ఇడ్లీ బండికీ రిజిస్ట్రేషన్
ABN, Publish Date - Oct 07 , 2024 | 04:00 AM
ఉదయం అల్పాహారం.. మధ్యాహ్నం భోజనం.. వీలైతే రాత్రికి కూడా.. బయటే తింటున్న రోజులివి..! దీనికితగ్గట్లే ఆన్‌లైన్ ఆహార పదార్థాల పంపిణీ సేవలు..!
వీధి ఆహార విక్రయదారులందరికీ తప్పనిసరి
వ్యాపారులు ఎఫ్‌ఎస్‌ఎస్ చట్టంలోకి.. భోజన పదార్థాల శుచి, శుభ్రతపై శిక్షణ
రూ.100తో ధ్రువపత్రం!.. తొలుత హైదరాబాద్‌లో, తర్వాత రాష్ట్రమంతటా..
25 వేల మందికి ప్రయోజనం.. దేశంలోనే తొలిసారి.. ప్రభుత్వ కీలక నిర్ణయం
హైదరాబాద్, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఉదయం అల్పాహారం.. మధ్యాహ్నం భోజనం.. వీలైతే రాత్రికి కూడా.. బయటే తింటున్న రోజులివి..! దీనికితగ్గట్లే ఆన్‌లైన్ ఆహార పదార్థాల పంపిణీ సేవలు..! ఈ క్రమంలో రాష్ట్రంలో రోజురోజుకు ఆహారాన్ని విక్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. వీరిలో వీధుల్లో అమ్మేవారూ ఉన్నారు. హైదరాబాద్‌లో అయితే గల్లీకో టిఫిన్ సెంటర్.. బజారుకో కర్రీ పాయింట్..! ఇలాంటి పరిస్థితుల్లో మరి శుచి, శుభ్రత సంగతి..? ఈ నేపథ్యంలోనే ప్రజలకు సురక్షిత ఆహారాన్ని అందించే విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వీధుల్లో ఆహారాన్ని విక్రయించే (స్ట్రీట్ ఫుడ్ వెండర్స్) వ్యాపారులందరినీ ఆహార భద్రతా ప్రమాణాల చట్టం (ఎఫ్‌ఎ్‌సఎస్ యాక్ట్) పరిధిలోకి తేనుంది. వీరందరికీ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది.
అంటే.. మన వీధిలోని ఇడ్లీ బండి నుంచి మార్కెట్లోని గప్‌చిప్ బండి వ్యాపారి వరకు అందరూ నమోదు కావాల్సిందే. దీనిని తొలుత హైదరాబాద్‌లో అమలు చేయనున్నారు. దశలవారీగా జిల్లాల్లోని వ్యాపారులకూ వర్తింపజేయనున్నారు. రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ ఈ మేరకు కసరత్తు పూర్తి చేశారు. రాష్ట్రంలో వీధి వ్యాపారులు వేలల్లో ఉన్నా ఒక గుర్తింపు లేదు. వారు అందించే ఆహారం నాణ్యతపై అనేక అనుమానాలుంటాయి. ఇలాంటివారిని క్రమబద్ధీకరించడంతో పాట ఎఫ్‌ఎ్‌సఎస్ చట్టంలోకి తీసుకురావాలని ఆహార భద్రతా విభాగం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారి వీధి ఆహార వ్యాపారులందరికీ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అయితే, రిజిస్ట్రేషన్ కోసం వీరంతా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఆహార భద్రతా విభాగం అధికారులే.. అల్పాహారాన్ని అందించే బండ్ల వద్దకు వస్తారు. విక్రేతల ఆధార్ కార్డు ఆధారంగా అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ధ్రువపత్రం జారీ చేస్తారు. కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. దీనిని ఏటా చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నా.. వ్యాపారుల్లో బాధ్యత, జవాబుదారీతనం పెంపునకు నామమాత్ర రుసుము తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
కాగా, రిజిస్ట్రేషన్‌తో సరిపెట్టకుండా.. ఆహార పదార్థాల పరిశుభ్రత పాటించడంలో ప్రాథమిక శిక్షణ అందించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. భారత జాతీయ వీధి వ్యాపారుల సంఘం (ఎన్‌ఏఎ్‌సవీఐ) సహకారం, నెస్లే ఇండియా స్పాన్సర్‌షి్‌పతో ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా 3 వేల మందికి శిక్షణ ఇచ్చారు. ఆహార తయారీలో మంచి పద్ధతులతో పాటు ముడి పదార్ధాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. శిక్షణ తర్వాత నేస్లే ఇండియా యాప్రాన్, గ్లోవ్స్, హెడ్‌క్యాప్, టవల్ తదితరాలతో కూడిన కిట్‌ను అందిస్తారు. శిక్షణ తాలూకు ధ్రువపత్రాలను జారీ చేస్తారు. కాగా, రిజిస్ట్రేషన్‌తో వ్యాపారులకు గుర్తింపు వస్తుంది. వినియోగదారుల్లో.. ఆహార పదార్థాల నాణ్యతపై నమ్మకం కలుగుతుంది. వ్యాపారులపై అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం లభిస్తుంది. జీహెచ్‌ఎంసీ, మునిసిపల్, పోలీసు విభాగాల నుంచి వేధింపులు కూడా ఉండవు.
ముద్ర రుణాలు వస్తాయి..
రిజిస్ట్రేషన్ ద్వారా వ్యాపారులకు గుర్తింపుతో పాటు ముద్ర రుణాల వంటివి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రయోగాత్మకంగా ఇప్పటికే కొంతమందికి శిక్షణ, ధ్రువపత్రాలు ఇచ్చాం. సుమారు 25-30 వేలమంది వీధి ఆహార వ్యాపారులు ఉంటారని అంచనా. వారందర్నీ ఎఫ్‌ఎ్‌సఎస్ యాక్టులోకి తెస్తాం.
-ఆర్వీ కర్ణన్, రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్
Updated Date - Oct 07 , 2024 | 04:00 AM