ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: 1,000 ఎకరాల్లో జూపార్కు..

ABN, Publish Date - Aug 31 , 2024 | 02:56 AM

హైదరాబాద్‌ శివారులో కొత్తగా జూపార్కు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఫోర్త్‌ సిటీలో హెల్త్‌ హబ్‌, టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు

  • హైదరాబాద్‌ శివార్లలో కొత్తగా ఏర్పాటు

  • టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు

  • చట్ట సవరణ ద్వారా స్వయం ప్రతిపత్తి కల్పిస్తాం

  • ఫోర్త్‌సిటీలో వెయ్యి ఎకరాల్లో హెల్త్‌ హబ్‌

  • రామప్పగుడిలా కీసరగుట్ట ఆలయ పునర్నిర్మాణం

  • అనంతగిరిలో నేచర్‌ వెల్‌నెస్‌ సెంటర్‌

  • పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్త పాలసీలు

  • హెల్త్‌, ఎకో, టెంపుల్‌ టూరిజంపై ప్రత్యేక దృష్టి

  • స్పీడ్‌ ప్రాజెక్టుల సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

  • స్కిల్‌ యూనివర్సిటీ డిజైన్లను పరిశీలించిన సీఎం

హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ శివారులో కొత్తగా జూపార్కు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఫోర్త్‌ సిటీలో హెల్త్‌ హబ్‌, టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు, అనంతగిరిలో నేచర్‌ వెల్‌నెస్‌ సెంటర్‌, కీసరగుట్ట ఆలయాన్ని రామప్పగుడి తరహాలో పున ర్నిర్మాణం జరపడం.. ఇవీ ప్రభుత్వం ‘స్పీడ్‌’లో భాగంగా అత్యంత ప్రాధాన్యంగా చేపట్టాలనుకుంటున్న కార్యక్రమాలు. వివిధ కార్యక్రమాలను వేగంగా పట్టాలెక్కించేందుకుగాను సర్కారు చేపట్టిన స్పీడ్‌ (స్మార్ట్‌ ప్రో యాక్టివ్‌ ఎఫిషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ)పై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.


సమావేశంలో సీఎం మాట్లాడుతూ..పర్యాటకులను ఆకట్టుకునేలా రాష్ట్రంలో హెల్త్‌, ఎకో, టెంపుల్‌ టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్‌ నగర పరిసరాల్లో కొత్తగా మరో జూపార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించాలని, వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకువచ్చి ఈ పార్కులో ఉంచేలా అర్బన్‌ ఫారెస్టీని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.


ఇందుకు అవసరమైతే పారిశ్రామికవేత్తలు, సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. జామ్‌నగర్‌లో అనంత్‌ అంబానీ 3వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, కొత్త జూపార్కు ఏర్పాటు నేపథ్యంలో.. ప్రస్తుతం ఉన్న జూపార్కును అక్కడికి తరలిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ కాలుష్యం దృష్ట్యా ఈ జూపార్కును తరలించాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉంది.


  • వెయ్యి ఎకరాల్లో హెల్త్‌ హబ్‌..

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఫోర్త్‌ సిటీలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో హెల్త్‌ హబ్‌ నిర్మించాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్‌ తెలిపారు. దీనిద్వారా హైదరాబాద్‌లో హెల్త్‌ టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే సంస్థలు ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు వీలుగా కొత్త పాలసీని రూపొందించాలని, ఆకర్షణీయమైనప్రోత్సాహకాలను అందులో చేర్చాలని అన్నారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి వైద్య సేవల కోసం వచ్చేవారికి ఈ హబ్‌.. వన్‌స్టా్‌ప సొల్యూషన్‌గా ఉండేలా ప్యాకేజీలు రూపొందించాలన్నారు. ఆన్‌లైన్‌లో అన్ని సేవల వివరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.


వైద్యుల అపాయింట్‌మెంట్‌, ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని సర్వీసులు ఆన్‌లైన్‌లోనే అందాలని పేర్కొన్నారు. పేషంట్లు నేరుగా విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి వెళ్లి కావాల్సిన చికిత్సను జాప్యం లేకుండా అందుకునేలా సర్వీసులను డిజైన్‌ చేయాలని సూచించారు. దేశంలోనే అందరి దృష్టినీ ఆకర్షించేలా హైదరాబాద్‌ను మెడికల్‌ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.


బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధివిధానాలు ఉండేలా చట్ట సవరణ చేయాలన్నారు. యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని ఆదేశించారు. గుట్టపై చేపడుతున్న అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో లేవని, ఏ పని కూడా అర్ధాంతరంగా ఆగిపోవడానికి వీల్లేదని అన్నారు. ఇప్పటివరకు జరిగిన పనులు, అసంపూర్తిగా ఉన్న పనుల వివరాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. భక్తులు విడిది చేసే కాటేజీల నిర్మాణం, ఇతర సౌకర్యాల కోసం దాతలు, కార్పొరేట్‌ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు.


  • కీసరగుట్ట ఆలయం పునర్నిర్మాణం..

కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం తరహాలో పునర్నిర్మించాలని సీఎం రేవంత్‌ అన్నారు. పురాతన శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీ జోలికి వెళ్లకుండా అధునాతన పరిజ్ఞానంతో అలాంటి ఆకృతిని తీర్చిదిద్దాలని సూచించారు. ఇక బెంగుళూరులోని జిందాల్‌ నేచర్‌ క్యూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ తరహాలో వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో నేచర్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అక్కడ ఉన్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను దీనికోసం వినియోగించాలని అన్నారు.


ప్రకృతి చికిత్సలో పేరు పొందిన ప్రముఖ సంస్థలను సంప్రదించి అవసరమైన కసరత్తు పూర్తి చేయాలని ఆదేశించారు. కవ్వాల్‌, అమ్రాదాబాద్‌ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త విధానాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్‌ టూరిజంల అభివృద్ధికి విడివిడిగా పాలసీలను రూపొందించాలని సూచించారు. తెలంగాణలోని ప్రాచీన ఆలయాలు, చారిత్రక స్థలాలతోపాటు అటవీ సంపద, వైద్య సదుపాయలన్నింటినీ సమాహారంగా మార్చి పర్యాటకులను ఆకర్శించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.


ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు. పర్యాటకులకు ఎక్కడిక్కడ వసతి సౌకర్యం ఉండేలా చూడాలని, రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పారు. టూరిజం, దేవాదాయ, అటవీ శాఖ అధికారులు కలిసికట్టుగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని అన్నారు. ఉద్యోగ కల్పనతోపాటు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా టూరిజం అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు.


  • నామినేటెడ్‌ పోస్టులపై చర్చ

సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మధ్య సచివాలయంలో శుక్రవారం రాత్రి కీలక భేటీ జరిగింది. మిగిలి ఉన్న నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అంశంపై ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది.


  • అవి నాకు ఆపాదించిన వ్యాఖ్యలు: సీఎం రేవంత్‌

భారత న్యాయ వ్యవస్థ పట్ల తనకు అత్యంత గౌరవం, పూర్తి విశ్వాసం ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కొన్ని పత్రికల్లో గురువారం తాను అన్నట్లుగా ప్రచురితమైన వ్యాఖ్యలు తనకు ఆపాదించబడినవేనని వివరణ ఇచ్చారు. కవిత బెయిల్‌కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల లపట్ల సుప్రీం ధర్మాసనం సీరియస్‌ అయిన నేపథ్యంలో ఎక్స్‌ వేదికగా శుక్రవారం ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. న్యాయ ప్రక్రియ పట్ల తనకు ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. పత్రికా నివేదికల్లో ప్రచురితమైన ఆ వ్యాఖ్యలపట్ల తాను బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. భారత రాజ్యాంగం, దాని నైతికతపైన దృఢ విశ్వాసం ఉన్న తాను.. న్యాయవ్యవస్థపైన తనకు ఉన్న అత్యున్నత గౌరవాన్ని కొనసాగిస్తానన్నారు.


  • స్కిల్‌ యూనివర్సిటీ డిజైన్ల పరిశీలన

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న స్కిల్‌ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించారు. శుక్రవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. డిజైన్లపై ఆర్కిటెక్ట్‌లకు పలు సూచనలు చేశారు. ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల డిజైన్లకూ పలు మార్పులను సీఎం సూచించారు. కాగా, సీఎంను శుక్రవం పలువురు ప్రముఖులు కలిశారు.


లండన్‌కు చెందిన కామన్‌వెల్త్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అండ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కౌన్సిల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటి వ్‌ రోసీ గ్లేజ్‌బ్రూక్‌.. సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వరల్డ్‌ ఫుడ్‌ ఫౌండేషన్‌ టాప్‌-2024 అవార్డు గ్రహీత డాక్టర్‌ సమరేందు మొహంతి కూడా సీఎంతో భేటీ అయ్యారు. జానపద కళాకారుడు కుమారస్వామి రచించిన 5వేల చరణాలతో ఉన్న అతిపెద్ద జానపద గీతం పుస్తకాన్ని రేవంత్‌ విడుదల చేశారు. మతి భానుమూర్తి రచించిన ‘జయ సేనాపతి’ నవలను కూడా సీఎం ఆవిష్కరించారు.


ఆ వ్యాఖ్యలను నాకు ఆపాదించారు

  • బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా

  • న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం

  • సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో

  • ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్‌ వివరణ

భారత న్యాయ వ్యవస్థ పట్ల తనకు అత్యంత గౌరవం, పూర్తి విశ్వాసం ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కొన్ని పత్రికల్లో గురువారం తాను అన్నట్లుగా ప్రచురితమైన వ్యాఖ్యలు తనకు ఆపాదించబడినవేనని వివరణ ఇచ్చారు. కవిత బెయిల్‌కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల లపట్ల సుప్రీం ధర్మాసనం సీరియస్‌ అయిన నేపథ్యంలో ఎక్స్‌ వేదికగా శుక్రవారం ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. న్యాయ ప్రక్రియ పట్ల తనకు ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. పత్రికా నివేదికల్లో ప్రచురితమైన ఆ వ్యాఖ్యలపట్ల తాను బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. భారత రాజ్యాంగం, దాని నైతికతపైన దృఢ విశ్వాసం ఉన్న తాను.. న్యాయవ్యవస్థపైన తనకు ఉన్న అత్యున్నత గౌరవాన్ని కొనసాగిస్తానన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 02:56 AM

Advertising
Advertising