Jupally: సోమశిల, నిర్మల్‌కు జాతీయ అవార్డులు..
ABN, Publish Date - Sep 28 , 2024 | 03:37 AM
తెలంగాణలోని సోమశిల, నిర్మల్‌కు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు దక్కాయి.
ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా ఎంపిక... మంత్రి జూపల్లి హర్షం
న్యూఢిల్లీ/హైదరాబాద్/నిర్మల్ కల్చరల్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని సోమశిల, నిర్మల్‌కు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు దక్కాయి. కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా.. ‘స్పిర్చ్యువల్-వెల్‌నెస్’ కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లా లోని సోమశిల, ‘క్రాఫ్ట్స్’ కేటగిరీలో నిర్మల్ ఎంపికయ్యాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు.
నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్ టాయ్స్, ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.పెంటయ్య, పర్యాటక శాఖ అధికారి టి.నర్సింహ ఈ అవార్డులను అందుకున్నారు. సోమశిల, నిర్మల్‌కు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు దక్కడంపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో టూరిస్ట్ డెస్టినేషన్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
అట్టహాసంగా పర్యాటక దినోత్సవం
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిధం) ఆవరణలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. యువ టూరిజం క్లబ్స్ ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న, యువతకు ఉపాధి కల్పనలో విశేష కృషి చేస్తున్న మహబూబ్‌నగర్, వరంగల్, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు, ఆతిథ్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న రెస్లారెంట్లు, హోటళ్ల నిర్వాహకులకు మంత్రి జూపల్లి అవార్డులను ప్రదానం చేశారు.
విద్యార్థులు ప్రదర్శించిన శివప్రియం, కాకతీయం, పేరిణి నృత్య రూపకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పర్యాటక అభివృద్థి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 28 , 2024 | 03:37 AM