High Court: ఫోన్‌ట్యాపింగ్ దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు
ABN, Publish Date - Dec 07 , 2024 | 04:26 AM
ఫోన్‌ట్యాపింగ్ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దశలో ఏ-2గా ఉన్న దుగ్యాల ప్రణీత్‌కుమార్ అలియాస్ ప్రణీత్‌రావుకు బెయిల్ ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది.
పరారీలోనే ప్రధాన నిందితుడు
ఈ దశలో ప్రణీత్‌రావుకు బెయిల్ ఇవ్వొద్దు
హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు
హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ట్యాపింగ్ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దశలో ఏ-2గా ఉన్న దుగ్యాల ప్రణీత్‌కుమార్ అలియాస్ ప్రణీత్‌రావుకు బెయిల్ ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రణీత్‌రావు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తూ ఈ విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రణీత్‌రావు తరఫున న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు వాదిస్తూ.. దర్యాప్తు పూర్తయిందంటూపోలీసులు దిగువ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారని, ఇప్పుడేమో పూర్తికాలేదని అంటున్నారని తెలిపారు. ఒక్కసారి ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత దర్యాప్తు అధికారి దానికి కట్టుబడి ఉండాలని చెప్పారు.
పోలీసులు ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు. హోంశాఖ తరఫు న్యాయవాది మహేశ్‌రాజే వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు, ఆరో నిందితుడు శ్రవణ్‌రావు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి పాత్ర ఏంటో ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందని తెలిపారు. పట్టుబడిన నిందితుల పాత్ర వరకు ఛార్జిషీట్ దాఖలు చేశామని పేర్కొన్నారు. అందువల్ల దర్యాప్తు ముగియలేదని, ఈ కారణంగా బెయిల్ ఇవ్వకూడదని తెలిపారు. బెయుల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 23కు ధర్మాసనం వాయిదా వేసింది. మరోవైపు ఇదే కేసులో ఏ-5గా రాధాకిషన్‌రావు బెయిల్ పిటిషన్‌లో వాదనలు ముగియడంతో జస్టిస్ సుజన ధర్మాసనం తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.
Updated Date - Dec 07 , 2024 | 04:26 AM