Water Allocation: 74 టీఎంసీలు కేటాయించలేం!
ABN, Publish Date - Oct 15 , 2024 | 03:13 AM
గోదావరి-కావేరి అనుసంధానంలో తరలించే 148 టీఎంసీల్లో 74 టీఎంసీల నీటిని కేటాయించాలన్న తెలంగాణ విజ్ఞప్తిని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తోసిపుచ్చింది.
గోదావరి-కావేరి తొలి దశలో కష్టం
రెండో దశలోనే నీటి లభ్యత పెరుగుతుంది
తెలంగాణకు తేల్చిచెప్పిన కేంద్రం
అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఎన్‌డబ్ల్యూడీఏ లేఖ
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరి అనుసంధానంలో తరలించే 148 టీఎంసీల్లో 74 టీఎంసీల నీటిని కేటాయించాలన్న తెలంగాణ విజ్ఞప్తిని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తోసిపుచ్చింది. తొలి దశలో ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం వినియోగించుకోని వాటాను మాత్రమే తరలిస్తున్నామని, అందువల్ల రాష్ట్రాలు కోరినంత మేర నీటిని పంచలేమని తెలిపింది. రెండో దశలో మహానది-గోదావరి అనుసంధానం తర్వాతే నీటి లభ్యత పెరుగుతుందని గుర్తుచేసింది. ఈ మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ సంప్రదింపుల కమిటీ సమావేశంలో తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై రాష్ట్రానికి లేఖ రాసింది.
గోదావరి-కావేరి అనుసంధానంలో తొలిదశలో తరలించే 148 టీఎంసీల్లో 16 టీఎంసీలను కర్ణాటకకు కేటాయిస్తూ.. ఆ నీటిని కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి రిజర్వాయర్ నుంచి తరలించడానికి (వాడుకోవడానికి) వెసులుబాటు కల్పిస్తే దాని దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం జలాశయాలపై ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న తెలంగాణ అభ్యంతరాలను కూడా తోసిపుచ్చింది. జూలై నుంచి అక్టోబరు మధ్యలోనే ఈ నీటి తరలింపు ఉంటుందని గుర్తు చేసింది. గోదావరి-కావేరి అనుసంధానంలో నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా చూపించారు. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా ట్రైబ్యునల్-2 కేటాయించిన 1050 టీఎంసీల జలాలను పంచే బాధ్యతను కేంద్రం జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్‌కు అప్పగించింది.
1050 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు ట్రైబ్యునల్ పంచేదాకా సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా చూపించరాదని, కృష్ణా జలాల్లో వాటా తేలిన తర్వాత సిమ్యులేషన్ స్టడీ (సమగ్ర నీటి అధ్యయనం) చేసి, ఇబ్బందుల్లేవని తేలితేనే ముందుకెళ్లాలన్న తెలంగాణ అభ్యంతరాలపై ఎన్‌డబ్ల్యూడీఏ స్పందిస్తూ.. నాగార్జునసాగర్ ప్రస్తుతం ఆన్‌లైన్ (గోదావరి-కావేరి అనుసంధానం దారిలో ఉండే) రిజర్వాయర్‌గా ప్రతిపాదనల దశలోనే ఉందని తెలిపింది. కృష్ణా ట్రైబ్యునల్ నీటి కేటాయింపులపై ఎలాంటి ప్రభావం చూపకుండా పరస్పర అంగీకారంతోనే ముందుకు వెళతామని గుర్తు చేసింది.
ఇక కర్ణాటకలోని బెడ్తి-వారాదా లింక్‌లో తరలించే నీటిలో 50 శాతం వాటా ఇవ్వాలని తెలంగాణ పెట్టుకున్న విజ్ఞప్తిపై స్పందిస్తూ.. ప్రస్తుతం ఈ లింక్ ప్రతిపాదన దశలోనే ఉందని, ఒప్పందం కుదిరిన తర్వాత దీనిపై నిర్ణయం ఉంటుందని పేర్కొంది. గోదావరి-కావేరి అనుసంధానంలో సమ్మక్కసాగర్(తుపాకులగూడెం) బ్యారేజీలో 83 మీటర్ల పైన, 87 మీటర్ల మధ్యలో ఉండే నీటిని మాత్రమే తరలిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ గుర్తు చేసింది. అంతేకాకుండా గోదావరి-కావేరి అనుసంధానంలో తెలంగాణకు కేటాయించే 45 టీఎంసీల నీటి నిల్వ కోసం రెండుచోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా అంగీకరించింది.
Updated Date - Oct 15 , 2024 | 03:13 AM