Tahsildar Arrest: ‘ధరణి’ పోర్టల్‌తో తహసీల్దార్ దగా
ABN, Publish Date - Oct 10 , 2024 | 03:44 AM
‘ధరణి’ పోర్టల్ ద్వారా అక్రమంగా ప్రభుత్వ భూమిని బదలాయించి రూ.14 లక్షల ‘రైతుబంధు’ లబ్ధి పొందిన తహసీల్దార్‌కు హుజూర్‌నగర్ జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.
36 ఎకరాల ప్రభుత్వ భూమి బదలాయింపు
ఆపరేటర్‌తో కలిసి అక్రమాలు
‘రైతుబంధు’ రూ.14 లక్షలను
పంచుకున్న ఇరువురు
జైలులో ఆపరేటర్.. తహసీల్దార్‌కు 14 రోజుల రిమాండ్
హుజూర్‌నగర్, అక్టోబరు 9: ‘ధరణి’ పోర్టల్ ద్వారా అక్రమంగా ప్రభుత్వ భూమిని బదలాయించి రూ.14 లక్షల ‘రైతుబంధు’ లబ్ధి పొందిన తహసీల్దార్‌కు హుజూర్‌నగర్ జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో ఆమెతో కలిసి అక్రమాలకు పాల్పడిన ధరణి ఆపరేటర్ ఇప్పటికే జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న వజ్రాల జయశ్రీ 2019 నుంచి 2023 వరకు హుజూర్‌నగర్‌లో విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె ఉన్నతాధికారులకు తెలియకుండా సుమారు 36.23 ఎకరాల ప్రభుత్వ భూమిని ‘ధరణి’ కంప్యూటర్ ఆపరేటర్ జగదీశ్ కుటుంబసభ్యులకు బదలాయించారు.
నిబంధనలకు విరుద్ధంగా భూముల బదలాయింపుపై బూరుగడ్డ గ్రామస్థులు సూర్యాపేట జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటంతో ఆర్డీవోతో ప్రాథమిక విచారణ జరిపించారు. ‘ధరణి’ ఆపరేటర్ జగదీశ్ కుటుంబసభ్యులు పేరిట రూ. 1కోటీ 56లక్షల విలువైన 36.23 ఎకరాల భూమిని బదలాయించినట్లు గుర్తించారు. అక్రమంగా ‘ధరణి’ పోర్టల్ ద్వారా డిజిటల్ పట్టాలు పొందిన కంప్యూటర్ ఆపరేటర్ కుటుంబసభ్యులకు ‘రైతుబంధు’ కింద రూ.14,63,004 లబ్ధి చేకూరగా ఆ మొత్తాన్ని జయశ్రీ, జగదీశ్ పంచుకున్నట్లు తేల్చారు. ఆర్డీవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తహసీల్దార్ జయశ్రీని బుధవారం అరెస్టు చేసి హుజూర్‌నగర్ కోర్టులో ప్రవేశపెట్టగా... జూనియర్ సివిల్ జడ్జి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. జయశ్రీని హుజూర్‌నగర్ సబ్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే కేసులో ఇప్పటికే ఆపరేటర్ వత్సవాయి జగదీశ్ హుజూర్‌నగర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
Updated Date - Oct 10 , 2024 | 03:44 AM