ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మహా మెట్రో..

ABN, Publish Date - Sep 30 , 2024 | 03:27 AM

హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలకూ మెట్రో సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకోసం రెండో దశలో సరికొత్త కారిడార్లను తీసుకొస్తోంది.

  • 116 కిలోమీటర్లు.. రూ.32 వేల కోట్లు!

  • మెట్రో రెండో దశ విస్తరణ డీపీఆర్‌లో లెక్క ఖరారు

  • నాగోల్‌-ఎయిర్‌పోర్టు అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు

  • చాంద్రాయణగుట్ట, న్యూహైకోర్టు మీదుగా కొత్త మార్గం

  • ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌సిటీ వరకు 40 కి.మీ కారిడార్‌

  • సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌ పేరిట మెట్రోస్టేషన్లు

  • పనులన్నీ రెండో దశలోనే పూర్తికి ప్రభుత్వం నిర్ణయం

  • నిర్మాణాల అనుమతి కోసం త్వరలో కేంద్రానికి డీపీఆర్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలకూ మెట్రో సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకోసం రెండో దశలో సరికొత్త కారిడార్లను తీసుకొస్తోంది. ప్రధానంగా శివారు ప్రాంతాల ప్రజలు నగరానికి సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తోంది. మొత్తంగా తొలుత నిర్ణయించిన 78.04 కిలోమీటర్లకు అదనంగా మరో 38.16 కిలోమీటర్లను పూర్తి చేయనుంది. దీంతో ఆరు కారిడార్లలో కలిపి మొత్తం 116.2 కిలోమీటర్లను రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మెట్రో రెండో దశ పనులకు సంబంధించిన లెక్క ఖరారు చేసింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫోర్త్‌సిటీకి కూడా మెట్రోను తీసుకెళ్లనున్నారు.


దీనిని ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌ సిటీవరకు 40 కిలోమీటర్ల కారిడార్‌గా రూ.8 వేల కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే నాగోల్‌-ఎయిర్‌పోర్టు అలైన్‌మెంట్‌కు సంబంధించి డీపీఆర్‌లో స్వల్పమార్పులు చేశారు. మొదట ప్రతిపాదించిన నాగోలు, ఎల్‌బీనగర్‌ వయా చాంద్రాయణగుట్ట క్రాస్‌ రోడ్డు- మైలార్‌దేవ్‌పల్లి-పీ7 రోడ్డు-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (29 కిలోమీటర్లు)కు బదులుగా.. నాగోలు నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి వరకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి ఆరాంఘర్‌, న్యూహైకోర్టు, శంషాబాద్‌ జంక్షన్‌ ద్వారా ఎయిర్‌పోర్టుకు కారిడార్‌ను నిర్మించేందుకు డీపీఆర్‌ను రూపొందించారు.


ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇటీవల పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా డీపీఆర్‌ అంశాలను తెలియజేసిన హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి.. ఆదివారం ఆ వివరాలను మీడియాకు విడుదల చేశారు. మెట్రో రెండో దశ కారిడార్ల అలైన్‌మెంట్‌, ముఖ్యమైన ఫీచర్లు, స్టేషన్లు, ట్రాఫిక్‌ అంచనాల విషయాన్ని సీఎం సమీక్షలో తెలియజేశామని, డీపీఆర్‌ తుదిదశ మెరుగులు దిద్దుతున్నామని చెప్పారు. హెచ్‌ఎండీఏ హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ఏరియాకు సిద్ధం చేస్తున్న కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ) ట్రాఫిక్‌ అధ్యయన నివేదిక కోసం తాము ఎదురుచూస్తున్నామన్నారు. మెట్రో మార్గాల్లో ట్రాఫిక్‌ అంచనాలను సీఎంపీతో క్రాస్‌ చెక్‌ చేయాల్సి ఉంటుందని, రెండో దశ మెట్రో కారిడార్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం డీపీఆర్‌లు సమర్పించే సమయంలో ఇది తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.


కారిడార్‌-4 (36.6 కిలోమీటర్లు)

నాగోలు- శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు

నాగోలు నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మొత్తం 36.6 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నారు. నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు మిగిలిన 5 కిలోమీటర్లను ఇందులోనే పూర్తిచేయనున్నారు. ఎల్‌బీనగర్‌ దాటిన తర్వాత కర్మన్‌ఘాట్‌, ఒవైసీ ఆస్పత్రి, డీఆర్‌డీవో, చాంద్రా యణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్‌, న్యూహైకోర్టు, శంషాబాద్‌ జంక్షన్‌ గుండా నేషనల్‌ హైవే (ఎన్‌హెచ్‌) మీదుగా ఈ మార్గం ఉంటుంది. కాగా, ఈ లైన్‌ను నాగోల్‌, ఎల్‌బీనగర్‌, చాంద్రాయణగుట్ట వద్ద ఉన్న అన్ని మెట్రోలైన్లకు అనుసంధానం చేస్తారు. మొత్తం 36.6 కిలోమీటర్ల పొడవు కలిగిన మార్గంలో 35 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ (ఆకాశమార్గం) ఉంటుంది. మిగిలిన 1.6 కిలోమీటర్ల మార్గం భూగర్భంలో రానుంది. శంషాబాద్‌ దాటిన తర్వాత భూగర్భస్టేషన్‌గా ఎయిర్‌పోర్టు స్టేషన్‌ వస్తుంది. మొత్తం ఈ మార్గంలో 24 మెట్రోస్టేషన్లు ఉంటాయి.


