Koneti Adimul: ఆదిమూలం.. వేధించారు!
ABN, Publish Date - Sep 06 , 2024 | 04:53 AM
ఏపీలోని తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అదే పార్టీకి చెందిన మండల స్థాయి మహిళా నాయకురాలు సంచలన ఆరోపణలు చేశారు.
తిరుపతిలో హోటల్‌కు పిలిచి
పలుమార్లు లైంగిక దాడి చేశాడు
నా భర్త సూచనలతో వ్యవహారం
మొత్తం పెన్ కెమెరాలో రికార్డ్ చేశా
టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై
ఆ పార్టీ మహిళా నేత ఆరోపణలు
ఆధారాలు వెల్లడించిన బాధితురాలు
బాబు సీరియస్.. ఎమ్మెల్యే సస్పెన్షన్
పంజాగుట్ట/తిరుపతి/అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఏపీలోని తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అదే పార్టీకి చెందిన మండల స్థాయి మహిళా నాయకురాలు సంచలన ఆరోపణలు చేశారు. ఆదిమూలం తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తనను, తన కుటుంబాన్నీ చంపేస్తానని బెదిరించారని ఆరోపించారు. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని, లేకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు హెచ్చరించారు.
ఈ మేరకు గురువారం హైదరబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె తన భర్తతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలు, వీడియోలు, మొబైల్ కాల్ లిస్ట్ వంటి ఆధారాలను రిలీజ్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఆదిమూలం టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చారు. దీనిని నేను తీవ్రంగా వ్యతిరేకించా. అయినా బాబు ఆదేశాల మేరకు ఇతర నాయకులను కలుపుకొని ఆదిమూలంను గెలిపించాం. ఒకే పార్టీకి చెందిన వాళ్లం కావడంతో నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. అప్పటి నుంచి వేధించడం ప్రారంభించారు. రాత్రి సమయాల్లో ఫోన్లు చేసి.. తనతో గడపడానికి హోటల్‌కు రావాలని ఒత్తిడి చేసేవారు. పలుమార్లు తిరస్కరించా.
దీంతో నన్ను,నా కుటుంబ సభ్యులను అంతుచూస్తానని బెదిరించారు. ఆయన వేధింపులు భరించలేక మాట్లాడదామనే ఉద్దేశంతో జూలై 6న తిరుపతిలోని ఓ హోటల్ గదికి వెళ్లా. అక్కడే నాపై ఆదిమూలం అత్యాచారం చేశారు. ఎవరికైౖనా చెబితే చంపేస్తానని బెదిరించారు. దీంతో గతిలేని పరిస్థితిలో ఆయనకు లొంగిపోవాల్సి వచ్చింది. అలా నాపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. అర్థరాత్రులు ఫోన్లు చేస్తుడడంతో నా భర్త గట్టిగా నిలదీశారు. దీంతో జరిగిన విషయం చెప్పా. నా భర్త సూచనతో పెన్‌కెమెరా పట్టుకుని హోటల్‌కు వెళ్లా.
ఆ గదిలో పెన్ కెమెరాపెట్టి ఆదిమూలం బాగోతాన్ని రికార్డ్ చేశా’’ అని బాధితురాలు వివరించారు. ఆదిమూలం వేధింపులు పెరగడంతో ఆయనను దూరం పెట్టానని, విషయం మొత్తాన్నీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు వివరిస్తూ లేఖ రాసినట్టు చెప్పారు. తన వద్ద అన్ని సాక్ష్యాలూ ఉన్నాయని తెలిపారు. రోజుకో అమ్మాయితో ఆదిమూల ఎంజా య్ చేేసవారని, ఇలా ఎంతోమందిని టార్చర్‌చేశారని బాధితురాలు ఆరోపించారు. ఆదిమూలం బారి నుంచి మహిళలను కాపాడాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తనకు, తన కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే సామూహిక ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు.
నాపై కుట్ర చేశారు: ఎమ్మెల్యే
మహిళా నాయకురాలి ఆరోపణలతో సత్యవేడు ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారు. ఓ చానెల్ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడుతూ.. మార్ఫింగ్ చేసిన వీడియోలతో తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ‘‘నేను తప్పు చేయలేదు. నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన రమేశ్‌బాబుతో పాటు పార్టీలోని మునుస్వామి యాదవ్, గిరిబాబు, బాలరాజు తదితర నాయకులు పన్నిన కుట్ర’’అని అన్నారు.
ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు
కోనేటి ఆదిమూలంపై సొంత పార్టీ తెలుగు మహిళా నేత చేసిన లైంగికవేధింపుల ఆరోపణల నేపథ్యంతో గంటల వ్యవధిలోనే టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. ఆదిమూలంపై పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై పార్టీపరంగా విచారణకు కమిటీ వేసింది. కాగా, గురువారం సీఎం చంద్రబాబు విజయవాడలో వరదపై సమీక్ష జరుపుతున్నప్పుడు ఈ వ్యవహారం ఆయన దృష్టికి వచ్చింది. ‘వీరిని ప్రజలు గెలిపించింది ఎందుకు? వీరు చేస్తోందేమిటి? వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయండి’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఆరోపణల తీవ్రత దృష్ట్యా వివరణ కోరాల్సిన అవసరం కూడా లేదన్నారు. దీంతో వెంటనే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేశారు.
Updated Date - Sep 06 , 2024 | 04:53 AM