Bhudhar Card: ఆధార్‌లా ‘భూధార్’ కార్డు!
ABN, Publish Date - Aug 08 , 2024 | 03:26 AM
రెవెన్యూ చట్టంలో మొదటిసారిగా ‘భూధార్ కార్డు’ రాబోతుంది. వ్యక్తులకు ఆధార్ కార్డు మాదిరిగా.. రికార్డులో నమోదు చేసిన భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో భూధార్ కార్డు జారీ చేయనున్నారు.
భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో జారీ
ఆర్వోఆర్ చట్టం రాగానే ప్రతి కమతానికీ భూధార్
వ్యవసాయేతర భూములకూ హక్కుల రికార్డు
ఎలకా్ట్రనిక్ రూపంలో భూమి సమగ్ర వివరాలు
హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ చట్టంలో మొదటిసారిగా ‘భూధార్ కార్డు’ రాబోతుంది. వ్యక్తులకు ఆధార్ కార్డు మాదిరిగా.. రికార్డులో నమోదు చేసిన భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో భూధార్ కార్డు జారీ చేయనున్నారు. దీన్ని వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు ఇవ్వనున్నారు. దీంతో సంబంధిత భూమి సమగ్ర వివరాలు తెలుసుకోవచ్చు. ఇది ఎలకా్ట్రనిక్ రూపంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న కొత్త రెవెన్యూ చట్టం (ఆర్వోఆర్)లో భూధార్ కార్డుకు ప్రత్యేక స్థానం కల్పిస్తోంది. ఈ చట్టం అమల్లోకి రాగానే రెవెన్యూ శాఽఖ రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కమతాని(భూమి)కి భూధార్ నెంబరు కేటాయించనున్నారు.
అయితే ఇది తాత్కాలికంగానే ఉంటుంది. భూములు రీసర్వే చేసిన తర్వాత శాశ్వత గుర్తింపు నెంబరు జారీ చేస్తారు. కొత్త ఆర్వోఆర్-2024 చట్టం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని రెవెన్యూ, న్యాయ నిపుణులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం సీసీఎల్‌ఏలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఈ-మెయిల్, లేఖల ద్వారా ఈ నెలాఖరు వరకు ప్రజాభిప్రాయాలు సేకరించనున్నారు. వాటిలో వచ్చే అభ్యంతరాలు, సలహాలు, సూచనల మేరకు ముసాయిదాలో మార్పులు చేర్పులు చేస్తారు. అనంతరం అసెంబ్లీ ఆమోదంతో చట్టంగా మారనుంది.
భూధార్‌తో సమగ్ర వివరాలు లభ్యం
స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డులో పేరు.. ఈ మూడు ఉన్నప్పుడే ఏ రైతుకైనా సంపూర్ణ భూమి హక్కులు ఉన్నట్లు లెక్క. వీటితో పాటు ప్రభుత్వం జారీ చేసే భూధార్ కార్డు కూడా కీలకం కానున్నది. దీని ద్వారా ఆ భూమి సమగ్ర వివరాలు తెలుసుకునేందుకు వీలుంటుంది. భూమి చిరునామాతో పాటు దాని స్వభావం, ఏ అక్షాంశ రేఖాంశాల మధ్య ఉందో కూడా శాస్త్రీయంగా గుర్తించవచ్చు.
వ్యవసాయేతర భూములకూ హక్కుల రికార్డు
దేశంలో వస్తున్న మార్పులకు, కేంద్ర ప్రభుత్వం తెస్తున్న భూ విధానాలకు అనుగుణంగా కొత్త చట్టం ఉండబోతోంది. ఇప్పటి వరకు వ్యవసాయ, ప్రభుత్వ భూములకు మాత్రమే భూ, హక్కుల రికార్డులు ఉన్నాయి. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇళ్లు, ఇంటి స్థలాలు, వ్యవసాయేతర భూముల వివరాలను కూడా హక్కుల రికార్డుల్లో నమోదు చేయనుంది. వీటిని ఎలకా్ట్రనిక్ రూపంలో, ఆన్‌లైన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
Updated Date - Aug 08 , 2024 | 03:26 AM