కారిడార్‌-5 (11.6 కిలోమీటర్లు)

రాయదుర్గ్‌-కోకాపేట నియోపోలిస్‌

మొదటి దశలోని కారిడార్‌-3 (నాగోలు-రాయదుర్గ్‌)కి అనుసంధానంగా దీనిని నిర్మిస్తున్నారు. రాయదుర్గ్‌ స్టేషన్‌ తర్వాత బయో డైవర్సిటీ జంక్షన్‌, ఖాజాగూడ రోడ్డు, నానక్‌రామ్‌గూడ జంక్షన్‌, విప్రో సర్కిల్‌, ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌ మీదుగా కోకాపేట నియోపోలీస్‌ వరకు నిర్మించనున్నారు. ఇది పూర్తిగా ఎలివేటెడ్‌ కారిడార్‌లో ఉంటుంది. ఇందులో దాదాపు 8 స్టేషన్లు ఉంటాయి.


కారిడార్‌-6 (7.5 కిలోమీటర్లు)

ఎంజీబీఎ్‌స-చాంద్రాయణగుట్ట

జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు ఇప్పటికే ఉన్న కారిడార్‌-2కు పొడిగింపుగా దీనిని నిర్మించనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మొత్తం 7.5 కిలోమీటర్ల లైన్‌ ఉంటుంది. ఇది పాతబస్తీలోని మండిరోడ్‌ మీదుగా దారుల్‌షిఫా జంక్షన్‌, శాలిబండ జంక్షన్‌, ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు వెళ్తుంది. ఈ కారిడార్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌ మెట్రో మార్గానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని వాటి పేర్లపైనే స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం దారుల్‌షిఫా జంక్షన్‌ నుంచి శాలిబండ జంక్షన్‌ మధ్య ఉన్న 60 అడుగుల రోడ్డును, శాలిబండ జంక్షన్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న 80 అడుగుల రోడ్డును ఏకరీతిగా 100 అడుగులకు విస్తరించనున్నారు. స్టేషన్‌ ఉండే ప్రాంతాల్లో మాత్రం రోడ్డును 120 అడుగులకు విస్తరించనున్నారు. కాగా, రోడ్డు విస్తరణ, మెట్రో అలైన్‌మెంట్‌కు సంబంధించి దాదాపు 1100 ఆస్తులను సేకరించనున్నారు. ఇందులో 400 ఆస్తులకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశారు. మిగిలిన ఆస్తులు పురోగతిలో ఉన్నాయని, ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలున్నాయని అధికారులు తెలిపారు. వాటికి తగిన ఇంజినీరింగ్‌ పరిష్కారాలు, మెట్రో పిల్లర్‌ స్థానాల సర్దుబాటు ద్వారా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మార్గంలో దాదాపు 6 స్టేషన్లు వస్తాయని, పూర్తిగా ఎలివేటెడ్‌గా నిర్మిస్తామని చెప్పారు.


కారిడార్‌-7: (13.4 కిలోమీటర్లు)

మియాపూర్‌-పటాన్‌చెరు

ముంబయి జాతీయ రహదారిపై కారిడార్‌-1 (ఎల్‌బీనగర్‌-మియాపూర్‌)కు అనుసంధానంగా మియాపూర్‌-పటాన్‌చెరు మార్గాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ నుంచి పనులను ప్రారంభించి పటాన్‌చెరు వరకు 13.4 కిలోమీటర్ల మార్గాన్ని చేపట్టనున్నారు. ఈ లైన్‌ ఆల్విన్‌ క్రాస్‌రోడ్డు, మదీనాగూడ, చందానగర్‌, బీహెచ్‌ఈఎల్‌, ఇక్రిశాట్‌ మీదుగా వెళుతుంది. దీనిని పూర్తిగా ఎలివేటెడ్‌ గా నిర్మించనున్నారు. ఇందులో దాదాపు 10 స్టేషన్లు రానున్నాయి.


కారిడార్‌-8: (7.1 కిలోమీటర్లు)

ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌

విజయవాడ హైవేపై కారిడార్‌-1 మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ లైన్‌కు అనుసంధానంగా దీనిని నిర్మించనున్నారు. ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మొత్తం 7.1 కిలోమీటర్ల కారిడార్‌ ఉంటుంది. ఇది చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్‌, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళుతుంది. దీనిని పూర్తి ఎలివేటెడ్‌ కారిడార్‌గా చేపట్టనున్నారు. దాదాపు 6 స్టేషన్లు రానున్నాయి.


