Tribal Health: అరగంటలో ఆస్పత్రులకు గిరిజనం!
ABN, Publish Date - Oct 04 , 2024 | 03:14 AM
గిరిపుత్రుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అడవులు, కొండలు కోనల్లో నివసించే గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని నిర్ణయించింది.
అలాంటి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి.. ఐటీడీఏల్లో కొత్త పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు
ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న మంత్రి రాజనర్సింహ
ఐటీడీఏల పీవోలు, ఆరోగ్య శాఖాధికారులతో సమీక్ష
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): గిరిపుత్రుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అడవులు, కొండలు కోనల్లో నివసించే గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతమున్న ఆస్పత్రులే కాకుండా.. మరిన్ని కొత్త ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి, వైద్యాన్ని గిరిజనం చెంతకు చేర్చాలని భావిస్తోంది. గిరిజనులు అర గంట లోపే ఆస్పత్రులకు చేరుకునే స్థాయిలో నెట్‌వర్క్‌ను విస్తరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. అందులో భాగంగా కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ), సబ్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ అధికారులను, ఐటీడీఏల పీవోలను ఆదేశించారు.
ఇప్పటికే సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో కొన్ని ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో మరిన్ని వసతులు కల్పించి, వైద్య సేవలను మెరుగుపర్చాలని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, మన్ననూరు ఐటీడీఏల పరిధిలో ఉన్న ఆస్పత్రులు, వైద్య సౌకర్యాలు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి రాజనర్సింహ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఐటీడీఏల పరిధిలో నివసిస్తున్న ప్రజలు తమ ఆవాసాల నుంచి అర గంట లోపు చేరుకునేలా ఆస్పత్రుల నెట్‌వర్క్ ఉండాలని చెప్పారు. ఇందుకు అనుగుణంగా కొత్త సబ్ సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదని, ప్రజల అవసరాలకే ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.
ఐటీడీఏల పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు. అటవీ ప్రాంతాలు, రోడ్ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాల్లోని గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ (ఈడీడీ) కంటే ముందే గర్భిణులను ఆస్పత్రులకు తరలించి, బర్త్ వెయిటింగ్ రూమ్‌లలో వారికి అడ్మిషన్ ఇవ్వాలని చెప్పారు. 108 అంబులెన్సులు వెళ్లలేని ప్రాంతాల్లో బైక్ అంబులెన్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి కోసం జనాభా ప్రాతిపదికన ప్రతిపాదనలు అందజేయాలని పీవోలను ఆదేశించారు. గిరిజన గూడేలు, చెంచు పెంటలను క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలు కనీసం వారానికి ఒకసారి, మెడికల్ ఆఫీసర్లు నెలకోసారి సందర్శించాలని తెలిపారు. ఆదివాసీలకు మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ వంటి పెద్ద దవాఖానాల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత సంవత్సరం కంటే ఈసారి డెంగీ, వైరల్ జ్వరాల కేసులు తక్కువగా నమోదయ్యాయని ఐటీడీఏల పీవోలు మంత్రికి తెలిపారు.
రాష్ట్రంలో ఏఎంఆర్ కార్యాచరణ
యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడటం ద్వారా ఏ మందులూ పనిచేయక ప్రాణాలకే ముప్పు వచ్చే స్థితి నుంచి బయటపడే లక్ష్యంతో రూపొందించిన యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) కార్యాచరణ ప్రణాళికను మంత్రి దామోదర ఆవిష్కరించారు. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ త్వరలో దీనిని ప్రభావవంతంగా అమలు చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో ఏంఎఆర్ యాక్షన్ ప్లాన్‌ను బలోపేతం చేయడానికి పూర్తి సహకారం అందిస్తామని డబ్ల్యుహెచ్‌వో ఇండియా ప్రతినిధి డాక్టర్ అనూజ్ శర్మ చెప్పారు.
Updated Date - Oct 04 , 2024 | 03:14 AM