Telangana : కృష్ణమ్మ పరుగులు
ABN, Publish Date - Jul 22 , 2024 | 05:16 AM
సీజన్ మొదలై నెలన్నర దాటినా.. మొన్నటివరకు వానలు పెద్దగా లేనే లేవు..! ఈ ఏడాది వర్షాభావం తప్పదా? అన్న ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో వరుణుడు కరుణిస్తున్నాడు..! తెలంగాణలోనే కాక.. ఎగువ రాష్ట్రాల్లోనూ వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో కృష్ణమ్మ బిరబిరా తరలివస్తోంది.
ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా రాక
జూరాల 27 గేట్ల ఎత్తివేత.. శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులు!
గోదావరి ఉధృతి.. మేడిగడ్డకు 5.52 లక్షల క్యూసెక్కులు..!
భద్రాచలంలో నీటిమట్టం 45 అడుగులకు..
నేడు రెండో ప్రమాద హెచ్చరిక జారీ?
రాష్ట్రంలో కొనసాగుతున్న ముసురు.. పెరిగిన చలి తీవ్రత
నిజామాబాద్ జిల్లా వేల్పులలో 18 సెంటీమీటర్ల వర్షం
భద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లాల్లో వరదలో ఇద్దరు గల్లంతు
మరో మూడు రోజులూ వర్షాలు.. 9 జిల్లాలకు అలర్ట్
(అంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
సీజన్ మొదలై నెలన్నర దాటినా.. మొన్నటివరకు వానలు పెద్దగా లేనే లేవు..! ఈ ఏడాది వర్షాభావం తప్పదా? అన్న ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో వరుణుడు కరుణిస్తున్నాడు..! తెలంగాణలోనే కాక.. ఎగువ రాష్ట్రాల్లోనూ వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో కృష్ణమ్మ బిరబిరా తరలివస్తోంది. గోదావరి ఉధృత రూపం దాలుస్తోంది. ప్రాజెక్టులు జల కళ సంతరించుకుంటున్నాయి. మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడం, వరద కొనసాగనుండడంతో పంటల సాగుపై ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ఉన్న తొలి ప్రాజెక్టు అయిన జూరాలలో ఆదివారం 27 గేట్లను ఎత్తారు. 1.29 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1.34 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు పెడుతోంది. 95,786 క్యూసెక్కులు శ్రీశైలానికి చేరుతోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, ఆల్మట్టి జలాశయానికి 1,35,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1,50,000 క్యూసెక్కులను, నారాయణపూర్‌కు 1.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 25 గేట్లను ఎత్తి 1.45 లక్షల క్యూసెక్కులను జూరాలకు వదులుతున్నారు. కృష్ణా ఉప నది తుంగభద్రకూ వరద కొనసాగుతోంది.
1.19 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మరోవైపు గోదావరి, ప్రాణహిత, మంజీరా ఉప్పొంగడం, ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి 9.50 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి ఆదివారం సాయంత్రానికి వరద 5.52 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. 85 గేట్లను ఎత్తి, వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు పంపిస్తున్నారు.
అన్నారం బ్యారేజీకి 16,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఈ రెండింటికీ తోడు ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి ఇన్‌ఫ్లో వస్తుండటంతో సమ్మక్క బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. 8.23 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మహారాష్ట్రలో పడుతున్న వర్షాలతో గోదావరి, మంజీరా, హరిదా నదుల ద్వారా ఎస్సారెస్పీలోకి 18,518 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లోకి స్వల్పంగా వరద వస్తోంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా 690 అడుగులు దాటింది. 25,968 క్యూసెక్కుల వరద వస్తోంది. 4 గేట్లను ఎత్తి 18,277 క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి హోరు
మహారాష్ట్రలో భారీ వర్షాలతో ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఛత్తీ్‌సగఢ్ నుంచి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరి 45.1 అడుగులను చేరింది ఆదివారం మధ్యాహ్నం తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద మరింతగా పెరిగితే సోమవారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ముందుజాగ్రత్తగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని రప్పించారు. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. వర్షాల కారణంగా మరో 25,069 క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లిలోకి వస్తోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 148 మీటర్లకు 142 మీటర్లకు చేరుకుంది. నల్లగొండ జిల్లా కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు వరద తాకిడి కొనసాగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 639 అడుగులు (3.15టీఎంసీలు)గా ఉంది.