కారిడార్‌ -9 : 40 కిలోమీటర్లు

ఎయిర్‌పోర్టు-ఫోర్త్‌సిటీ (స్కిల్‌ యూనివర్సిటీ)

సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన ఫోర్త్‌సిటీ మెట్రో కనెక్టివిటీని కూడా రెండో దశలోనే చేపట్టనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌సిటీ వరకు 40 కిలోమీటర్ల కారిడార్‌ను ప్రతిపాదించారు. ఎయిర్‌పోర్టు నుంచి శ్రీశైలం హైవే మీదుగా తుక్కుగూడ ఓఆర్‌ఆర్‌, ఆదిభట్ల, కొంగరకలాన్‌ వద్ద డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ చేపట్టి.. ఫోర్త్‌సిటీకి మెట్రోను తీసుకెళ్లనున్నారు. ఎయిర్‌పోర్టు-ఫోర్త్‌సిటీ మార్గానికి సంబంధించి పెద్దగా భూసేకరణ సమస్యలు ఉండవని భావిస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు ఉండడమే ఇందుకు కారణం. ఈ మార్గంలో 6 నుంచి 8 స్టేషన్లు వచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ డీపీఆర్‌ను ఆకర్షణీయమైన ఫీచర్లతో వినూత్న రీతిలో తయారు చేస్తున్నారు.


  • కేంద్రం అనుమతి కోసం డీపీఆర్‌..

రెండో దశలో తొలుత ప్రతిపాదించిన 5 కారిడార్లతోపాటు ఫోర్త్‌సిటీ కారిడార్‌ను కూడా ఇందులోనే పూర్తి చేయనున్నారు. అయితే ఇప్పటికే పూర్తిచేసిన 5 కారిడార్ల డీపీఆర్‌ను త్వరలో కేంద్రానికి సమర్పించనున్నారు. అనుమతి వచ్చిన వెంటనే ఆయా పనులను ప్రారంభించనున్నారు. అయితే ఫోర్త్‌సిటీ డీపీఆర్‌ తయారు చేయడంలో కాస్త ఆలస్యం జరుగుతుందని, ఈ పనులకు సంబంధించిన బడ్టెట్‌ను మాత్రం రెండో దశలోనే పొందుపరుస్తున్నామని అధికారులు తెలిపారు. ఫోర్త్‌సిటీ మెట్రో కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన సుమారు రూ.8 వేల కోట్లతో కలిపి మొత్తం రెండో దశ ప్రాజెక్ట్‌కు వ్యయం రూ.32,237 కోట్లు (రూ.24,237 కోట్లు+రూ.8,000 కోట్లు)గా అంచనా వేశామన్నారు. దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న ఇతర మెట్రోరైలు ప్రాజెక్టుల మాదిరిగానే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జాయింట్‌ వెంచర్‌గా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదించినట్లు చెప్పారు.


  • భూసేకరణ ఇబ్బందుల్లేకుండా ఉండేందుకే..!

నాగోల్‌-ఎయిర్‌పోర్టు అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని నిర్ణయించడానికి కారణం భూసేకరణ అంశమేనని తెలుస్తోంది. మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా తొలుత నాగోలు-ఎల్‌బీనగర్‌-చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు- మైలార్‌దేవ్‌పల్లి-పీ7 రోడ్డు- శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు (31 కిలోమీటర్లు) ప్రతిపాదించారు. దీంతోపాటు మైలార్‌దేవ్‌పల్లి-ఆరాంఘర్‌- న్యూ హైకోర్టు (రాజేంద్రనగర్‌) వరకు ప్రతిపాదించిన 4 కిలోమీటర్ల కారిడార్‌కు అదనంగా హైకోర్టు నుంచి మరో 17 కిలోమీటర్లను పొడిగించి ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను తీసుకెళ్లాలని భావించారు. దీంతో.. ఇటు నాగోలు నుంచి, అటు రాజేంద్రనగర్‌లోని న్యూహైకోర్టు నుంచి రెండు మార్గాల ద్వారా ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారికి సౌకర్యంగా ఉంటుందని, రోడ్లపై వేలాది వాహనాల ఒత్తిడి తగ్గడంతోపాటు ఎయిర్‌పోర్టులో కార్ల పార్కింగ్‌ సమస్య నుంచి ఉపశమనం పొందుతారని అనుకున్నారు.


అయితే మొదటగా ప్రతిపాదించిన కారిడార్‌కు సంబంధించి పీ7రోడ్డు నుంచి ఎయిర్‌పోర్టుకు భూసేకరణకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని, ఇక్కడ ప్రైవేట్‌ భూములు అధికంగా ఉండడంతో పరిహారం చెల్లింపు పెద్ద మొత్తంలో ఉంటుందని వచ్చిన సూచనల నేపథ్యంలో ఈ మార్గంలో మార్పులు చేసినట్లు సమాచారం. కొత్తగా ఖరారుచేసిన రూట్‌లో హైకోర్టు నుంచి శంషాబాద్‌ వరకు సగానికి పైగా ప్రభుత్వ భూములున్నాయని, ఇక్కడి నుంచి ఎయిర్‌పోర్టు కారిడార్‌ను చేపట్టడం సులువుగా జరుగుతుందని అధికారులు ప్రభుత్వానికి తెలియజేసిన నేపథ్యంలో డీపీఆర్‌లో సవరణలు చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - Sep 30 , 2024 | 05:38 AM