ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ఫ్యూచర్‌ స్టేట్‌గా తెలంగాణ..

ABN, Publish Date - Aug 16 , 2024 | 04:18 AM

రానున్న రోజుల్లో తెలంగాణను ‘ఫ్యూచర్‌ స్టేట్‌’గా మార్చనున్నామని, అందుకు కార్యాచరణ ప్రారంభమైందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

  • విశ్వవేదికపై తెలంగాణ బ్రాండ్‌

  • రైతు కూలీలకు త్వరలో 12 వేలు

  • గోల్కొండలో స్వాంతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి

  • రాష్ట్రానికి రూ.31,532 కోట్ల పెట్టుబడులు, 30 వేల మందికి ఉద్యోగాలు

  • దశాబ్దకాలం తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ

  • ఏడో గ్యారెంటీగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నాం

  • రైతు కూలీలకు త్వరలో 12 వేల సాయం

  • గోల్కొండలో స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో తెలంగాణను ‘ఫ్యూచర్‌ స్టేట్‌’గా మార్చనున్నామని, అందుకు కార్యాచరణ ప్రారంభమైందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా విదేశీ పెట్టుబడుల సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజా పాలన మొదలైందన్నారు. బ్రిటీషువారి దాస్య శృంఖలాల నుంచి దేశం ఏవిధంగా విముక్తి చెందిందో... అదే స్ఫూర్తి, అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి 2023 డిసెంబరు 3న తెలంగాణ స్వేచ్ఛ పొందిందని, రాష్ట్రంలో తొలిసారి ప్రజాస్వామ్యబద్ధ పాలన సాగుతోందన్నారు.


తమ నిర్ణయాల్లో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నామని, ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినా సంయమనాన్ని పాటిస్తున్నాం అని చెప్పారు. ఎన్నికల్లో చెప్పినట్లుగా ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నాం అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి గోల్కొండ కోటపై మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఎగురవేశాక జాతీయ గీతాలాపన అనంతరం కొత్తగా స్వరపర్చిన జయ జయహే తెలంగాణ గీతాలపన ఆహూతులను అలరించింది. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రేవంత్‌ ప్రసంగించారు. ‘‘తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవేదికపై సగర్వంగా చాటాలనే లక్ష్యంతో నేను, మంత్రి శ్రీధర్‌బాబు అమెరికాలో పర్యటించి, అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో భేటీ అయ్యాం.


తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరించాం. ఫ్యూచర్‌ స్టేట్‌గా తెలంగాణను పరిచయం చేశాం. బేగరికంచె వద్ద శంకుస్థాపన చేసుకున్న ఫోర్త్‌ సిటీ, మూసీ రివర్‌ ఫ్రంట్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, మెట్రో విస్తరణ తదితర ఆలోచనలను వారితో పంచుకున్నాం. జనవరిలో దావోస్‌ పర్యటనలో భాగంగా రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డు’’ అని వివరించారు.


రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ఇటీవల చేపట్టిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైందని, 19 అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపామని, రూ.31,532 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని, తద్వారా 30 వేల మందికి పైగా నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని వివరించారు. సకల జనులు సుఖశాంతులతో శోభిల్లే తెలంగాణగా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం పాలన అందిస్తుందని హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ... సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విశ్వ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలిపే పాలనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తున్నామని వ్యాఖ్యానించారు.


  • యువతకు ఉద్యోగావకాశాలు

అధికారంలోకి వచ్చిన 3నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని సీఎం తెలిపారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, ఇప్పటికే గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షను విజయవంతంగా నిర్వహించామని రేవంత్‌ అన్నారు. 11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీని విజయవంతంగా నిర్వహించామన్నారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కుముళ్లను పరిష్కరించామని, ఇటీవల శాసనసభలో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రవేశ పెట్టామని తెలిపారు. సింగరేణి సహకారంతో రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయ హస్తం కింద సివిల్స్‌లో ప్రాథమిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన యువతకు రూ.లక్ష చొప్పున సాయం చేయాలని నిర్ణయించామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉందని చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్ర అప్పు 10 రెట్లు పెరిగిందని, రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.75,577 కోట్లుగా ఉన్న అప్పు... నిరుడు డిసెంబరు నాటికి రూ.7 లక్షల కోట్లకు చేరిందన్నారు.


  • రుణమాఫీపై విపక్షాల రంధ్రాన్వేషణ

ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందని, రాష్ట్రంలోని రైతాంగం ప్రస్తుతం అతి పెద్ద పండుగ జరుపుకుంటోందని రేవంత్‌ అన్నారు. రుణమాఫీకి ముందు మాఫీ అసాధ్యమంటూ వక్రభాష్యాలు చెప్పిన విపక్షాలు, ఇప్పుడేమో రంధ్రాన్వేషణ మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే... తెలంగాణ రైతుకు ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిందని ఘనంగా చెప్పుకునే రోజు ఇది అని, ఫలితంగా తన జన్మ ధన్యమైందని చెప్పారు. రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.15 వేలను అందించాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని అన్నారు.


సన్న రకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాకు రూ.500 చొప్పున బోన్‌సను చెల్లించాలని నిర్ణయించామని, దీనికి 33 రకాల వరిఽ ధాన్యాలను గుర్తించామని తెలిపారు. రైతుల పాలిట శాపంగా మారిన ధరణి సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ధరణి అమలులో అవకతవకలు, లోపభూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలిగిందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టం తీసుకు రావాలని భావిస్తున్నాం అని చెప్పారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూళ్లను నిర్మించబోతున్నామని తెలిపారు.


ఇటీవలే బేగరికంచె వద్ద యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నామని, తెలంగాణ విద్యా రంగంలో ఇదొక విప్లవాత్మక మలుపు కాబోతోందని అన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ‘హైడ్రా’ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో స్నేహపూర్వకంగా, సఖ్యతతో వ్యవహరిస్తున్నామని.. రాష్ట్ర విభజనానంతరం అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు త్వరలో మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, అంతకు ముందు సికింద్రాబాద్‌లోని సైనిక వీరుల స్మారక స్థూపం వద్ద సీఎం రేవంత్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు.


  • 48 గంటల్లోనే రెండు గ్యారెంటీల అమలుతో చరిత్ర సృష్టించాం

బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ఆరు గ్యారెంటీల్లోని రెండు గ్యారెంటీలను అమలు చేసి, చరిత్ర సృష్టించామని రేవంత్‌ అన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, దీని ద్వారా మహిళలకు రూ.2,619 కోట్లను ఆదా చేశామన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవాన్ని తీసుకురావడంలో భాగంగా వైద్య చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చామని వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య గల డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులను జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.


రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమల్లోకి తెచ్చామని, పదేళ్లలో రూ.1200 వరకు ఉన్న సిలిండర్‌ ధర... ఇప్పుడు రూ.500 తగ్గిందని అన్నారు. ప్రస్తుతం 43 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతోందని, సబ్సిడీ కింద వినియోగించిన 85,17,407 సిలిండర్లకుగాను రూ.242 కోట్లను చెల్లించామని అన్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్తును వాడే ప్రతిఇంటికి ఉచిత వెలుగులను పంచుతున్నామని, ప్రస్తుతం 47,13,112 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో నూతన గృహనిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున మొత్తం... 4,50,000 ఇళ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్మించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు భారీ మొత్తంలో రూ.72,659 కోట్లను కేటాయించామని తెలిపారు.

Updated Date - Aug 16 , 2024 | 04:18 AM

Advertising
Advertising
<