Farmers Support: వచ్చే నెలలో రైతులందరికీ రైతు భరోసా
ABN, Publish Date - Dec 16 , 2024 | 03:54 AM
వచ్చే నెలలో రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని, గతంలో మాదిరిగా రైతులకు అన్ని రకాల పనిముట్లు రాయితీపై అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు.
పంటల ఎగుమతి స్థాయికి రైతులు ఎదగాలి
అన్ని రకాల పనిముట్ల రాయితీపై ఇస్తాం
మహిళా రైతులకు 80 శాతం రాయితీపై డ్రోన్‌లు
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
పరిగి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెలలో రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని, గతంలో మాదిరిగా రైతులకు అన్ని రకాల పనిముట్లు రాయితీపై అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. తెలంగాణలోని పంటల సాగు దేశంలోనే రికార్డని, ఇక్కడ పండించిన పంటలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి రైతులు ఎదగాలని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి, కులకచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి సీతక్క, చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలో వ్యవసాయ రంగానికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సంతృప్తి ఏ రంగంలో లేదన్నారు.
చదువుకున్న వారు పంటలు సాగు చేస్తే ఉద్యోగాల కంటే ఎక్కువగా సంపాదిస్తారని తెలిపారు. పంటల సాగులో రసాయనాలు లేకుండా సాగు చేస్తే ప్రపంచ దేశాలే మనవైపు చూస్తాయన్నారు. మహిళా సంఘాల్లోని మహిళా రైతు సభ్యులకు 80 శాతం రాయితీపై డ్రోన్‌ల పంపిణీ చేస్తామని తెలిపారు. పంటలకు మద్దతు ధర కల్పించేందుకు రూ.10 వేల కోట్లు కేటాయించామన్నారు. దేశంలోనే రుణమాఫీలో తెలంగాణ రికార్డని, ఇప్పటి వరకు రూ.21 వేలకోట్లు రుణమాఫీ చేశామన్నారు. అలాగే మిగిలిన రైతులకు కూడా త్వరలో పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ, తెలంగాణలో రైతులే శాస్త్రవేత్తలుగా మారాలని సూచించారు. రైతులు పంటల మార్పిడి దిశగా పయనించాలని సూచించారు.
Updated Date - Dec 16 , 2024 | 03:54 AM