Teacher : బోధనాభ్యాసాల్లో నాణ్యత బేరీజు!
ABN, Publish Date - Aug 15 , 2024 | 02:34 AM
పాఠశాల విద్యార్థులకు విద్యా బోధనలో నాణ్యతను మరింత పెంచేందుకుగాను ఉపాధ్యాయులకు అప్రయిజల్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
టీచర్లకు అప్రయిజల్ విధానం
హెడ్ మాస్టర్ సహా ఉపాధ్యాయులు
ఏడాదిలో 3 సార్లు రూపొందించాలి
ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయాలి
అభ్యసన ఫలితం పెంపు లక్ష్యంగా..
ఎల్‌ఐపీలో సర్కారు మార్పులు
ఈ నెలాఖరులోగా డీఎస్సీ ఫలితాలు!
బోధనాభ్యాసాల్లో నాణ్యత బేరీజు!
టీచర్లకు అప్రయిజల్ విధానం.. విద్యార్థులకు మెరుగైన బోధన కోసం అమలు
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యార్థులకు విద్యా బోధనలో నాణ్యతను మరింత పెంచేందుకుగాను ఉపాధ్యాయులకు అప్రయిజల్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయులు బోధించే పాఠాలు విద్యార్థులకు ఏ మేరకు అర్థమవుతున్నాయి? నాణ్యత ఎంతవరకు పెరిగింది? అనే అంశాల ఆధారంగా ఈ అప్రయిజల్ నివేదికలు ఉండనున్నాయి. ప్రతి ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు సెల్ఫ్ అప్రయిజల్‌ను రూపొందించాలని ప్రభుత్వం సూచించింది. ఏటా మూడుసార్లు దీనిని తయారు చే యాలి.
సెప్టెంబరు, డిసెంబరు, మార్చి నెలల్లో దీనిని రూపొందించి ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు మరింత మెరుగైన బోధన పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకుగాను లెర్నింగ్ ఇప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎల్‌ఐపీ) 2024-25 కార్యక్రమంలో ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు తాజాగా సర్క్యులర్ జారీ చేశారు. మార్పులు చేసిన విధానం ప్రకారం.. ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం ప్రణాళికను ముందే రూపొందించుకోవాలి. ప్రతి టీచర్.. డైరీని రూపొందించుకుని దాని ప్రకారం నడుచుకోవాలి. ఇందులో పీరియడ్, సబ్జెక్టు, అధ్యాయం, అంశం, అభ్యసన ఫలితం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీని ప్రకారమే బోధన కొనసాగించాలి.
ముఖ్యంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసి వారికి అర్థమయ్యే విధంగా బోధన, అభ్యసన పద్ధతులను అవలంబించాలి. ఈ విషయంలో ఉపాధ్యాయులకు కొంత వెసులుబాటు కూడా కల్పించారు. విద్యార్థి అభ్యసన ఫలితాన్ని పెంచేవిధంగా దీనిని అమలు చేయాలని సూచించారు. ఇక విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ప్రతి నెలా నిర్వహించే పరీక్షల విధానంలోనూ మార్పులు చేశారు. ఈ పరీక్షలను ఏడాదిలో మూడుసార్లు నిర్వహిస్తే సరిపోతుందని నిర్ణయించారు. ఆగస్టు, డిసెంబరు, మార్చి నెలల్లో ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల నివేదికలను విద్యార్థుల వారీగా రూపొందించి తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ యాప్‌లో ఉంచాలి.
నెలాఖరులోగా డీఎస్సీ ఫలితాలు!
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11,063 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు జూలై 18 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ కీపై అభ్యంతరాలు ఉండే అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు నమోదు చేసుకోవాలని అఽధికారులు సూచించారు.
ఈ గడువు ముగిసిన 10 రోజుల్లో తుది కీతోపాటు ఫలితాలను కూడా వెల్లడించాలని భావిస్తున్నారు. అంటే.. ఈ నెలాఖరులోగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా, ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తుది కీని ప్రకటించనున్నారు. డీఎస్సీ ఫలితాలను ప్రకటించిన తర్వాత జిల్లాల వారీగా ఉపాధ్యాయుల భర్తీ చేపట్టనున్నారు. అందుకు అనుగుణంగా జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాలను రూపొందించనున్నారు.
Updated Date - Aug 15 , 2024 | 02:34 AM