నిజామాబాద్ అంతటా 5 సెం.మీ.పైనే
రాష్ట్రాన్ని ఆదివారం కూడా ముసురు వీడలేదు. రోజంతా వర్షం పడుతూనే ఉంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చిరు జల్లులకు తోడు గాలులతో చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్‌లో 22.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5.5 డిగ్రీలు పడిపోయాయి. హుస్సేన్‌సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (513.41 మీటర్లు) సమీపానికి నీరు చేరడంతో తూమును తెరిచారు. వర్షాలతో జిల్లాల్లోని చెరువులు, కుంటలు, బావుల్లోకి దండిగా నీరు చేరుతోంది. చిన్న చెరువులు మత్తడి వరకు వచ్చాయి.
వరంగల్ భద్రకాళి చెరువు అలుగు పారుతోంది. కాగా, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లిలో అత్యధికంగా 18.55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో 5 సెంటీమీటర్లపైనే వర్షం పడింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 10.15, ఇంద్రవెల్లిలో 8.80, జైనథ్, బేలలో 7 సెం.మీలుపైగా వాన పడింది. మూడు రోజుల పాటు కుంటాల, పొచ్చెర జలపాతాలకు పర్యాటకులకు అనుమతిని నిలిపివేశారు.
కాగా, వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంలో 24 గంటల హెల్ప్‌డె్‌స్కను ఏర్పాటు చేశారు. ములుగు మండలంలో 11.43 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం, వాజేడు, మంగపేట, ములుగు, కన్నాయిగూడెం మండలా ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నారు. ఛత్తీ్‌సగఢ్ సరిహద్దులో టేకులగూడెం వద్ద రేగుమాగు వాగు జాతీయ రహదారిని ముంచెత్తింది. భూపాలపల్లి జిల్లాలో పలుచోట్ల వాగులు ఉప్పొంగడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది.
కరీంనగర్ జిల్లాలో 24 గంటల్లో 5.25 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. 15 మండలాల్లో 4 సెం.మీకు పైగానే వర్షం కురిసింది. అత్యధికంగా గంగాధర, హుజూరాబాద్ మండలాల్లో 7.86 సెం.మీ. వాన పడింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కుమరం భీం, వట్టివాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి చేలల్లో నీళ్లు నిలిచాయి.
ఏపీలో 50శాతం అధిక వర్షపాతం
ఏపీవ్యాప్తంగా 50 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్ నుంచి 199.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 299.1 మి.మీ. వర్షం కురిసింది. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా జాతీయ రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. పెదవాగ్టుకు గండితో వేలేరుపాడు మండలంలోని 13 గ్రామాల ప్రజలు నష్టపోమారు.
వచ్చే మూడు రోజులూ వానలే..
తెలంగాణలో వచ్చే మూడు రోజులూ వర్షాలు కురుస్తాయని, 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చిలుకా సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం అల్ప పీడనంగా బలహీనపడిందని పేర్కొంది. మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురంభీం, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వరదలో ఇద్దరు గల్లంతు
భద్రాద్రి జిల్లా పినపాక మండలం పోట్లపల్లి వద్ద చెక్‌డ్యాంలో చేపల వేటకు వెళ్లిన పాయం నగేశ్ గల్లంతయ్యాడు. స్నేహితుడు బడే నాగరాజుతో కలిసి వెళ్లిన ఇతడు.. చేపలు పడుతుండగా ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఇద్దరూ వాగులో కొట్టుకుపోయారు. నాగరాజు అతికష్టమ్మీద ఒడ్డుకు చేరాడు. నగేశ్ ఆచూకీ దొరకలేదు. ఎన్డీఆర్‌ఎ్‌ఫతో గాలింపు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం బొప్పరికుంటకు చెందిన టేకం లక్ష్మణ్ గంగాపూర్ వాగులో గల్లంతయ్యాడు. వాగు ఉధృతంగా పారుతుండడంతో లక్ష్మణ్ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు.
Updated Date - Jul 22 , 2024 | 05:16 AM