Musi River: మా ఇళ్లు కూల్చొద్దు.. గో బ్యాక్!
ABN, Publish Date - Sep 28 , 2024 | 04:10 AM
మూసీ సుందరీకరణలో భాగంగా నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేయాలని సర్కారు నిర్ణయించడం, ఆ ఇళ్లకు మార్కింగ్ చేస్తుండటంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో బాధితుల ఆందోళనలు, ధర్నాలు.. చైతన్యపురి డివిజన్, లంగర్‌హౌస్ పరిధిలో మార్కింగ్‌ను అడ్డుకున్న వైనం
దిల్‌సుఖ్‌నగర్, నార్సింగ్ సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మూసీ సుందరీకరణలో భాగంగా నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేయాలని సర్కారు నిర్ణయించడం, ఆ ఇళ్లకు మార్కింగ్ చేస్తుండటంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సర్వే కోసం, మార్కింగ్ కోసం వస్తున్న అధికారులను ఎక్కడికక్కడ బాధితులు అడ్డుకుంటున్నారు. ‘మా ఇళ్లు కూల్చొద్దు.. గో బ్యాక్’ అంటూ ధర్నాలు చేస్తున్నారు. శుక్రవారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారులను బాధితులు అడ్డుకున్నారు. చైతన్యపురి డివిజన్ మూసీ పరీవాహక ప్రాంతంలోని వినాయకనగర్ కాలనీ, న్యూ మారుతినగర్, ఫణిగిరి కాలనీ, లక్ష్మీనర్సింహా కాలనీ, ఇందిరానగర్, గణేశ్‌పురి, ద్వారకాపురం, భవానీనగర్, సత్యనగర్, వెంకటసాయినగర్‌లో శుక్రవారం కూడా జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, హౌజింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు సర్వే, మార్కింగ్ పనులు చేపట్టారు.
ఈ సందర్బంగా స్థానికులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అధికారులు సర్వే చేయడంతోపాటు, మార్కింగ్ పనులు చేపట్టారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెళ్లేందుకు ఆసక్తి ఉందా? లేదా? అని ప్రశ్నించి ఆ వివరాలను కూడ నమోదు చేశారు. ఆసక్తి ఉన్నవారిని వెంటనే అక్కడకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆసక్తిలేని వారు తమకు ఇష్టం లేదని చెప్పడంతో రెవెన్యూ అధికారులు వారి కళ్లముందే ఆ సర్వే ధరఖాస్తులో ఆసక్తిలేదు (నాట్ విల్లింగ్) అని నమోదు చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాలను సందర్శించేందుకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, స్థానిక కార్పొరేటర్‌లు రంగా నర్సింహాగుప్తా, పవన్‌లతో కలిసి ఆయా కాలనీలలో పర్యటించారు. అన్ని కాలనీల్లో పర్యటించిన అనంతరం ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈటల రాజేందర్ న్యూ మారుతినగర్ కాలనీలో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
కార్పొరేటర్ రంగా నర్సింహాగుప్తా వెంటనే తన అనుచరులతో కలిసి మార్కింగ్ చేస్తున్న స్థలం వద్దకు వెళ్లి ‘గో బ్యాక్... గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో గండిమైసమ్మ తహసీల్దార్ మతీన్, కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తాల మద్య తీవ్రవాగ్వివాదం నెలకొంది. నివాసితులను ఎందుకు బెదిరిస్తున్నారని నర్సింహాగుప్తా నిలదీయడంతో తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఆయన చొక్కా చిరిగింది. ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. కాగా లంగర్‌హౌస్ మూసీ పరీవాహక ప్రాంతాల్లో కార్వాన్ కేసరి హనుమాన్ పరీవాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఎఫ్‌టీఎల్ హద్దులను గుర్తించారు. ఈ సందర్భంగా బాధితుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లంగర్‌హౌజ్ రింగ్‌రోడ్డు ప్రధాన రహదారి, కేసరి హనుమాన్ ప్రదాన రహదారిని స్థానికులు దిగ్భంఽధించారు. బాధితులు సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో నిర్వాసితులకు అండగా ఉంటానని ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎట్టకేలకు శాంతించారు. ఈ రాత్రంతా ఫణిగిరి కాలనీ సాయిబాబా దేవాలయంలో బస చేసేందుకు ఈటల సన్నద్ధమవగా, పోలీసులు అప్రమత్తమయ్యారు. రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు, ఎంపీ ఈటల రాజేందర్‌కు ఫోన్‌చేసి నచ్చజెప్పడంతో ఆలయంలో కూర్చున్న ఆయన అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.
రివర్ బెడ్ మేరకే మార్కింగ్
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురి డివిజన్, కొత్తపేట డివిజన్‌ల మూసీపరీవాహక ప్రాంతాల్లో శుక్రవారం కూడ ఇళ్ల మార్కింగ్ ప్రక్రియ చేపట్టారు. ఆందోళనల నేపథ్యంలో మధ్యాహ్నం వరకు మాత్రమే మార్కింగ్, సర్వే ప్రక్రియ చేపట్టారు. అయితే చైతన్యపురి, కొత్తపేట రెండు డివిజన్‌ల పరిధిలోని వినాయకనగర్ కాలనీ, న్యూ మారుతినగర్, ఫణిగిరి కాలనీ, లక్ష్మీనర్సింహా కాలనీ, ఇందిరానగర్, గణే్‌షపురి కాలనీ, ద్వారకాపురం, భవానీనగర్, సత్యనగర్, వెంకటసాయినగర్ కాలనీలోని పలు ఇళ్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. ప్రస్తుతం రివర్ బెడ్ మేరకు మాత్రమే ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బఫర్‌జోన్‌లోని నిర్మాణాల జోలికి వెళ్లడం లేదన్నారు. శుక్రవారం సుమారు 180 ఇళ్ళకు మార్కింగ్ చేశారు. రివర్ బెడ్ పరిధిలో మరో 50, 60 ఇళ్లు మాత్రమే ఉండొచ్చని తెలుస్తోంది.
శానిటైజర్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
చైతన్యపురి పరిఽధిలో అధికారులు ఇళ్లకు మార్కింగ్ చేస్తుండగా ఆందోళనకు గురైన ఓ ఇంటి యజమాని ఇంట్లో ఉన్న శానిటైజర్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు అతడిని అడ్డుకుని ఒంటిపై నీరు చల్లారు. ఇంటిని కూల్చివేయరని, ఎలాంటి ఆందోళన చెందొద్దని అతడిని నచ్చజెప్పారు.
లోన్ తీసుకుని మూడేళ్లు కూడ కాలేదు
తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్‌లు, తమ కుటుంబమంతా కష్టపడి కూడబెట్టిన డబ్బుతో స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్నాం. ఇంటికి డబ్బు చాలకపోవడంతో ఎస్బీఐ బ్యాంక్‌లో లోన్ తీసుకుని ఇంటిని నిర్మించుకున్నాం. లోన్ తీసుకుని మూడేళ్లు కూడ కాలేదు, ఇప్పుడు మా ఇంటిని కూల్చివేస్తే మా కుటుంబం రోడ్డున పడుతుంది. ఇంట్లోంచి వెళ్లగొట్టే బదులు మా కుటుంబ సభ్యులందరికీ కాస్త విషం ఇవ్వండి.
- ఘంటసాల చిరంజీవి, న్యూ మారుతినగర్.
Updated Date - Sep 28 , 2024 | 04:10 AM