Damodar Raja Narasimha: సర్కారీ వైద్య సిబ్బందికి భద్రత కల్పిస్తాం
ABN, Publish Date - Aug 20 , 2024 | 03:55 AM
సర్కారీ దవాఖానాల్లో పనిచేస్తున్న వైౖద్యులు, నర్సింగ్ సిబ్బందికి అవసరమైన భద్రత కల్పిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జూనియర్ డాక్టర్లకు తెలిపారు.
జూడాలతో మంత్రి దామోదర
మంకీపాక్స్‌పై భయపడనక్కర్లేదు
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నివారణ మందులు అందుబాటులో ఉంచాలి
ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సర్కారీ దవాఖానాల్లో పనిచేస్తున్న వైౖద్యులు, నర్సింగ్ సిబ్బందికి అవసరమైన భద్రత కల్పిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జూనియర్ డాక్టర్లకు తెలిపారు. సోమవారం తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర సచివాలయంలో మంత్రిని కలిశారు. కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో మహిళా డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఆస్పత్రి సిబ్బందికి అవసరమైన భద్రత చర్యలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
బోధన ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి రక్షణగా ఏర్పాట్లు చేయాలని విన్నవించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఎస్పీఎ్‌ఫతో భద్రత కల్పించాలని, ఆస్పత్రుల్లో సీసీటీవీ, శిక్షణ కలిగిన సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని మంత్రిని కోరారు. ఆస్పత్రుల్లో నియమించే కమిటీల్లో జూనియర్ డాక్టర్లను సభ్యులుగా చేర్చాలన్నారు. జూడాల వినతులపై మంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రికి వినతి పత్రం ఇచ్చిన వారిలో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము రాహుల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.ఇసాక్ న్యూటన్, మహిళా డాక్టర్లు ఉన్నారు.
మరోవైపు మంకీ పాక్స్‌పై మంత్రి దామోదర సోమవారం ఉన్నతాఽధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయని, రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని అధికారులు మంత్రికి తెలిపారు. రాష్ట్రంలో మంకీపాక్స్ నివారణ చర్యలకు అవసరమైన మెడికల్ కిట్స్, మందులు, ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంకీ పాక్స్ నివారణకు వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంకీపాక్స్ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరంలేదన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచేలా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంకీపాక్స్ వైరస్ నివారణ మందులు, అవసరమైన కిట్స్ అందుబాటులో ఉంచాలన్నారు.
15 రోజులకు సిబ్బంది హాజరుపై నివేదిక
ప్రజారోగ్యశాఖ, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) శాఖలపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వీటి పరిధిలోని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు సెక్యూరిటీ, శానిటేషన్, డైట్, లాండ్రీ సేవలు అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆస్పత్రుల భవనాల స్థితిగతులు, ఆస్పత్రి సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించడానికి టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఆస్పత్రులను సందర్శించి ప్రతి 15 రోజులకోసారి నివేదికను సమర్పించాలన్నారు. ఆస్పత్రుల్లో సిబ్బంది వేతనాలు ప్రతినెల చెల్లించేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Updated Date - Aug 20 , 2024 | 03:55 AM