Cabinet: రేపు సాయంత్రం క్యాబినెట్ భేటీ..?
ABN , Publish Date - Dec 14 , 2024 | 04:03 AM
సోమవారం నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఉన్న ముఖ్యమైన బిల్లులు, కీలక అంశాలపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం క్యాబినెట్ సమావేశం ఉంటుందనే చర్చ అధికారుల్లో జరుగుతోంది.
నేడు ఆర్వోఆర్ తుది ముసాయిదాపై సీఎం సమీక్ష
ఎల్లుండి సభలో కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని ఆమోదించే అవకాశం
హైదరాబాద్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సోమవారం నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఉన్న ముఖ్యమైన బిల్లులు, కీలక అంశాలపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం క్యాబినెట్ సమావేశం ఉంటుందనే చర్చ అధికారుల్లో జరుగుతోంది. ఈ సమావేశంలో త్వరలో తీసుకురానున్న కొత్త ఆర్వోఆర్ చట్టం-2024 చర్చకు రానున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఆర్వోఆర్ తుది ముసాయిదాపై సమీక్షించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితమే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆర్వోఆర్ ముసాయిదాపై సీఎం సమీక్ష పూర్తయిన తరువాత ఆదివారం క్యాబినెట్‌లో చర్చించి.. ఇందుకు సంబంధించిన చట్టాన్ని సోమవారం సభలో ఆమోదించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. పంచాయతీరాజ్ సవరణ బిల్లు కూడా సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైనట్లు తెలిసింది.