Skill Development: స్కిల్ వర్సిటీలో డిగ్రీ పట్టా ఇస్తాం..
ABN, Publish Date - Aug 02 , 2024 | 04:01 AM
యువతకు కేవలం సర్టిఫికెట్లతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకడం కష్టంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
17 కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ.. ఈ ఏడాది 2 వేల మందికి ప్రవేశం: సీఎం రేవంత్‌రెడ్డి
డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేస్తాం: శ్రీధర్‌బాబు
అసెంబ్లీలో వర్సిటీ బిల్లు పెట్టిన మంత్రి
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): యువతకు కేవలం సర్టిఫికెట్లతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకడం కష్టంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుంటేనే మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకే తమ ప్రభుత్వం కొత్తగా ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తోందని చెప్పారు. గురువారం శాసనసభలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్కిల్ వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వర్సిటీలో 17 కోర్సులు ప్రవేశపెట్టి, ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో యూనివర్సిటీని నిర్వహించనున్నట్లు చెప్పారు. మూడు రకాలుగా సర్టిఫికెట్ కోర్సులు అందిస్తామన్నారు. ఇదివరకు స్కిల్ వర్సిటీలో డిగ్రీ ఇచ్చే విధానం లేదని, ఫలితంగా విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న స్కిల్ వర్సిటీలో డిగ్రీ పట్టా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఫీజు ఏడాదికి రూ.50 వేలుగా నిర్ణయించామని, రీయింబర్స్‌మెంట్, హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పారు. తాత్కాలికంగా హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో 1500 మందికి, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (నాక్)లో 500 మందికి ఆరు కోర్సుల్లో తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు.
ఇక్కడికే పరిమితం కాకుండా భవిష్యత్తులో జిల్లాలకూ విస్తరిస్తామని చెప్పారు. పారిశ్రామిక అవసరాలకు, విద్యకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా యువత ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని అన్నారు. 2 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, ఇందుకోసం త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. పరిశ్రమల్లో ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు అందించడానికే వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆర్నెల్లలో 20కి పైగా సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఆరోగ్యం, ఔషధాలు, కృత్రిమ మేధ, లైఫ్ సెన్సెస్, బ్యాంకింగ్, యానిమేషన్ వంటి 12 రంగాలకు చెందిన బోధన ఉంటుందన్నారు.
వర్సిటీ కోసం ముచ్చర్లలో 57 ఎకరాలను కేటాయించామని, అక్కడ శాశ్వత క్యాంపస్ ఏర్పాటవుతుందని శ్రీధర్‌బాబు వివరించారు. స్కిల్ వర్సిటీతో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గత పదేళ్లలో ఎంఎ్‌సఎంఈ పాలసీ లేదని, తమ ప్రభుత్వం తీసుకురాబోతోందని చెప్పారు. ఆయా రంగాలకు చెందిన పరిశ్రమల నిపుణులే ఫ్యాకల్టీగా ఉంటారని, భవిష్యత్తులో స్కిల్ వర్సిటీని జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. ఇక వర్సిటీతో పాటు ‘డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా’ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉద్యోగార్థులు, నైపుణ్య శిక్షణ పొందినవారు ఉద్యోగాల కోసం ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. వర్సిటీ బిల్లుకు బీజేపీ మద్దతివ్వడం శుభపరిణామమని చెప్పారు.
శాటిలైట్ క్యాంప్‌సలు పెట్టాలి: ఏలేటి
స్కిల్ వర్సిటీ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. గుజరాత్, హరియాణా వంటి రాష్ట్రాల్లో స్కిల్ వర్సిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రంలోని వర్సిటీలను పట్టించుకోలేదన్నారు. స్కిల్ వర్సిటీలో ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. వెనకబడిన జిల్లాల్లో వర్సిటీ శాటిలైట్ క్యాంప్‌సలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్కిల్ వర్సిటీ కులపతిగా గవర్నర్ ఉండాలని, పాలకమండలి చైర్మన్‌గా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర లేదా బీవీ మోహన్‌రెడ్డిని నియమించాలని బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌బాబు సూచించారు. వర్సిటీ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించాలని మజ్లిస్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులెవరూ చర్చలో పాల్గొనలేదు. మండలిలోనూ వర్సిటీ బిల్లును శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మాట్లాడడానికి ప్రయత్నించగా చైర్మన్ గుత్తా సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అన్ని అంశాలు పరిగణనలోకి: భట్టి
అన్ని అంశాలు, సభ్యుల సూచనలు, సలహాలు తీసుకుని స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో స్కిల్ వర్సిటీ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు తెలిపిన అంశాలపై భట్టి మాట్లాడారు. గతంలో ప్రైవేటు వర్సిటీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్(ఆర్‌వోఆర్) ఉండేది కాదన్నారు. కానీ, ప్రస్తుత వర్సిటీకి ఆర్‌వోఆర్ ఉంటుందని చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి పీజు తగ్గింపు, అర్హులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర అన్ని అంశాలనూ పరిశీలించి, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భట్టి తెలిపారు.
Updated Date - Aug 02 , 2024 | 04:01 AM