Sridhar Babu: ఏరోస్పేస్ కంపెనీలకు అత్యుత్తమ గమ్యస్థానం తెలంగాణ!
ABN, Publish Date - Oct 10 , 2024 | 03:17 AM
ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానమని ఫ్రెంచ్ ఏరోస్పేస్ పరిశ్రమల సంఘం ప్రశంసించింది. ఇప్పటికే ఇక్కడ ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టి విజయవంతంగా కొనసాగుతున్నాయని గుర్తుచేసింది.
ఫ్రెంచ్ ఏరోస్పేస్ పరిశ్రమల సంఘం ప్రశంసలు
ఐటీ మంత్రితో 90 మంది ప్రతినిధుల భేటీ
తెలంగాణ గడ్డ.. ఏరోస్పేస్ కంపెనీలకు అడ్డా..
పెట్టుబడులు పెట్టండి: శ్రీధర్‌బాబు
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానమని ఫ్రెంచ్ ఏరోస్పేస్ పరిశ్రమల సంఘం ప్రశంసించింది. ఇప్పటికే ఇక్కడ ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టి విజయవంతంగా కొనసాగుతున్నాయని గుర్తుచేసింది. సంఘం నేతృత్వంలో ఫ్రాన్స్ ఏరోస్పేస్ కంపెనీలకు చెందిన 90 మంది ప్రతినిధుల బృందం బుధవారం నగరంలో పర్యటించింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న కంపెనీలతో పాటు పెట్టుబడులకున్న అవకాశాలను పరిశీలించింది. అనంతరం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సమావేశమైంది.
హైదరాబాద్‌లోని ఫ్రాన్స్ డిప్యూటీ కాన్సుల్ పాస్కల్ లోరియో అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సఫ్రాన్, ఎయిర్‌బస్, బోయింగ్, లోఖీడ్ మార్టిన్, జీఈ ఏవియేషన్, రేథియాన్ లాంటి ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్ కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. నగరంలో ఫ్రెంచ్ కంపెనీలతో ఎప్పటినుంచో వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్రెంచ్ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ ఏడీపీ వాటాదారుగా ఉందని గుర్తుచేశారు. మేకిన్ ఇండియా పథకంలో భాగంగా సి-295 ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కోసం టాటా భాగస్వామ్యంతో ఎయిర్‌బస్ హైదరాబాద్‌లో కీలకమైన భాగాలు, సబ్‌సిస్టమ్‌లు తయారు చేస్తోందని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ధ్రువ స్పేస్, స్కైరూట్ వంటి అంతరిక్ష స్టార్ట్‌పలు ఇప్పటికే ఫ్రెంచ్ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాయని మంత్రి వివరించారు.
ఏరోస్పేస్ రంగంలో తెలంగాణలో ఉన్న అనుకూలతలకు గాను కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి నాలుగుసార్లు అత్యుత్తమ పురస్కారం దక్కిందని మంత్రి తెలిపారు. పాస్కల్ లోరియో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో ఫ్రెంచ్ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టాయన్నారు. ఏరోస్పేస్ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ప్రశంసించారు. ఇండియన్ టెర్రెయిన్ ఫ్యాషన్స్ సంస్థ తెలంగాణలో దుస్తుల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ సంస్థ యాజమాన్యాన్ని కోరారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో 80 వేల మంది రైతుల నుంచి సేకరించిన సేంద్రియ పత్తితో ఆ సంస్థ ఏటా 4 కోట్ల మీటర్ల వస్త్రాలను తయారు చేస్తోందని ఆయన వెల్లడించారు. బంజారాహిల్స్‌లో కంపెనీ నెలకొల్పిన షోరూంను మంత్రి శ్రీధర్‌బాబు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు.
Updated Date - Oct 10 , 2024 | 03:17 AM