Hyderabad: ఫ్యూచర్ సిటీ 30 వేల ఎకరాల్లో
ABN, Publish Date - Nov 16 , 2024 | 03:23 AM
హైదరాబాద్ నగర శివార్లలో నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15 వేల ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
ల్యాండ్ పూలింగ్ విధానంలో 15 వేల ఎకరాలకు పైగా సేకరణ
ఇప్పటికే ప్రభుత్వం వద్ద 14 వేల ఎకరాలు
అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు సగం వాటా!
ప్రజల నుంచి వ్యతిరేకత తలెత్తకుండా జాగ్రత్తలు
నిర్మాణ పనులకు విస్తృతాధికారాలతో అథారిటీ
పాలకవర్గంతో పాటు కార్యనిర్వాహక మండలి
శరవేగంగా నిర్మాణాలకు సర్కారు సన్నాహాలు
300 అడుగుల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పనులు షురూ
వారంలో రెండో విడత భూసేకరణ నోటిఫికేషన్
త్వరలో ఫార్మా కంపెనీలకు భూకేటాయింపు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): హైదరాబాద్ నగర శివార్లలో నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15 వేల ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. దీనికి అదనంగా 15 వేల ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సర్కారు నిర్ణయించింది. అంటే మొత్తం 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనుంది. రైతుల అంగీకారంతో భూమిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేగాక పక్కనే ఉన్న వేల ఎకరాల అటవీ భూముల్లో కూడా పర్యాటకులను ఆకర్షించేలా నైట్ సఫారీ, తదితర ప్రాజెక్టుల రూపకల్పన చేస్తోంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టేందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయనుంది. దానికి పాలకవర్గంతో పాటు కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన శశాంకను ప్రభుత్వం కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఇటీవల జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీ నిర్మాణ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పనుల పర్యవేక్షణకు నానక్‌రాంగూడలోని హెచ్‌ఎండీఏ గ్రోత్ కారిడార్ కార్యాలయాన్ని కేటాయించారు. త్వరలోనే అవసరమైన సిబ్బందినీ నియమించనున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించనున్నారు.
భూసేకరణ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిహారం విషయంలోనూ కొంత ఉదారంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు 50-60 శాతం భూమి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. రైతులు కోల్పోతున్న భూమి విలువకు సమానంగా ఉండేలా అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని భావిస్తోంది. ఫ్యూచర్ సిటీలో నిర్మించే ప్రధాన రోడ్లకు ఆనుకొని ఉండే ప్లాట్లనే బాధిత రైతులకు కేటాయించనున్నట్లు సమాచారం. ఆ ప్లాట్లలో భారీ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వనున్నారు. దీంతో రైతులకు ఇచ్చే ప్లాట్లకు ఎక్కువ ధర లభించే అవకాశాలు ఉంటాయి. అసైన్డ్ భూములు సేకరించినా, వాటిని అనుభవిస్తున్న వారికి తగిన న్యాయం చేసేలా.. అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వనున్నారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీని కలుపుతూ రీజనల్ రింగురోడ్డు వరకు 41.5 కి.మీ. మేర నిర్మిస్తున్న 300 అడుగుల గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులను ప్రభుత్వం వేగిరం చేసింది.
తొలి విడత రావిర్యాలలోని ఔటర్ రింగు రోడ్డు ఎగ్జిట్ 13 నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్ డెవల్‌పమెంట్ యూనివర్సిటీ వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం కోసం ఇటీవల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రహదారి కోసం 449 ఎకరాల 27 సెంట్ల భూమిని సేకరిస్తోంది. ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి వెంటే మెట్రో రైలు నిర్మాణం కూడా చేపట్టనుంది. దీనికి సంబంధించి భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చిన సర్కారు.. రోడ్డు నిర్మాణానికి మార్కింగ్ పనులు కూడా పూర్తి చేసింది. మహేశ్వరం మండలంలోని కొంగరకుర్దు-ఏ గ్రామంతో పాటు ఇబ్రహీంపట్నం మండలంలోని ఫిరోజ్‌గూడ, కొంగరకలాన్, కందుకూరు మండలంలోని లేమూరు, రాచలూరు, తిమ్మాపూర్, గుమ్మడివెల్లి, పంజాగూడ, మీర్‌ఖాన్‌పేట గ్రామాల్లో మార్కింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారికి ఆనుకునే మెట్రోరైల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారికి రెండో విడత భూసేకరణ నోటిఫికేషన్‌ను ఈ వారంలోనే ఇవ్వనున్నారు. స్కిల్ వర్సిటీ నుంచి కొత్తగా నిర్మించే రింగు రోడ్డు వరకు భూసేకరణ కోసం నోటిఫికేషన్ సిద్ధం చేశారు. ఇందుకోసం దాదాపు 500 ఎకరాల వరకు సేకరిస్తున్నారు.
