Share News

Bathukamma: సద్దుల ఆటాపాటా బొంబాటు!

ABN , Publish Date - Oct 11 , 2024 | 04:26 AM

పరిమళాలు వెదజల్లే పువ్వులే పులకించిపోయాయి. పచ్చని చెట్ల నుంచి విడివడి.. ఒక్కచోట చేరి బతుకమ్మ రూపు సంతరించుకున్నందుకు.. సంప్రదాయ వస్త్రాల్లో ఆడపడుచుల ఆటాపాటకు..

Bathukamma: సద్దుల ఆటాపాటా బొంబాటు!

24.jpg

  • బతుకమ్మ సంబురాలతో ఊగిపోయిన పల్లె, పట్నం.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

  • ట్యాంక్‌బండ్‌పై టపాసులు, లేజర్‌ షో మధ్య ఉత్సవాలు

పరిమళాలు వెదజల్లే పువ్వులే పులకించిపోయాయి. పచ్చని చెట్ల నుంచి విడివడి.. ఒక్కచోట చేరి బతుకమ్మ రూపు సంతరించుకున్నందుకు.. సంప్రదాయ వస్త్రాల్లో ఆడపడుచుల ఆటాపాటకు.. వారి ప్రకృతి ఆరాధనా తత్వానికి! ఒక్కొక్క పువ్వేసి.. అంటూ నిమజ్జనం చేసి.. ఒడ్డున మూటలు విప్పి సద్దులు తింటుండగా.. నిండుగా కళకళలాడుతున్న చెరువుల్లో తేలియడుతూ బతుకమ్మ రూపులో ఉన్న గునుగు.. తంగేడు.. బంతులు, చేమంతులు, సీతమ్మ జడలు ఇలా తీరొక్క పూలన్నీ పుప్పొడి నగవులతో ఆడపడుచులను ఆశీర్వదించాయి.


రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఎక్కడ చూసినా భారీస్థాయిలో బతుకమ్మలు కొలువుతీరాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకలకు వివిద ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్‌, ప్రజా గాయని విమలక్క ఎమ్మెల్సీ కోదండరాం ఉత్సవాల్లో పాల్గొన్నారు. తొలుత పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మలు చేతబట్టుకొని. కళాకారుల ఆటాపాటలు, నృత్యాల మధ్య. సచివాలయం ఎదురుగా ఉన్న ఆమరవీరుల స్మారక కేంద్రం నుంచి ట్యాంక్‌బండ్‌కు ఊరేగింపుగా వచ్చారు. అనంతరం ట్యాంక్‌బండ్‌ పై ప్రత్యేక వేదిక వద్ద మంత్రి సీతక్క తదితరులు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.


ఈ సందర్భంగా ప్రదర్శించిన టపాసుల మోత మధ్య లేజర్‌ షోలు సందర్శకులను విశేషంగా ఆకర్షించాయి. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్‌ హనుమంతరావు, పర్యటక శాఖ డైరెక్టర్‌ ఇలాత్రిపాఠి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌హరికృష్ణలు బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఓరుగల్లులోని వేయిస్తంభాలగుడి, భద్రకాళి ఆలయం సహా ప్రధాన ఆలయాల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ ఆడారు. కాగా, ట్యాంక్‌బండ్‌ వద్ద జరిగిన వేడుకల్లో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడారు. మహిళల ఎదుగుదలకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘అమ్మాయిలను బతకనీయండి.. చదవనీయండి.. ఎదగనీయండి’’ అని వ్యాఖ్యానించారు. చిన్నతనం నుంచే పిల్లలకు మహిళలను గౌరవించడం నేర్పించాలని, ఆడవారి పట్ల గౌరవాన్ని పెంపొందించే సంస్కృతిని అంతా అలవర్చుకోవాలని కోరారు. కాగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని.. ఆడబిడ్డలకు రెండు బతుకమ్మ చీరలు ఇచ్చామని మాజీ మంత్రి, హరీశ్‌రావు సిద్దిపేటలో అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు రెండు బతుకమ్మ చీరలు, 500 ఇస్తామని హామీ ఇచ్చిందని.. అధికారంలోకి వచ్చాక పండుగకు చీరలు ఇవ్వలేదని విమర్శించారు.

- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌

Updated Date - Oct 11 , 2024 | 04:26 AM