Share News

Nagarjuna Sagar: సాగర్‌ నీటి విడుదలకు మా సమ్మతి అక్కర్లేదా?

ABN , Publish Date - Jul 27 , 2024 | 05:02 AM

తమను సంప్రదించకుండానే నాగార్జున సాగర్‌ కుడికాలువ నుంచి 3 టీఎంసీల నీటి విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.

Nagarjuna Sagar: సాగర్‌ నీటి విడుదలకు మా సమ్మతి అక్కర్లేదా?

  • కృష్ణాబోర్డు చైర్మన్‌ ఏకపక్ష నిర్ణయంపై రాష్ట్ర అధికారుల విస్మయం

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): తమను సంప్రదించకుండానే నాగార్జున సాగర్‌ కుడికాలువ నుంచి 3 టీఎంసీల నీటి విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చే అధికారం చైౖర్మన్‌కు ఎక్కడిదంటూ ఆక్షేపించారు. ప్రధానంగా నీటి విడుదలపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా త్రిసభ్య కమిటీకే అధికారం ఉంటుంది. ఈ కమిటీలో కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి కన్వీనర్‌గా.. తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు సభ్యులుగా ఉంటారు.


ఈ కమిటీలో ఏ ఒక్కరు సమ్మతి తెలపకపోయినా.. నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేయడానికి వీల్లేదు. ఏకాభిప్రాయం కుదరకపోతే కృష్ణాబోర్డు సమావేశంలో చర్చించాలి. అయినా అంగీకారం కుదరకపోతే కేంద్ర జలశక్తిశాఖ మంత్రి నేతృత్వంలోని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుండే అపెక్స్‌ కౌన్సిల్‌లోతేల్చుకోవాలి. అవన్నీ పట్టించుకోకుండా ఉత్తర్వులిచ్చిన బోర్డు చైర్మన్‌ను నిలదీయాలని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 05:02 AM