Share News

Flood Damage: వరద నష్టం రూ.10 వేల కోట్లు!

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:10 AM

రాష్ట్రంలో వరద నష్టం రూ.10,300 కోట్లు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది.

Flood Damage: వరద నష్టం రూ.10 వేల కోట్లు!

  • ప్రభుత్వానికి విపత్తుల నిర్వహణ విభాగం నివేదిక

  • శాఖల వారీ అంచనాల తయారీ

  • రేపు కేంద్ర బృందంతో పరిహారంపై ఉన్నత స్థాయి భేటీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరద నష్టం రూ.10,300 కోట్లు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ మేరకు శాఖల వారీగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ రూపొందించిన 300 పేజీల నివేదికను బుధవారం విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి హరీశ్‌.. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి అందజేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కేంద్ర బృందాలు పర్యటిస్తున్న నేపథ్యంలో వరద నష్టంపై శాఖల వారీగా తయారు చేసిన నివేదికపై శుక్రవారం కేంద్ర బృందంతో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే సమావేశంలో కేంద్రం నుంచి రూ.10,300 కోట్ల పరిహారం కావాలని, ఆ మేరకు శాఖల వారీగా రూపొందించిన నష్ట వివరాలను కేంద్ర బృందానికి అందించనున్నట్లు అధికారులు తెలిపారు.


మరోవైపు.. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల వాటిల్లిన నష్టం వివరాలను కేంద్ర బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు. కల్నల్‌ కేపీ సింగ్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం సచివాలయంలో సీఎ్‌సతో సమావేశమైంది. వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసి, ప్రాణ నష్టం లేకుండా చూసిందని సీఎస్‌ ఆ బృందానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను అందించడానికి వీలుగా మార్గదర్శకాలను ఉదారంగా రూపొందించాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.


అత్యవసర పరిస్థితుల్లో ఎన్‌డీఆర్‌ఎ్‌ఫతో సమానంగా సహాయక చర్యలు చేపట్టడానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. ఈ ప్రత్యేక బృందాలకు శిక్షణ, ఇతర లాజిస్టిక్స్‌ ఏర్పాట్లలో ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ మద్దతు కావాలని సీఎస్‌ కోరారు. భారీ వర్షాలు, వరదల సమయంలో వైమానిక రెస్క్యూ ఆపరేషన్స్‌ను నిర్వహించాల్సి ఉంటుందని, దీనికి కేంద్ర సహకారం కావాలని అడిగారు. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో 332 హెక్టార్ల విస్తీర్ణంలో భారీ చెట్లు కూలాయని, ఇలాంటి పర్యావరణ సమస్యకు కారణాలేమిటో తెలుసుకోవాలని కేంద్ర బృందం సీఎ్‌సకు సూచించింది. వివిధ శాఖల ఉన్నతాధికారులు వరద నష్టంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కేంద్ర బృందాలకు వివరించారు.

Updated Date - Sep 12 , 2024 | 03:10 AM