US: అమెరికాలో తెలుగు యువకుడి మృతి..
ABN, Publish Date - Aug 17 , 2024 | 04:41 AM
అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతి చెందాడు. పార్ట్‌టైం జాబ్ చేసుకుంటూ ఉన్నత చదువులు కొనసాగిస్తున్న అతడు మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
మూడు రోజుల క్రితం తన గదిలోనే అనుమానాస్పద స్థితిలో మరణం
ఆత్మకూరు, ఆగస్టు 16: అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతి చెందాడు. పార్ట్‌టైం జాబ్ చేసుకుంటూ ఉన్నత చదువులు కొనసాగిస్తున్న అతడు మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆసరా ఉంటాడనుకున్న కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఏరుగొండ సాంబయ్య, నీలమ్మ దంపతులకు కుమారుడు రాజేష్(32), కూతురు రమ ఉన్నారు.
పేద కుటుంబంలో పుట్టిన రాజేష్ ఫార్మసీ కోర్సు పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎమ్మెస్ చదివేందుకు 2015లో అమెరికా వెళ్లాడు. అక్కడి మిసిసిపి రాష్ట్రంలోని డీన్ మెమోరియల్ ప్యునరల్ హోమ్‌లో ఉంటూ చదువుకుంటూనే పార్ట్ టైం ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో కరోనా సమయంలో ఆ ఉద్యోగం కూడా పోవడంతో ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయాడు. ఈ నేపథ్యంలో తండ్రి సాంబయ్య అనారోగ్యంతో గత ఏడాది మృతి చెందగా.. ఆర్థిక పరిస్థితుల కారణంగా వీసా రాకపోవడంతో రాజేష్ తండ్రికి తలకొరివి పెట్టేందుకు కూడా రాలేకపోయాడు.
ఈ క్రమంలో రాజేష్ మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో నివాసం ఉంటున్న గదిలోనే మృతి చెందినట్టు అతడి మిత్రులు తల్లి నీలమ్మకు ఫోన్ ద్వారా తెలిపారు. మంచి ఉద్యోగంతో ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు మరణించాడని తెలియడంతో ఆ తల్లి రోదనకు అంతులేకుండాపోయింది. కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సుమారు రూ.12లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఖర్చవుతాయని తెలియడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడింది.
ప్రభు త్వం చొరవ చూపి అమెరికా నుంచి రాజేష్ మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకొచ్చేలా కృషి చేయాలని అతడి కుటుంబసభ్యులు, బంధువులు కోరుతున్నారు. కాగా, రాజేష్ మతదేహాన్ని తీసుకురావడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Updated Date - Aug 17 , 2024 | 04:41 AM