Tax Officer: రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన సీటీవో
ABN, Publish Date - Aug 01 , 2024 | 03:38 AM
ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆస్తుల మదింపునకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసిన వాణిజ్య పన్నుల శాఖ అధికారి శ్రీధర్‌ను అవినీతి నిరోధకశాఖ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అఫ్జల్‌గంజ్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆస్తుల మదింపునకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసిన వాణిజ్య పన్నుల శాఖ అధికారి శ్రీధర్‌ను అవినీతి నిరోధకశాఖ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కథనం ప్రకారం.. ఉప్పల్ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను మదింపు చేసేందుకు పంజాగుట్ట సర్కిల్‌కు చెందిన స్టేట్ ట్యాక్స్ అధికారి శ్రీధర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సరైన ఫార్మాట్‌లో దరఖాస్తు చేయలేదంటూ శ్రీకాంత్‌కు శ్రీధర్ నోటీసులు పంపారు.
దానికి శ్రీకాంత్ స్పందిస్తూ.. సరైన ఫార్మాట్‌లోనే డాక్యుమెంట్లు ఉన్నాయని వివరిస్తూ సమాధానం ఇచ్చారు. దాంతో శ్రీధర్ 3 లక్షల లంచం ఇస్తేనే పనవుతుందని తేల్చిచెప్పారు. చివరకు రూ.2 లక్షలకు బేరానికి దిగారు. దాంతో శ్రీకాంత్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బుధవారం ఆబిడ్స్‌లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో.. శ్రీధర్‌కు రూ.2 లక్షలు అందజేశారు. ఏసీబీ అధికారులు దాడి చేసి, శ్రీధర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి రూ.2 లక్షలను సీజ్ చేశారు.
Updated Date - Aug 01 , 2024 | 03:38 AM