Farmers: పండగలా మాఫీ..
ABN, Publish Date - Jul 18 , 2024 | 02:32 AM
రాష్ట్రంలోని ప్రతి రైతునూ రుణ విముక్తుడిని చేయాలన్న లక్ష్యంతో రూ.2లక్షల మేర రుణాలను ఒకేసారి మాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
నేటి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లోకి రూ.7,000 కోట్లు
ప్రతి రైతుకూ రుణ విముక్తి.. గ్రామాల్లో సంబరాలు చేయండి: సీఎం రేవంత్
తొలి విడతలో నేడు రూ.లక్ష దాకా మాఫీ
నెలాఖరులోగా రూ.లక్షన్నర.. ఆగస్టులో 2లక్షల వరకు రుణాలన్నింటినీ మాఫీ చేసి తీరుతాం
కేసీఆర్‌లా మేము మభ్య పెట్టడం లేదు
రైతు రుణమాఫీపై రాహుల్ మాట ఇచ్చారు
ఆ హామీ నిలబెట్టుకున్నామని గొప్పగా చాటండి
దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి
పార్లమెంట్ భేటీల్లో ఎంపీలూ ప్రస్తావించాలి
కాంగ్రెస్ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ నిర్దేశం
రేషన్ కార్డు లేనివారికీ మాఫీ వర్తింపు: భట్టి
హైదరాబాద్, జూలై 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి రైతునూ రుణ విముక్తుడిని చేయాలన్న లక్ష్యంతో రూ.2లక్షల మేర రుణాలను ఒకేసారి మాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, కేసీఆర్ లాగా మాటలు చెప్పి రైతులను తాము మభ్యపెట్టడం లేదన్నారు. లక్ష రూపాయల మేర రైతు రుణాలను గురువారం సాయంత్రం 4గంటలకల్లా మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. రైతుల ఖాతాల్లోకి రూ.7వేల కోట్లను నేరుగా జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా రూ.లక్షన్నర మేర రుణాలు, ఆగస్టులో రూ.2లక్షల మేరకు రుణాలను మాఫీ చేసి.. రైతు రుణ మాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తన జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని పేర్కొన్నారు.
గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిల్లో ఎక్కడికక్కడ పండగ వాతావరణంలో గురువారం సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రజాభవన్‌లో బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ నాయకులతో జరిగిన సమావేశంలో రుణమాఫీపై సంబరాల నిర్వహణకు సంబంధించి ఆయన దిశానిర్దేశం చేశారు. ‘‘పార్టీకి నష్టమని తెలిసీ.. ఆనాడు సోనియాగాంధీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం. రైతు రుణమాఫీ చేస్తామని 2022 మే 6న వరంగల్ సభలో రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆయన మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకాన్ని ప్రజలకు కలిగించడం మన బాధ్యత’’ అని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా రూ.31వేల కోట్లతో రుణ మాఫీ అమలు చేయలేదని, తెలంగాణలో జరుగతున్న ఈ కార్యక్రమంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీని అమలు చేశామని పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలని కాంగ్రెస్ ఎంపీలకు సూచించారు. గతంలో కేసీఆర్ పదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా రైతులకు సంబంధించిన రూ.28వేల కోట్ల రుణాలను మాఫీ చేయలేక పోయారన్నారు. కానీ.. ఆగస్టు 15లోగా రుణ మాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము హామీ ఇచ్చామని తెలిపారు. ఆర్థిక నిపుణులు సైతం ఇప్పటికిప్పుడు రుణ మాఫీ కష్టమని, ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారని గుర్తు చేశారు. కానీ, ఆ ఇబ్బందులను అధిగమించి రుణ మాఫీ హామీని నిలబెట్టుకున్నామంటూ సగర్వంగా ప్రజలకు చాటాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని వివరించాలని పార్టీ ముఖ్య నాయకులు, టీపీసీసీ కార్యవర్గానికి సూచించారు.
7 నెలల్లోనే రుణ మాఫీ చేస్తున్నాం: భట్టి
ఆగస్టు నెల దాటకుండానే రూ.2లక్షల మేర రుణ మాఫీని పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రుణ మాఫీని చేపట్టేందుకు నిద్ర లేని రాత్రులు గడిపామని, రూపాయి.. రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు. రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకూ రుణ మాఫీ వర్తింపజేస్తామన్నారు. ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మిగులు బడ్జెట్‌తో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్.. రూ.లక్ష మేర రుణమాఫీని నాలుగు వాయిదాల్లో పూర్తి చేసిందని గుర్తు చేశారు.
రూ.7లక్షల కోట్ల అప్పులు ఉండగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏడు నెలల వ్యవధిలోనే రూ. 2లక్షల మేర రైతుల రుణాలను మాఫీ చేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, అయితే అనుకున్నంతగా ఈ పథకాలపై ప్రచారం జరగట్లేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుందని వివరిస్తూ ప్రజల హృదయాలను గెలవాలని సూచించారు. కాగా, రుణాల మాఫీకి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ప్రజా భవన్‌లో బుధవారం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ తదితరులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
Updated Date - Jul 18 , 2024 | 06:54 AM