Road Development: రీజినల్ రింగ్ రోడ్డుపై దృష్టి!
ABN, Publish Date - Dec 06 , 2024 | 04:52 AM
రోడ్లు, భవనాల శాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మండల, జిల్లా కేం ద్రాల నుంచి రాజధాని హైదరాబాద్‌కు రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడంతోపాటు రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నట్లు తెలిపింది.
త్వరగా అందుబాటులోకి తెచ్చేలా కృషి .. చారిత్రక కట్టడాలను పునరుద్ధరిస్తున్నాం
ఆర్ అండ్ బీ ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వ నివేదిక
హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రోడ్లు, భవనాల శాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మండల, జిల్లా కేం ద్రాల నుంచి రాజధాని హైదరాబాద్‌కు రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడంతోపాటు రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం 2024-25 బడ్జెట్‌లో ఆర్‌అండ్ బీ శాఖకు రూ.7,490కోట్లను కేటాయించగా.. ఇందులో ఔటర్ రింగు రోడ్డుకు రూ.200 కోట్లు, ఆర్‌ఆర్‌ఆర్ భూ పరిహారం వాటా కోసం రూ.1,500కోట్లను కేటాయించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం పేర్కొంది. ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన ఏడాది ప్రగతి నివేదికను విడుదల చేసింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
‘‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమైంది. ఫలితంగా రీజినల్ రింగు రోడ్డు సహా వివిధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం ఏర్పడింది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలుమార్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఫలితంగా హైదరాబాద్- విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారిపై గుర్తించిన 17 బ్లాక్ స్పాట్ల మరమ్మతులకు రూ.422.12 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. జాతీయ రహదారి(ఎన్‌హెచ్)-353సీ లో సిరొంచ-ఆత్మకూర్ భాగానికి రూ.662.67 కోట్లు, నల్లగొండ పట్టణం వెలుపల ఎన్‌హెచ్.- 565 పై నకిరేకల్ - నాగార్జునసాగర్ వరకు నిర్మిస్తున్న 14 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.516.17 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులను పట్టాలెక్కించడంతోపాటు దక్షిణ భాగం డీపీఆర్ రూపొందించేందుకు టెండర్లు పిలిచాం. త్వరలోనే దీని నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకం కింద రూ.850 కోట్ల విలువైన 435.29 కి.మీ పొడవైన 31 పనులను మంజూరు చేయించుకోవడంలో సఫలమయ్యాం’’ అని ప్రభుత్వం పేర్కొంది.
అలాగే, రహదారుల నిర్మాణానికి ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కింద రూ.3,725.22 కోట్ల మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు నివేదికలో వెల్లడించింది. ఈ నిధులతో కొత్తగా 769.35 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు పేర్కొంది. అలాగే, హెరిటేజ్ భవనాల మరమ్మతులు, నూతన భవనాలను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్ అండ్ బీ ప్రయత్నిస్తోందని తెలిపింది. ఇందులో భాగంగా శాసనసభ ప్రాంగణంలోని చారిత్రక మహబూబియా హాల్‌ను శాసనమండలిగా మార్చేందుకు రూ.49 కోట్ల తో పునరుద్ధరణ పనులు ఆగాఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాగుతున్నట్లు వెల్లడించింది. రాజ్‌భవన్ ప్రాంగణంలోని మరో చారిత్రక కట్టడం షామంజిల్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లా కేంద్రాల్లో కోర్టు కాంప్లెక్సుల నిర్మాణానికి రూ.1,053 కోట్లు కేటాయించగా.. రూ.972 కోట్ల పనులకు అనుమతులను మంజూరు చేసినట్లు వివరించింది. నల్లగొండ, కోదాడ నియోజకవర్గాల్లో రూ.20 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ భవనాలు, కొడంగల్, మంథని, కోదాడ, హుజూర్‌నగర్‌లో రూ.27.30 కోట్లతో ఆర్ అండ్ బీ అతిథి గృహాలను నిర్మిస్తున్నట్లు తెలిపింది. వరంగల్‌లో మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి 253 ఎకరాల సేకరణకు రూ.205 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
Updated Date - Dec 06 , 2024 | 04:52 AM