ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana : నెలాఖరులో కొత్త పీసీసీ!

ABN, Publish Date - Aug 09 , 2024 | 04:24 AM

తెలంగాణ రాష్ట్ర నూతన ‘ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ)’ని పంద్రాగస్టు తర్వాత ప్రకటించనున్నారు. ఆ దిశగా కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తును ముమ్మరం చేసింది.

  • కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు.. టీపీసీసీ చీఫ్‌గా బీసీ లేదా లంబాడా?

  • మధుయాష్కీ, బలరాం పేర్ల పరిశీలన

  • ఎస్సీ వర్గం నుంచి రేసులో సంపత్‌

  • నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు?

  • ప్రచార కమిటీ చైర్మన్‌గా జగ్గారెడ్డి!

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర నూతన ‘ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ)’ని పంద్రాగస్టు తర్వాత ప్రకటించనున్నారు. ఆ దిశగా కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తును ముమ్మరం చేసింది. ఈ నెల చివరి వారంలో పీసీసీ అధ్యక్షుడు, నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్‌లతో నూతన టీపీసీసీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే మరికొన్ని కార్పొరేషన్లు, సంస్థలకూ చైర్మన్ల పేర్లను అధిష్ఠానం ఆమోదించనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీని విస్తరించే పనిలో ఉన్న అధిష్ఠానం.. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతేరాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నాయి.


టీపీసీసీ, ఏఐసీసీల్లో నియామకాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నాయి. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడే నూతన టీపీసీసీపై చర్చల కోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. కానీ, శాసనసభలో కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఉండడం, సమావేశాలు ముగియగానే సీఎం అమెరికా పర్యటన షడ్యూల్‌ ఖరారవడంతో ఢిల్లీ భేటీ వాయిదా పడింది. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ఈ సమావేశం జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 15 తర్వాత సీఎం, భట్టి, ఉత్తమ్‌ను ఢిల్లీకి పిలిపించుకుని తుది సంప్రదింపులు జరుపుతారని, చివరి వారంలో కొత్త టీపీసీసీని ప్రకటిస్తారని పేర్కొంటున్నాయి.


బీసీ లేదా లంబాడా!?

ఏ సామాజిక వర్గం నుంచి టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలన్నది ఖరారు చేశాక.. ఎవరిని నియమించాలన్న దానిపై అధిస్ఠానం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. బీసీ లేదా లంబాడాల నుంచి అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీల్లో గౌడ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీగౌడ్‌ పేర్లను పరిశీలించిన అధిష్ఠానం.. యాష్కీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే లంబాడాల నుంచి ఎంపీ బలరాంనాయక్‌ పేరును ప్రధానంగా పరిశీలిస్తోంది.


ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయాలనుకుంటే ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ పేరునే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని, పార్టీని జోడెద్దుల బండిలా నడపాలని అధిష్ఠానం భావిస్తే.. తెరపైకి కొత్త సమీకరణాలు వచ్చేందుకూ ఆస్కారం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షుల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గం, రెండోది మైనారిటీలకు కేటాయించనున్నట్లు చెబుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఏ సామాజిక వర్గం నుంచి టీపీసీసీ చీఫ్‌ను ఎంపిక చేస్తే ఆ సామాజిక వర్గానికి కార్యనిర్వాహక అధ్యక్షుడి పోస్టు ఉండదంటున్నారు. మిగిలిన రెండు వర్గాల వారికి ఆ పదవి దక్కనున్నట్లు చెబుతున్నారు.


జగ్గారెడ్డికి ప్రచార కమిటీ..!

రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించినప్పుడే మధుయాష్కీని ప్రచార కమిటీ చైర్మన్‌గా అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సంప్రదాయాన్నే కొనసాగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భారత్‌ జోడో యాత్రను సంగారెడ్డిలో విజయవంతం చేసిన జగ్గారెడ్డి.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ దృష్టిలో పడ్డారు. జగ్గారెడ్డి మంచి ఆర్గనైజర్‌ అంటూ అప్పట్లో రాహుల్‌ కితాబిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో స్వల్ప తేడాతో ఓటమిపాలైన జగ్గారెడ్డి.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి కాంగ్రెస్‌ అభ్యర్థికి తన నియోజకవర్గంలో మెజారిటీని తెచ్చి పెట్టారు.


ఏఐసీసీ విస్తరణ తర్వాతే మంత్రివర్గ విస్తరణ!?

ఏఐసీసీని విస్తరించిన తర్వాతే మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే ఆలోచనలో అదిష్ఠానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ, ఏఐసీసీల్లో తెలంగాణ నేతలకు ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఆరుగురుకి చోటు దక్కే అవకాశం ఉంది. ఉమ్మడి నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నుంచి వాకిటి శ్రీహరి పేర్లు దాదాపుగా ఖరారైన సంగతి తెలిసిందే. ఉమ్మడి నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూ నాయక్‌లు పోటీ పడుతున్నారు. టీపీసీసీ చీఫ్‌గా లంబాడాకు అవకాశం ఇస్తే.. బాలూ నాయక్‌ డిప్యూటీ స్పీకర్‌ పదవితో సర్దుకోవాల్సి ఉంటుంది. ఇక సీఎం ఢిల్లీ పర్యటనలో మరికొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు, ఇతర నామినేటెడ్‌ నియామకాలకు అధిష్ఠానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ తీసుకుంటారని చెబుతున్నారు.

Updated Date - Aug 09 , 2024 | 07:37 AM

Advertising
Advertising
<