Medical Health: వైద్య శాఖలో కొలువుల మేళా
ABN, Publish Date - Oct 12 , 2024 | 03:22 AM
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల మేళా కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7300 పోస్టులను భర్తీ చేసింది. మరో 6500 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
272 నర్సింగ్ ఆఫీసర్, 99 ఫార్మసిస్ట్ పోస్టులు
హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల మేళా కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7300 పోస్టులను భర్తీ చేసింది. మరో 6500 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం మరో 371 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 272 నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్) ఉద్యోగాలు, 99 ఫార్మసి్‌స్ట(గ్రేడ్-2) పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెల 18న జారీ చేసిన 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఈ 272 పోస్టులు అదనమని నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో ప్రభుత్వం భర్తీ చేసే నర్సింగ్ పోస్టుల సంఖ్య 2322కు పెరిగింది.
ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 వరకు చివరి గడువుగా నిర్ణయించింది. నవంబరు 23న కంప్యూటర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. కాగా, గత నెల 24న 633 ఫార్మసి్‌స్ట(గ్రేడ్-2) పోస్టులకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. ఇదే నోటిఫికేషన్‌కు అదనంగా మరో 99 పోస్టులను తాజాగా జత చేస్తున్నామని బోర్డు ప్రకటించింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 732కు పెరిగింది. ఈ పోస్టులకు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చింది. నవంబరు 30వ తేదీన ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. జోన్లు, కేటగిరీల వారీగా ఖాళీల సంఖ్యను బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.
Updated Date - Oct 12 , 2024 | 03:22 AM