State Assembly: తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష..
ABN, Publish Date - Jul 25 , 2024 | 03:10 AM
భారత దేశం అన్ని రాష్ట్రాల సమాఖ్య అని, రాష్ట్రాల సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని విస్మరించిందని, బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష చూపిందని తెలిపింది.
సమాఖ్య స్ఫూర్తిని విస్మరించిన మోదీ సర్కారు
అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
విభజన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 24(ఆంధ్రజ్యోతి): భారత దేశం అన్ని రాష్ట్రాల సమాఖ్య అని, రాష్ట్రాల సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని విస్మరించిందని, బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష చూపిందని తెలిపింది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి ఇదే ధోరణి కొనసాగుతోందని సభ పేర్కొంది. విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్రం అన్ని చర్యలు చేపట్టాల్సి ఉందని తెలిపింది. కానీ, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందంది. ఆ హామీలు ఇప్పటికీ అమలుకాకపోవడం వల్ల తెలంగాణ ప్రగతిపై తీవ్ర ప్రభా వం చూపిందని పేర్కొంది.
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పలు దఫాలుగా ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులను కలిసి పలు విజ్ఞప్తులు చేసినట్లు గుర్తుచేసింది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడంతో పాటు విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులపై అనేక అభ్యర్థనలు చేసినా కేంద్రం పట్టించుకోలేదని తెలిపింది. బడ్జెట్‌లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష చూ పిందని సభ తీర్మానం చేసింది. కేంద్రం అనుసరించిన తీరుపై శాసనసభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్ర బడ్జెట్‌కు సవరణలు చేసి తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ చేసిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది.
Updated Date - Jul 25 , 2024 | 03:10 AM