Share News

Mahesh Kumar Goud: పునర్వికాసం వైపు తెలంగాణ పయనం

ABN , Publish Date - Dec 10 , 2024 | 04:57 AM

కాంగ్రెస్‌ సర్కారు పాలనలో తెలంగాణ పునర్వికాసం వైపు పయనిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదాలతో రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలోకి నడిపిస్తామన్నారు.

Mahesh Kumar Goud: పునర్వికాసం వైపు తెలంగాణ పయనం

  • విపక్షాల కుట్రలను ఛేదించి దిగ్విజయంగా ఏడాది పాలన: మహేశ్‌ గౌడ్‌

  • గాంధీభవన్‌లో సోనియా జన్మదిన వేడుకలు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సర్కారు పాలనలో తెలంగాణ పునర్వికాసం వైపు పయనిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదాలతో రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలోకి నడిపిస్తామన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్‌ నేత వి.హన్మంతరావు ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్‌ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు.


ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతల కుట్రలను తిప్పి కొడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకుందన్నారు. ‘డిసెంబర్‌ 9న రాష్ట్రంలో రెండు పండుగలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాల పండుగ అవుతుంటే.. మరోవైపు తెలంగాణ ఇచ్చిన సోనియా జన్మదిన ఉత్సవాలు జరుగుతున్నాయి’ అని అన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్‌ కూడా ఎన్నో సార్లు చెప్పారని గుర్తు చేశారు. సోనియా జన్మదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీలు కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతోందని చెప్పారు. ఎంపీ చామల మాట్లాడుతూ.. తెలంగాణలో ఏడాది కాంగ్రెస్‌ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.

Updated Date - Dec 10 , 2024 | 04:57 AM