Share News

Health: అక్షరం మసక

ABN , Publish Date - Nov 12 , 2024 | 03:53 AM

పాఠశాల విద్యార్థుల్లో కంటిచూపు సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తరగతి గదిలో బోర్డుపై ఉపాధ్యాయులు రాసే అక్షరాలు కనిపించడం వారికి కష్టతరంగా మారింది. వైద్య ఆరోగ్య శాఖ ఆఽధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Health: అక్షరం మసక

  • బోర్డుపై రాసినది కనిపించట్లేదు!

  • 4.26ు మంది విద్యార్థుల్లో సమస్య

  • హైదరాబాద్‌లో తీవ్రత అధికం

  • అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లోనే.. సెల్‌ఫోన్లే ప్రధాన కారణం: వైద్యులు

హైదరాబాద్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యార్థుల్లో కంటిచూపు సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తరగతి గదిలో బోర్డుపై ఉపాధ్యాయులు రాసే అక్షరాలు కనిపించడం వారికి కష్టతరంగా మారింది. వైద్య ఆరోగ్య శాఖ ఆఽధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 10 లక్షల మందికి పరీక్షలు చేయగా వారిలో 4.26 శాతం మందికి కంటిచూపు సమస్యలు ఉన్నట్లు, వారికి దూరంగా ఉన్నవి స్పష్టంగా కనిపించడం లేదని గుర్తించారు. ఈ ఏడాది జూన్‌ నుంచి కంటి పరీక్షలు నిర్వహిస్తుండగా మరో ఆరు లక్షల మందికి చేయాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఐదో తరగతి నుంచి ఇంటర్‌ సెకండియర్‌ వరకు విద్యార్థులకు ఈ పరీక్షలు చేస్తున్నారు. కంటిచూపు సమస్య అబ్బాయిల కంటే అమ్మాయిల్లో ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది.


రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 9 వరకు 10,21,727 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో అమ్మాయిలు 5.33 లక్షల మంది, అబ్బాయిలు 4.87 లక్షల మంది ఉన్నారు. అమ్మాయిల్లో 28,467 మందికి (2.78 శాతం), అబ్బాయిల్లో 15,134 మందికి (1.47 శాతం) కంటిచూపు సమస్యలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో పాటు కంటికి సంబంఽధించిన ఇతర సమస్యలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అందులోనూ అమ్మాయిలే ఎక్కువ. మొత్తం 2,597 మందిలో 1,441 మంది అమ్మాయిలు, 1,156 మంది అబ్బాయిలు ఉన్నారు. ఎక్కువగా 8-10వ తరగతి విద్యార్థుల్లో కంటిచూపు సమస్యలు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అదీ హైదరాబాద్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలిపాయి. భాగ్యనగరంలో 22,094 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయగా 2,195 మందిలో ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు. రంగారెడ్డిలో 66 వేల మందిలో 4,701 మందికి, మెదక్‌లో 52 వేల మందిలో 2,331 మందికి కంటిచూపు సమస్య ఉందని తేల్చారు.


  • కరోనా సమయంలో అత్యధికంగా...

కరోనా సమయంలో పిల్లలంతా ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరయ్యారు. స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టా్‌పల ద్వారా పాఠాలు విన్నారు. రోజూ ఏడెనిమిది గంటల పాటు వాటికి అతుక్కుపోయారు. దాంతో వారికి కంటిచూపు సమస్య తీవ్రత పెరిగింది. వైద్య ఆరోగ్య శాఖ 2021-22 మధ్య పైలట్‌ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించింది. అందులో 23 శాతం మంది పిల్లల్లో కంటిచూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 36 శాతం, రంగారెడ్డిలో 18, నాగర్‌ కర్నూల్‌లో 9 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడైంది.


  • సెల్‌ఫోన్‌, గాడ్జెట్స్‌తోనే సమస్య

    9.jpg

ప్రస్తుతం పిల్లలు ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్స్‌తోనే ఎక్కు వ సమయం గడుపుతున్నారు. దీంతో కంటిచూపు తగ్గుతోంది. గతం కంటే ఈ సమస్య ఇప్పుడు పెరిగింది. అబ్బాయిలు బయ ట ఆడుకోవడానికి వెళ్తారు. దాంతో సెల్‌ఫోన్‌ చూసే సమయం తగ్గుతుంది. ఆడపిల్లలు ఎక్కువసేపు ఇంట్లోనే ఉంటూ సెల్‌ఫోన్‌, గాడ్జెట్స్‌ చూస్తున్నారు. అందువల్ల వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. స్కూల్‌ ముగిసిన తర్వాత వీలైనంత వరకు పిల్లల్ని బయట ఆడుకోనివ్వాలి.

- డాక్టర్‌ రాజలింగం, ఆప్తమాలజీ హెచ్‌వోడీ, భువనగిరి ప్రభుత్వ వైద్య కళాశాల

Updated Date - Nov 12 , 2024 | 03:53 AM