స్కిల్ వర్సిటీ పనులు షురూ!
ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న స్కిల్ వర్సిటీ నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు అదాని కంపెనీ రూ.100 కోట్ల విరాళం ఇవ్వగా, మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ (ఎంఈఐఎల్) రూ.200 కోట్లతో ఇక్కడ భవన నిర్మాణం చేపడతామని ముందుకు వచ్చింది. ఈ మేరకు కంపెనీ నిర్మాణ పనులను ప్రారంభించింది. వచ్చే ఏడాది తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి తొలివిడత భవన నిర్మాణం పూర్తిచేస్తామని ప్రకటించింది.
సమస్త సౌకర్యాలతో..
ఇదిలా ఉంటే అంతర్జాతీయ నగరాలకు దీటుగా ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందులో అన్ని వనరులు, సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. అన్నివర్గాల వారు ఇక్కడ జీవించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే మలక్‌పేటలో 150 ఎకరాల్లో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్‌ను ఇక్కడకు తరలించే ఏర్పాట్లు మొదలు పెట్టింది. అలాగే ప్రపంచ స్థాయి గోల్ఫ్ క్లబ్ నిర్మించేందుకు 250 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. ఇక్కడ పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉండడంతో ఇందులో పనిచేసే ఉన్నతశ్రేణి ఉద్యోగులు, వ్యాపారవేత్తల అభిరుచులకు అనుగుణంగా బిలియనీర్ల క్లబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. బీసీసీఐ కూడా ఇక్కడ అతిపెద్ద స్టేడియం నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఇక్కడ కంపెనీలు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో వాణిజ్య కేంద్రాన్ని నిర్మించేందుకు వరల్డ్ ట్రేడ్ ప్రతినిధులు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఇటీవల స్థల పరిశీలనకు వచ్చిన అసోసియేషన్ ప్రతినిధులు 70 ఎకరాలు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. ఫ్యూచర్ సిటీకి అవసరమైన తాగునీటిని కృష్ణా నది నుంచి తరలించనున్నారు. అలాగే ఇక్కడ వేల ఎకరాల్లోని పార్కులు, రోడ్లకు ఇరువైపులా ఉండే మొక్కల కోసం మూసీ నీటిని శుద్ధి చేసి వినియోగించాలని నిర్ణయించారు. మూసీ నీటిని తరలించేందుకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పక్క నుంచే ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారు.
త్వరలో ఫార్మా కంపెనీలకు
ఫ్యూచర్ సిటీలో హెల్త్ సైన్స్ పేరుతో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీని నిర్మించనున్నారు. ఇప్పటికే ఇక్కడ భూమి కోసం దాదాపు 300 ఫార్మా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో రాష్ట్రంలోని ప్రధాన ఫార్మా కంపెనీలకు తొలి విడత భూ కేటాయింపులు చేసేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. వీటిని ఫ్యూచర్ సిటీకి చివర్లో ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఐదు ఫార్మా కంపెనీలకు 50 ఎకరాల చొప్పున 500 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. మేడిపల్లి గ్రామ పరిధిలో ఈ భూ కేటాయింపులు చేయనున్నట్లు తెలిసింది. ‘కాలుష్య రహిత’ హామీతోనే ఈ భూములు కేటాయిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి కాలుష్యం లేకుండా పరిశోధన చేసే సంస్థలకు, బయటి నుంచి ముడి సరుకు తీసుకొచ్చి ఔషధాలు తయారు చేసే సంస్థలకే భూములు ఇవ్వనున్నారు.
Updated Date - Nov 16 , 2024 | 03:23 AM