు దీక్ష చేస్తా
కేసీఆర్‌ది రైతు గుండె అయితే.. తొమ్మిదన్నరేళ్లు ఆ గుండెను ఫ్రిజ్‌లో పెట్టారా?
రైతు రుణమాఫీపై కేసీఆర్‌ను చర్చకు ఒప్పించు.. సీఎం రేవంత్‌ను నేను ఒప్పిస్తా.. హరీశ్‌కు తూర్పు జగ్గారెడ్డి సవాల్
హైదరాబాద్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీ ఇంటి ముందు.. హరీశ్ రావు ధర్నాకు దిగితే.. అదే రోజున కేసీఆర్ ఇంటి ముందు తాను దీక్షకు దిగుతానంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రకటించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఆ తర్వాత ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని, పైగా రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామంటే తాము ఊరుకుంటామా అని ప్రశ్నించారు. కేసీఆర్, హరీశ్ రావులది మోసాల కుటుంబమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసినందుకు కేటీఆర్ ఫాం హౌస్ దగ్గర తాను దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్ కుటుంబానికి రాహుల్‌గాంధీ ఇంటి ముందు దీక్ష చేసే హక్కు లేదన్నారు. గాంధీభవన్‌లో శనివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మోసాలు చేయడంలో కేసీఆర్ నెంబర్ 1 అని, ఆయనది రైతు గుండె అంటూ మాట్లాడడం అన్యాయమన్నారు. ‘‘కేసీఆర్‌ది రైతు గుండె అయితే ఈ తొమ్మిదిన్నరేళ్లు దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఉంచారా? ఆయనది రైతు గుండె అయితే మల్లన్నసాగర్ రైతులను పోలీసులతో కొట్టించినప్పుడు ఏమయ్యాడు? ఖమ్మం రైతులకు బేడీలు వేసినప్పుడు ఏమైంది కేసీఆర్ గుండె? మీకు విచిత్రమైన గుండెలు ఉన్నాయి హరీశ్‌రావ్..!’’ అంటూ ఎద్దేవా చేశారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబినందువల్లే బీఆర్‌ఎస్ ప్రభుత్వం పడిపోయిందన్నారు. కేసీఆర్ రైతుల్ని మోసం చేస్తే.. కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి.. వారికి ఏకకాలంలో రుణమాఫీ చేశారని కొనియాడారు. తమ పాలనలో లోపాలుంటే సరిదిద్దుకుంటామని చెప్పారు. తమను రాష్ట్రంలో తిరగనివ్వకుండా ఆపే దమ్ము కేటీఆర్‌కుగానీ, హరీశ్‌కు గానీ లేదన్నారు.
బీఆర్‌ఎస్ వల్లే రుణమాఫీలో ఆలస్యం
‘‘హరీశ్ రావ్.. రుణమాఫీపై చర్చకు సిద్దమా? మీ వైపు నుంచి కేసీఆర్, నువ్వు.. కేటీఆర్‌లు వస్తే.. మా వైపు నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు వస్తరు. కేసీఆర్ రాకుండా.. ఎల్లిగాడు, మల్లిగాడు వస్తడంటే కుదరదు. నేను సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పిస్త.. నువ్వు కేసీఆర్‌ను ఒప్పించు. రుణమాఫీపైన రైతులతో చర్చ చేద్దాం రా..! ’’ అంటూ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఈ చర్చ సిద్దిపేటలో పెట్టినా సిద్ధమేనన్నారు. అసలు రుణమాఫీపై చర్చకు కేసీఆర్‌ను ఒప్పించే కెపాసిటీ హరీశ్ రావుకు ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదన్నట్లుగా హరీశ్ రావు పదే పదే మాట్లాడుతున్నాడని, కానీ సోనియా, రాహుల్‌గాంధీలు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు నెలలోనే సీఎం రేవంత్ ప్రభుత్వం రూ.18 వేల కోట్ల మేరకు రైతుల రుణాలను మాఫీ చేసిందన్నారు. మరో రూ. 12 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉన్నా.. అది చిన్నచిన్న సమస్యలతోనే ఆగిందన్నారు. అది కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే ఆలస్యమవుతోందన్నారు. సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదని, బ్యాంకుల వద్ద ఉందన్నారు.
పబ్లిసిటీలో మేం ఫెయిల్.. మీరు పాస్!
ఆర్థికశాఖను దివాళా తీయించి రూ.7 లక్షల కోట్ల మేరకు అప్పులు మిగిల్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఇన్ని అప్పులున్నా కూడా రైతులకు రూ.18 వేల కోట్ల మేరకు రుణాలను మాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఏకకాలంలో రూ.2 లక్షల చొప్పున రైతులకు రుణమాఫీ చేసిందని చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్ష రుణాన్ని మాఫీ చేయడానికి ఐదేళ్లలో నాలుగు వాయిదాలు తీసుకుందన్నారు. అయితే చేసినదాన్ని ప్రచారం చేసుకోవడంలో తాము ఫెయిల్ అయితే.. బీఆర్‌ఎస్ మాత్రం ప్రచారంలో పాస్ అయిందన్నారు. ఇదే.. కాంగ్రె్‌సకు, బీఆర్‌ఎ్‌సకు ఉన్న తేడా అని ఆయన చెప్పారు.
Updated Date - Oct 06 , 2024 | 03:10 AM